తిరుమల: డిసెంబ‌రు 15న చ‌క్ర‌తీర్థ ముక్కోటి

తిరుమలలో జరిగే అత్యంత ప్రముఖమైన ఉత్సవాల‌లో ఒక్క‌టైన చక్రతీర్థ ముక్కోటి డిసెంబ‌రు 15న బుధ‌వారం జరుగనుంది.
పౌరాణిక నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసివున్న శేషగిరులమీద దక్షిణభాగంలో మహా పవిత్రతీర్థమైన చక్రతీర్థం ఉంది.
చక్రతీర్థ ముక్కోటి నాడు ఉద‌యం అర్చకులు, పరిచారకులు మంగళవాయిద్యాలతో ఆలయం నుండి ప్రదక్షిణంగా చక్రతీర్థానికి వెళతారు. చక్రతీర్థంలో వెలసివున్న శ్రీ చక్రత్తాళ్వారువారికి, శ్రీ నరసింహస్వామివారికి, శ్రీ ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం, పూజ‌లు చేస్తారు. అనంతరం హారతి నివేదించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.
స్కంద పురాణం ప్ర‌కారం పద్మనాభ మహర్షి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశారు. అందుకు సంతసించి శంఖచక్రగధాభూషితుడైన శ్రీ మ‌హావిష్ణువు ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్థానమయ్యారు.
స్వామి ఆజ్ఞానుసారం పద్మనాభ మహర్షి చక్రతీర్థంలో తపస్సు చేశారు. అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించారు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపి ఆ రాక్షసుని సంహరించారు. ఆ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉంచి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని మహర్షి కోరారు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది.
వరాహ పురాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా ఉన్న సప్త తీర్థాలలో చక్ర తీర్థం ప్ర‌ముఖ తీర్థంగా వెలుగొందుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *