తైవాన్ చైనాలో అంతర్గత భాగమే!

డాక్టర్ . యస్. జతిన్ కుమార్ 
ఇటీవల అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ సమాఖ్య లోని కొన్ని దేశాలు తైవాన్ ను ఒక  సమస్య గా మారుస్తున్నాయి. ఈనాడు  అమెరికా భూ భౌగోళిక రాజకీయాలలో భాగంగా,  చైనా విస్తృతిని అడ్డుకునే లక్ష్యంతో చైనా వ్యతిరేక కూటమి  తైవాన్ లో మంట రాజేయటానికి పూనుకుంటోంది. అక్కడ వున్న నాజూకు స్థితిని  అడ్డం  పెట్టుకుని ఈ ప్రాంతాన్ని ఆయుధాగారం గా మార్చి చైనా వ్యతిరేక యుద్ధ శక్తులను ప్రోత్సహిస్తున్నది. తైవాన్ పై యుద్ధ మేఘాలు కమ్ముకోవటానికి  వీరి వత్తాసు, చైనాను అస్థిరపరచాలనే వీరి దుష్ట ప్రయత్నాలదే  బాధ్యత. ఇండియా కూడా వారితో గొంతుకలిపి తాను ఇదివరకు ప్రకటించిన సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రిపబ్లిక్ ఆఫ్ చైనాను తొలగిస్తూ ఏర్పడిన   పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను చైనా ప్రజల  ప్రతినిధిగా, ప్రభుత్వంగా గుర్తించిన తొలి దేశాలలో ఇండియా ఒకటి. కానీ ఈనాడు అమెరికా వ్యూహంలో భాగంగా  చైనాకు వ్యతిరేకంగా నిలుస్తున్నది.    చరిత్రను వాస్తవిక దృష్టితో  బాధ్యతగా పరిశీలించడం అవసరం అని భావిస్తున్నాను.   
మొదటిది, తైవాన్ చైనా భూభాగంలో విడదీయరాని భాగం. తైవాన్ సమస్యను అర్థం చేసుకోవడానికి ముందు చైనా చరిత్ర నుండి వాస్తవాలను   తెలుసుకోవాలి. తైవాన్, చైనా ప్రజల మధ్య సంబంధాల  ప్రారంభం, అభివృద్ధి 1,700 సంవత్సరాల క్రితం రాసిన పురాతన చైనీస్ పుస్తకాలలో నమోదు చేయబడింది. 12 వ శతాబ్దం మధ్యలోనే , చైనా తైవాన్ లో పరిపాలనా సంస్థలను స్థాపించింది. 1885లో తైవాన్ ను క్వింగ్ రాజవంశం ఒక ప్రావిన్స్ గా ప్రకటించింది. తరువాత, 1894 లో చెలరేగిన మొదటి సినో-జపనీస్ యుద్ధం తరువాత జపాన్, తైవాన్ ను ఆక్రమించింది. 1945 వరకు అది జపాన్ పాలనలోనే వుంది. 1931లో చైనా ప్రజలు జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా ప్రతిఘటన యుద్ధాన్ని ప్రారంభించారు, ఇది ప్రపంచ ఫాసిస్టు వ్యతిరేక యుద్ధంలో కూడా భాగంగా ఉంది. 14 సంవత్సరాలు సాగిన  ఆ యుద్ధ సమయం లో  1943 డిసెంబరు 1న చైనా, అమెరికా, యూకే లు కైరో డిక్లరేషన్ పై సంతకాలు చేశాయి . ఆ డిక్లరేషన్ పేర్కొన్నట్లుగా, ”  జపాన్ స్వాధీనం చేసుకున్న లేదా ఆక్రమించిన పసిఫిక్ లోని అన్నిద్వీపాలనుండి జపాన్ తొలగి పోవాలి. మంచూరియా, ఫోర్మోసా (తైవాన్), పెస్కాడోర్స్ వంటి చైనా నుండి జపాన్ ఆక్రమించిన అన్ని భూభాగాలు  చైనాకు పునరుద్ధరించ బడతాయి .” 1945లో సంతకం చేయబడిన పోట్స్డామ్  ప్రకటన “కైరో డిక్లరేషన్ యొక్క షరతులు అమలు చేయబడతాయి” అని పునరుద్ఘాటించింది.
చైనా ప్రజలు జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా చేసిన ప్రతిఘటన యుద్ధం, ఫాసిస్టు వ్యతిరేక యుద్ధం 1945 సెప్టెంబర్లో విజయాన్ని సాధించడంతో తైవాన్ చైనా చేతికి  వచ్చింది. కానీ ఆ తరువాత కొద్ది కాలానికే,  చైనా ప్రజా విప్లవ వెల్లువలో చెలరేగిన అంతర్యుద్ధం, విదేశీ శక్తుల  జోక్యం కారణంగా, తైవాన్ జలసంధి యొక్క రెండు పక్కల వున్న ప్రాంతాలు  రాజకీయ పాలనాపరమైన చీలికలను ఎదుర్కొన్నాయి. 70 సంవత్సరాలుగా ఈ  ప్రత్యేక స్థితి కొనసాగుతున్నది. అయితే, తైవాన్ ప్రాంతమూ, చైనా ప్రధాన భూభాగమూ రెండు వేర్వేరు దేశాలు కావు. ఒకే చైనాకు చెందినవి. తైవాన్, చైనా రాజ్యంలో  విడదీయరాని భాగమే 
రెండవది, ఏక-చైనా సూత్రం [ఒకటే చైనా అన్నది] అంతర్జాతీయ సమాజం అంగీకరించిన  ఏకాభిప్రాయం. ఏక-చైనా సూత్రాన్ని సమర్థించడం అనేది అంతర్జాతీయ సంబంధాలను నిర్వహించడంలో  సార్వత్రికంగా గుర్తించబడిన నియమం. ఇతర దేశాలతో సంబంధాలను అభివృద్ధి చేసుకోవడానికి చైనాకు ఇది ఒక  రాజకీయ ఆధారంగా వున్నది. 1971 అక్టోబరు 25న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 26వ సమావేశంలో తీర్మానం 2758ను అఖండ మెజారిటీతో ఆమోదించారు. ఐరాస లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క చట్టబద్ధ మైన స్థానాన్ని పునరుద్ధరించారు . ఐక్యరాజ్యసమితిలో, సమితి అన్నిసంస్థలలో అప్పటి తైవాన్ అధికార ప్రతినిధులను[రిపబ్లిక్ ఆఫ్ చైనా ను] అన్నీ స్థానాల నుండి తొలగించారు . 
1978 డిసె౦బరులో జారీ చేయబడిన దౌత్య స౦బ౦ధాల స్థాపనపై చైనా-యుఎస్ సంయుక్త అధికారిక ప్రకటనలో అమెరికా, “పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వాన్ని చైనా ఏకైక చట్టబద్ధమైన ప్రభుత్వ౦గా గుర్తిస్తో౦ది,” “ఒకే చైనా, తైవాన్ చైనాలో భాగ౦గా ఉన్నాయనే  చైనా వైఖరిని అ౦గీకరిస్తో౦ది.” అని నిర్ద్వన్దం గా ప్రకటించింది.  ఏక-చైనా సూత్రానికి అనుగుణంగా, చైనాతో దౌత్య సంబంధాలు కలిగి ఉన్న మొత్తం 180 దేశాలు చైనా ప్రభుత్వంతో  అవగాహనకు వచ్చాయి, అధికారిక ఒప్పందాలు చేసుకున్నాయి. అందువల్ల వారు ఇకపై తైవాన్ తో అనధికారిక సంబంధాలను మాత్రమే కొనసాగిస్తామని వాగ్దానం చేశారు. “తైవాన్ స్వాతంత్ర్యాన్ని అంగీకరించ వద్దని చైనా ప్రభుత్వం ఇతర దేశాలపై ఒత్తిడి తెస్తుంది” అనే తప్పుడు వాదన తైవాన్ సమస్యపై  కొంతమంది అజ్ఞానాన్నీ, వారి వక్రీకరణనూ బహిర్గతం చేస్తుంది. 
మూడవది, “తైవాన్ కు వ్యతిరేకంగా చైనా సైనిక బలవంతం” అన్న  ప్రచారం  నిరాధారమైనది. తైవాన్ జలసంధి అంతటా ఉద్రిక్తతలు పెచ్చరిల్లడంలో, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డిపిపి) అధికారులు, తైవాన్ వేర్పాటువాద శక్తులు విదేశీ దళాలతో కలిసి “తైవాన్ స్వాతంత్ర్యం” అని రెచ్చగొడుతున్న  నేపధ్యం వుంది.  శాంతియుత పునరేకీకరణ అనేది జలసంధికి ఇరువైపులా ఉన్న ప్రజల ఉమ్మడి ఆకాంక్ష. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపించబడినప్పటి నుండి, చైనా ప్రభుత్వం తైవాన్ సమస్యను పరిష్కరించడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. “తైవాన్ జలసంధికి రెండు వైపులా వున్న జాతీయ శక్తులు  ఒకే చైనాకు చెందినవి, అవి జాతీయ పునరేకీకరణ దిశగా కలిసి పనిచేస్తాయి” అని 1992 లో ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి చేరుకున్నాయి. 
 “మేము శాంతియుత పునరేకీకరణను సాధించడానికి అత్యంత శ్రద్ధతో ప్రయత్నాలు చేస్తాము కాని  “తైవాన్ స్వాతంత్ర్యం” పేర  వేర్పాటువాద కార్యకలాపాలను సాగనివ్వము.  మేము బాహ్య శక్తుల జోక్యంనుండి, అతి తక్కువ సంఖ్యలో వున్న వేర్పాటు వాదుల నుండి, తైవాన్ను కాపాడాలని లక్ష్యంగా పెట్టుకున్నాము, తైవాన్ లోని మా స్వదేశీయులను మేము లక్ష్యంగా చేసుకోము . ఇక  “సైనిక బలాత్కార౦” అనే విమర్శకు తావు ఎక్కడిది? అని చైనా వర్గాలు అడుగుతున్నాయి. 
నాల్గవది, చైనా తైవాన్ యొక్క “అంతర్జాతీయ స్థానాన్నిహరించి వేసిందని  ఆరోపించడం అసంబద్ధమైనది.  కొంతమంది రాజకీయ నాయకులు ఐక్యరాజ్యసమితిలో “తైవాన్ ప్రవేశం” కోసం గొంతు చించుకుంటు న్నారు. ఈ చర్యలు ఏక-చైనా సూత్రానికి ఒక స్పష్టమైన సవాలు, యు ఎన్ జి ఎ తీర్మానం 2758 ను అవి నిర్మొహ మాటంగా ఉల్లంఘిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలలో తైవాన్ ప్రాంతం పాల్గొనడంపై చైనా ప్రభుత్వానికి స్పష్టమైన, స్థిరమైన అవగాహన వుంది. ఇది ఏక-చైనా సూత్రానికి అనుగుణంగా ఉండాలి. ఇది యుఎన్ జిఎ 2758తీర్మానంలో పొందుపరచబడిన ఒక ముఖ్యమైన సూత్రం.
ఐరాస సార్వభౌమ రాజ్యాలతో కూడిన అంతర్జాతీయ సంస్థ. ఐక్య రాజ్య సమితిలో లేదా సార్వభౌమ రాజ్యాలను మాత్రమే తమ సభ్యత్వానికి చేర్చుకునే మరే ఇతర అంతర్జాతీయ సంస్థలో నయినా  చేరడానికి ఒక  చైనా ప్రావిన్స్ గా, తైవాన్కు అర్హత లేదు. తైవాన్ లోని సహచరుల ప్రయోజనాలు, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని, చైనా ప్రభుత్వం తైవాన్ ను ఏక-చైనా సూత్రం ప్రకారం, “చైనీస్ తైపీ” పేరుతో డబ్ల్యుటిఒ, ఎపిఇసిలో వంటి అంతర్జాతీయ సంస్థలలో పాల్గొనడానికి అనుమతిస్తుంది, ఇది తైవాన్ కు  ప్రపంచంలోని మిగిలిన ప్రజలకు మధ్య ఆర్థిక,సాంస్కృతిక మార్పిడి అవకాశాన్ని పూర్తిగా కలిపిస్తోంది .
“అంతర్జాతీయ స్థానాన్ని” అడిగే తైవాన్ అధికారులు వాస్తవానికి “రెండు చైనాలు” లేదా “ఒక చైనా, ఒక తైవాన్”వంటి వాదనలకు  ప్రోద్బలం ఇస్తున్నారు.  తైవాన్ ను చైనా నుండి విడదీయటానికి  ప్రయత్ని స్తున్నారు. ఇటువంటి వేర్పాటువాద ప్రయత్నాలు ప్రపంచంలోని ఏ ప్రభుత్వానికి సహించ రానివి. జాతీయ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను నిల బెట్టడానికి, విభజనను వ్యతిరేకించడానికి, పునరేకీకరణను సాధించడానికి – ఐరాస, దాని సభ్య దేశాల నుండి మద్దతును గెలుచుకోవడం సాధ్యమవుతుందని చైనా నమ్ముతోంది.
ఐదవది, తైవాన్ జలసంధి యొక్క రెండు వైపులా పునరేకీకరణ అనేది ఒక అనివార్యమైన చారిత్రాత్మక ధోరణి.ఇది చైనీయులందరి ఉమ్మడి ఆకాంక్ష.“శాంతియుత మార్గాల ద్వారా శాంతియుత పునరేకీ కరణ, ‘ఒక దేశం ,రెండు వ్యవస్థలు ”అనే  ప్రాథమిక విధానాలకు మేము కట్టుబడి ఉంటాము, ఏక-చైనా సూత్రాన్ని, 1992 ఏకాభిప్రాయాన్ని సమర్థిస్తాము. సంబంధాల శాంతియుత అభివృద్ధికి కృషి చేస్తాము. “తైవాన్ స్వాతంత్ర్యం” లక్ష్యంగా విడిపోవడం జాతీయ పునరేకీకరణకు అతిపెద్ద అడ్డంకి. తైవాన్ ప్రశ్న పూర్తిగా చైనాకు అంతర్గత విషయం, బాహ్య జోక్యాన్నిచైనా అనుమతించదు. జాతీయ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను రక్షించుకునే  చైనా ప్రజల సంకల్పాన్ని,సామర్థ్యాన్ని ఎవరూ తక్కువగా అంచనా వేయ కూడదు ” అని చైనా పలుమార్లు స్పష్టం చేసింది. 
తైవాన్ ప్రశ్న చైనా సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత మరియు ప్రధాన ప్రయోజనాలకు సంబంధించినది, మొత్తం 140 కోట్ల చైనా ప్రజల జాతీయ మనోభావాలకు చెందినది. తైవాన్లోవున్న 2.3 కోట్ల సహజన్ము లతో సహా చైనీయులందరికీ చెందినది, తైవాన్ భవిష్యత్తును చైనా ప్రజలందరూ సంయుక్తంగా నిర్ణయించాలి. అంతర్జాతీయ అభిప్రాయం ఏక-చైనా సూత్రానికి కట్టుబడి ఉందని గుర్తించాలి. మనం  చైనా జాతీయ పునరేకీకరణను అర్థం చేసుకోవాలి.
[ఇశ్రాయేల్ లోని చైనా రాయబార కార్యాలయం అధికారి యు దిమింగ్ వ్యాసం ఆధారంగా ] 
.     
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *