అమరగాయకులకు తెలంగాణ కన్నీటి ప్రమిద

“పండు వెన్నెలలోన వెన్నెల్లలోన పాడేటి పాటలేమాయె? మా పల్లెటూరిలోన ఆడేటి ఆటలేమాయె?” అని ఊరూరా, వీధివీధిన దేవులాడుకున్న గొంతులు ఒక్కటొక్కటిగా మూగబోతున్నాయి. పండువెన్నెలలోన పాటలు పూయించిన ప్రజానాట్యమండలి నిస్సార్ విశాలాకాశంలో తప్పి పోయిన చంద్రుని వలె కనుమరుగైనాడు. “ఎవ్వడైతెనేందిరా చెట్టుమీది కొంగలే. జనం సొమ్ము తినమరిగిన బట్టెబాజ్ దొంగలే” అని జంగ్ సైరన్ మోగించిన జంగ్ ప్రహ్లాద్ గొంతు జంగ్ పట్టి, పూడుకపోయింది. భువనగిరిని ఆనుకుని, హునుమాపురంలోని వందల ఎకరాల భూములు ఉద్యమాలలో పొగొట్టుకొని, పొట్ట చేతపట్టుకొని, పట్టణంలో అంగలార్చాడు మన ప్రహ్లాద్. తన బతుకు వలెనే గతుకులు తేలిన రోడ్డు మీద స్కూటర్ నడుపుతూ, గాయపడిన ప్రహ్లాద్ భార్యాబిడ్డలను వీధులపాలు చేసి, అనంతలోకాలకు వెళ్లిపోయాడు.

“దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే” అని గర్వించిన జైశ్రీనివాస్ ఆస్పత్రిలో తేజోవిహీనుడైనాడు. “ఉండు పయిలంగుండు అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ” అని పాడి పాడి జీరబోయిన గొంతుతో ఊరూరా ఏడిపించిన పయిలం సంతోష్ బొంబాయి బదులు అనంతలోకాలకు వెళ్లిపోయినాడు.

——————————————————————–పండు వెన్నెలలోన పాటలు పూయించిన గాయకులకు స్వరాంజలి
అమరగాయకులకు తెలంగాణ కన్నీటి ప్రమిద
తేది: నవంబర్ 28(ఆదివారం), 2021, సాయంత్రం 5 గం.కు
స్థలం: సుందరయ్య విజ్ఞానకేంద్రం,బాగ్ లింగంపల్లి, హైదరాబాద్
——————————————————————–

తెలంగాణ సాంస్కృతిక వైతాళికుడు, ప్రజా యుద్దనౌక గద్దర్ మీద ఆరు తూటాలు కురిపించిన కిరాయి హంతులెవరో ఈనాటికీ పట్టుకోలేదు. బహుజన బతుకమ్మ కిరీటం విమలక్కను ఇంటినుంచి తరిమేసి, స్వంత రాష్ట్రంలో పరాయి జీవితం గడపాలని ఆదేశించారు. గద్దర్ తో వేల గ్రామాలు తిరిగి, డోలక్ వాయించిన దామోదర్ యవ్వనంలోనే నూరేళ్లు నింపుకున్నాడు.

“హృదయమున మీ చరిత్రముల్ పదిలమాయె, మరతుమన్నన్ మీ స్మృతుల్ మరపురావు, మీ విధానం చారిత్రక అవసరం, అవే మాకు సదా వెలుగు రేఖ, మీకు అంజలి ఘటించి పాడెద” అంటూ అమర గాయకులను గుర్తు చేసి, మన కంటనీరు పెట్టించిన అరుణోదయ రామారావు అస్తమించినా, ఆ కంఠం తెలుగు వీధులలో మారుమోగుతూనే ఉన్నది.

జల్, జంగల్, జమీన్ పై పరాయి పెత్తనం పారదోలి, నేలబిడ్డల స్వపరిపాలన కోసం శతాబ్దాలుగా తెలంగాణ గడ్డమీద సాగుతున్న బతుకు పోరాటానికి వంత సాగింది పాట. వెంట ఊగింది కళాకారుని గోచీ, గొంగడినే. ఊళ్లల్లో ఊరేగింది గాయకుల ఎండిన డొక్కలే. తెలంగాణ జనపదాలు క్రమంగా జానపదాలుగా జాలువారి, తెలంగాణ వీరుల నరనరాన ప్రవహించాయి. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ బిడ్డలకే దక్కాలని సాగిన తొలిదశ, మలిదశ ఉద్యమాలలో గాయకులు, కళాకారుల ఉచ్చ్వాస, నిశ్వాసాల మీదే పోరాట జెండా ఎగిరింది.

స్వరాష్ట్రం సాధించిన తరువాత తెలంగాణ బిడ్డలు, కళాకారులకు దక్కింది మొండి చేతులే. తెలంగాణ సంస్కృతికి సారథిగా కృష్ణుడో, అర్జునుడో కాకుండా, శకుని, శల్యుడు రథం పగ్గాలు చేతపట్టారు. అందువల్లే కళాకారులతో పాటు వారి కళ, గేయాలు కూడా మూగబోతున్నాయి. ఈ నీవర నిశబ్ధ సాంస్కృతిక జడత్వాన్ని అంతం చేసి, దిక్కులు పిక్కటిల్లే విధంగా గజ్జెకట్టి డోలు, డప్పులు మోగించి, సాంస్కృతిక ఉద్యమాన్ని పునరుజ్జీవింపచేద్దాం.

“సిరిసిరి కొండల సింహనాదములు మూగబోయెనయ్యో.. వెన్నెల సాక్షిగా రేల పాటలు నేలరాలెనయ్యో” అని అరుణోదయ విమలక్క దు:ఖించినట్లు వేనవేల రేల పాటలు నేల రాలుతున్నాయి. గాయకుల శరీరాలు దారిద్రపు అగ్నిలో కాలుతున్నాయి. భుజాన సద్దిమూటలతో ఊరూరా తెలంగాణ సాధన కోసం బతుకమ్మలు, బోనాలు, అసోయ్ దూలా ఆటలు, కోలాటాలు, డప్పు, డోళ్ల విన్యాసాలు, బొగ్గుబాయి నుంచి బొగ్గుబాయికి అంటూ ఆటపాటల పాదయాత్రలు చేసిన కళాకారులు ఒక్కరొక్కరుగా రాలిపోతున్నారు.

తెలంగాణ అమర కళాకారులను, తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య, అరుణోదయ, ప్రజానాట్యమండలి, జననాట్యమండలి, ప్రజాకళామండలి కళాకారుల ఆటపాటలను, నిస్వార్థ త్యాగాలను మరిచిపోతున్న సమాజానికి వారి సేవలను, జ్ఞాపకాలను గుర్తు చేద్దాం. వారి పాటలు తిరిగి మారుమోగిద్దాం. రాండ్రి.. ఆడుదాం.. పాడుదాం. అమరగాయకులను స్మరించుకుందాం. ఈ కర్తవ్య నిర్వహణకు నాందిగా నవంబర్ 28 (ఆదివారం), 2021 నాడు సాయంత్రం 5 గంటలకు పర్జన్యశంఖం పూరిద్దాం. పండువెన్నెలలోన పాటలు పూయిద్దాం. మరతుమన్నను మరపురాని అమరగాయకుల గానం చారిత్రక అవసరంగా అంజలి ఘటించి మారుమోగిద్దాం. కళాకారుల గొంతులో స్వరమవుదాం వారి ఆటలో పదఘట్టనవుదాం. రాండ్రి.

– తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *