మంగళగిరి నాని స్వీట్స్ చాలా ఫేమస్. క్వాలిటీ కి మారుపేరని చెబుతారు. ఇదే ఈ స్వీట్స్ ని మంగళగిరి సిగ్నేచర్ గా మార్చింది. దీని వెనక అసాధారణమయిన సక్సెస్ స్టోరీ ఉంది. సక్సెస్ ఫుల్ మిఠాయిల తీయదనం వెనక శ్రమ, నిజాయితీ, సహనం ఉంటాయి. చాలా మిఠాయిల షాపులన్నీ కూలిపనితో ప్రారంభమవుతాయి. ఆ తర్వాత బ్రాండ్ నేమ్ అవుతాయి. ఇలాంటి వాటికి ఉదాహరణ మంగళగిరి కొమ్మారెడ్డి నానీ ‘స్వీట్స్’. ఆయన తన తీపిని ఇపుడు సామాజిక సేవలో కూడా పంచుతున్నాడు.నానీ స్వీట్స్ ఇపుడు సంఘసేవకు, అన్నదానానికి పర్యాయపదం.
అత్యంత సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన కొమ్మారెడ్డి నాని చిన్ననాటి నుంచే కష్టాన్నే నమ్ముకున్నాడు. స్వయంకృషితో ఎదిగాడు. జీవితంలో కుదురుకున్నాక గతం మరచిపోలేదు. కష్టాల్లో ఉన్నవాళ్లకు తోడుగానిలబడాలనే ఫిలాసఫీ అలవర్చుకున్నారు. సామాజిక సేవ మీద దృష్టి సారించాడు. ఆపన్నులకు అండగా నిలిచాడు. దీనికి కూడా బాగా గుర్తింపు వచ్చింది.
‘ప్రార్థించే పెదవుల కన్నా… సాయం చేసే చేతులు మిన్న’ అన్న విశ్వమయి మదర్ థెరిసాను స్ఫూర్తిగా తీసుకున్న నాని తన సేవాకార్యక్రమాలను విస్తృత పరిచేందుకు మంగళగిరిలో కొమ్మారెడ్డి సేవాసమితిని నెలకొల్పి ముందుకు సాగారు. ఈ సంస్థకు మేనేజింగ్ ట్రస్టీగా కొమ్మారెడ్డి సుబ్రహ్మణ్యం (నాని) విభిన్న సేవాకార్యక్రమాలు సయితం చేపట్టి ఈ ప్రాంతంలో వదాన్యుడిగా పేరొందారు. డిసెంబరు 14 నాని పుట్టిన రోజు. ఈ సందర్భంగా నాని జీవన ప్రస్థానం.. సేవాకార్యక్రమాలపై ప్రత్యేక కథనం…
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు దగ్గర కౌతవరానికి చెందిన కొమ్మారెడ్డి వెంకటేశ్వరరావు, సుబ్బమ్మ దంపతులకు 1962 డిసెంబరు 14న నాని జన్మించారు. ఏడేళ్ల పసిప్రాయంలోనే ఉపాధి వెతుక్కోవాల్సిన పరిస్థితి. విజయవాడలోని ఓ స్వీటు షాపులో పనిచేసిన నాని మూడున్నర దశాబ్దాల కిందట మంగళగిరికి చేరారు. స్థానికంగా స్వీటు దుకాణంలో కార్మికుడిగా చేరి కొంత అనుభవం గడించాక సొంతంగా మిఠాయిబండి పెట్టుకున్నారు. స్వీట్ల తయారీలో నైపుణ్యంపొంది.. కొంతకాలానికి నాని స్వీట్స్ షాపు ప్రారంభించారు.కృషి ఫలించింది. వ్యాపారంవిజయవంతమయింది. ఆయన మిఠాయిలో వ్యాపారంలోనే స్థరపడాల్సివచ్చింది. ఆర్థికంగా నిలదొక్కుకున్నాక తన తల్లి సుబ్బమ్మ సంస్మరణార్థం ప్రతియేటా ఆమె వర్ధంతి సందర్భంగా అన్నదానం చేస్తున్నారు.
మంగళగిరి, పరిసర ప్రాంతాల దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, కాలిపర్స్ పంపిణీ వంటి సేవాకార్యక్రమాలకు నాంది పలికారు. ఈ క్రమంలో 1998సెప్టెంబరు 6న ప్రముఖస్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య స్వహస్తాలతో కొమ్మారెడ్డి సేవాసమితికి శ్రీకారం చుట్టారు. వేసవిలో చలివేంద్రాలు, కంటి వైద్య, ఆరోగ్య శిబిరాలతోపాటు ఉచిత అంబులెన్స్ సేవలు అందించారు.
వైవిధ్య సేవాకార్యక్రమాలకు నాంది…
సేవాకార్యక్రమాల్లో నానిది వైవిధ్యశైలి. నగరంలోని శ్మశాన వాటికల అభివృద్ధికి నడుం బిగించారు. ఆత్మకూరు వీవర్స్ కాలనీరోడ్డులోని శ్మశానం, పాతమంగళగిరిలోని దింపుడుకళ్లెం రోడ్డులోని శ్మశాన వాటిక, తెనాలి రోడ్డులోని శ్మశానవాటిక, బాపనయ్యనగర్లోని శ్మశానవాటికలను అభివృద్ధి పరచడంతో పాటు బోర్లు వేయించారు.
నాని విభిన్నసేవాకార్యక్రమాల పుణ్యమా… శ్మశానాలలో ఆప్తుల అంతిమ వీడ్కోలు పలికేందుకు పరిశుభ్రత సంతరించుకుంది. అంతేకాదు పట్టణంలో పార్ధివదేహాలను శ్మశానవాటికకు తీసుకువెళ్లేందుకు ఉచిత మహాప్రస్థాన వాహనసౌకర్యాన్ని కల్పించారు నాని.
కరోనా మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో ఆపన్నులకు అండగా తన వంతుగా కొమ్మారెడ్డి సేవాసమితి సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుంది.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఎంతో తెగువతో సేవలందించిన పారిశుధ్య కార్మికులు 320 మందికి కొమ్మారెడ్డి సేవాసమితి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
మేనేజింగ్ ట్రస్టీ కొమ్మారెడ్డి నాని పారిశుధ్య కార్మికుల పాదాల వద్ద పుష్పాలతో వందనాలు తెలియజేసి వారి సేవలను కొనియాడారు.
ఇంకా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఇప్పుడు తాజాగా ప్రతి గురువారం ‘నాని నాస్తా’ పేరిట పేదలకు అన్నదానం చేస్తున్నారు. వివిధ సంస్థల్లో తన వంతు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
తన సంపాదనలో గణనీయ మొత్తంలో సేవాకార్యక్రమాలకు వెచ్చించే నాని.. రాజకీయాల్లోకి వెళ్లారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 28వ వార్డు కౌన్సిలర్ గా గెలుపొంది తనదైన శైలిలో వార్డు అభివృద్ధితోపాటు సేవాకార్యక్రమాలు నిర్వర్తించారు. ప్రస్తుత ‘రాజకీయ’ వాసనలు పట్టని నాని నిస్వార్థంగానే సేవలందించి పలువురి మన్ననలు పొందారు.