భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం నవంబర్ 14ను బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయన స్వాతంత్య్ర యోధుడే కాదు, నిరంతర చదివరి,రచయిత, పండితుడు కూడా. ఆయన జీవితంలో చాలా ఆసక్తికరమయిన విషయాలున్నాయి. అందులో కొన్ని…
11 సార్లు నోబెల్ బహుమతికి నామినేషన్
మహాత్మాగాంధీలాగే జవహర్ లాల్ నెహ్రూకు కూడా నోబెల్ బహుమతి రాలేదు. కనీసం పద కొండు సార్లు ఆయన పేరును నోబెల్ బహుమతి కోసం సిఫార్స్ చేశారు. నోబెల్ కమిటీ చాలా సార్లు ఆయన పేరును పరిశీలించింది. అయినా సరే, ఒక్క సారి కూడా నవభారత నిర్మాత అని పేరున్న జవహర్ లాల్ నెహ్రూ నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక కాలేదు.1946లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న ఎమిలీ గ్రీన్ బాల్చ్ (Emily Greene Balch) కూడా నెహ్రూ పేరును నోబెల్ బహుమతికి నామినేట్ చేశారు.
15 సం. దాకా హోమ్ స్కూలింగే
నెహ్రూ నాటి అందరి బాలల్లాగా ప్రాథమిక విద్య పాఠశాలలో చదవలేదు. ఆయన తండ్రి బాగా పేరున్న, ధనార్జన ఉన్న న్యాయవాది అయిన మోతీలాల్ నెహ్రు. అందుకే కుమారుని ఇంటి వద్దనే (Homeschooling) ఉంచుకుని బాగా పేరున్న ఇంగ్లీష్ ఉపాధ్యాయులను, బోధకులను నియమించి చదవు చెప్పించాడు. అలా 15 సంవత్సరాల వయసు వచ్చే నెహ్రూ హోం స్కూలింగ్ లోనే విద్యనభ్యసించాడు.
పదేళ్ల పాటు జైలులో
స్వాతంత్య్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్న నెహ్రూ అనేక సందర్భాలలో జైలుకు వెళ్లాడు. ఆయనను ఉద్యమ సమయంలో మొత్తంగా పది సంవత్సరాల కాలం బ్రిటిష్ పరిపాలకులు జైలులో ఉంచారు. లెక్కిస్తే నెహ్రూ 9 సార్లు జైలు కెళ్లి 3,259 రోజులు జైలులో ఉన్నారు.
ప్లేబాయ్ లో నెహ్రూ ఇంటర్వ్యూ
‘ప్లేబాయ్’ అనే మ్యాగజైన్ పేరువిన్నారు కదా? అది పెద్దల పత్రిక. అయితే, ఈ పత్రిక ఒక సారి జవహర్ లాల్ నెహ్రూ ఇంటర్య్వూను ప్రచురించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎందుకంటే ఎంటర్ టైన్ మెంట్ సెలెబ్రిటీలు,మోడెల్స్ ఫోటోలతో వచ్చే ఈ పత్రికల్ సాధారణంగా నెహ్రూ వంటి ప్రపంచస్థాయి నేతల ఫోటోలు, ఇంటర్వ్యూలు అచ్చుకావడం అరుదు. అలాంటిది, ఒక సారి నెహ్రూ ఇంటర్వ్యూని ప్రశ్నలు-జవాబుల రూపంలో ప్రచురించింది. ఈవిషయాన్ని కవర్ పేజీ మీద ఒక మోడెల్ ముఖచిత్రం కింద గొప్పగా రాసుకుంది.1963 నవంబర్ సంచికలో వచ్చిన ఈ ఇంటర్వ్యూ ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఈ ఇంటర్వ్యూలో రవీంద్రనాథ టాగూర్, మహాత్మాగాంధీ, చైనా యుద్దం తదితర అంశాల మీద నెహ్రూ చెప్పిన అభిప్రాయాలున్నాయి. ఆ పత్రిక కూడా వివరంగా చెప్పలేదు. నిజంగా అది నెహ్రూ ఇచ్చిన ఇంటర్వ్యూయా లేక అక్కడ నెహ్రూచెప్పిన విషయాలను ప్రశ్నలు,జవాబుల రూపంలో అతికించి ప్రచురించారా అనేది చాలా కాలం ఎవరికీ తెలియదు. అయితే, ఆ మధ్య తమకు 55 సంవత్సరాల కిందట నెహ్రూ ఇంటర్వ్యూ ఇచ్చినట్లు ప్లేబాయ్ ధృవీకరించినట్లు ఇండియా టుడే రాసింది.
Playboy had confirmed that the then Prime Minister Jawaharlal Nehru gave an interview to the adult magazine 55 years ago. https://t.co/hIpmOwPdZS
— IndiaToday (@IndiaToday) June 29, 2018
నెహ్రూ పేవరెట్ సిగరెట్
నెహ్రూ ధూమపాన ప్రియుడు. ఆయనకు ఇష్టమైన బ్రాండ్ ‘555’ సిగరెట్. నెహ్రూ సిగరెట్ కాలుస్తున్న ఫోటోలో కొన్నింటికి చాలా ప్రాముఖ్యత లభించింది. ఆయన ఫిల్టర్ తోనే సిగరెట్ కాల్చే వారు.
నెహ్రూ ప్రేమాయణం
బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ , స్వతంత్ర భారత మొదటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్. ఆయన భార్యపేరు ఎడ్వినా మౌంట్ బాటెన్. ఎడ్వినా, నెహ్రూల మధ్య ప్రేమాయణం సాగిందని చాలా మంది చెబుతారు. పలుపుస్తకాల్లో ఈ విషయం గురించి రాశారు. ఈ విషయం మీద ఎడ్వినాకూడా కూతురుపామెలా హిక్స్ మౌంట్ బాటెన్ ఆ మధ్య Daughter of Empire: Life as a Mountbatten అనే పుస్తకం రాశారు. ఇది 2012లో ప్రచురితమయింది.ఇండియాలో ఇది 2017లో ప్రచురితమయింది. నెహ్రూకు ఎడ్వినాకు చాలామంచిసాన్నిహిత్యం ఉందని, ఒకరంటే ఒకరికి చాలా గౌరవ భావం ఉండేదని 1947లో ఎడ్వినా భారత్ వచ్చాకా ఆ సాన్నిహిత్యం గుభాళించిందని ఆమె పుస్తకంలో రాశారు. అయితే వాళ్లిద్దరి మధ్య శారీరక సంబంధం మాత్రం లేదని ఆమె రాశారు. నెహ్రూ, ఎడ్వినాల అనుబంధం అమలిన ప్రేమనా లేక శారీరక సంబంధం ఉన్న ప్రేమయా అనేది ఎప్పటీకి తేలని చిక్కు ప్రశ్నే.
సెక్యూలర్ భారత్ నిర్మాత
భారతదేశాన్ని సెక్యులర్ ఇండియాగా మార్చడంలో నెహ్రూ కృషి చాలా ఎక్కువ. ఈ విషయంలో ఆయన అంబేద్కర్ తో కలసి పనిచేస్తారు. దీనికి సంబంధించిన రాజ్యంగంలోని ఆర్టికిల్ 44 రూపకల్పనకు నెహ్రూయే కారణం.
నెహ్రూ మీద హత్యాయత్నాలు
నెహ్రూ మీద అనేక సార్లు హత్యాయత్నం జరిగింది. ఇందులో 1947 లో దేశ విభజన సమయంలో నాలుగుసార్లు హత్యాయత్నం జరిగింది. మరొక పారి 1955లో ఒక రిక్షా నడిపే వ్యక్తి హత్యా యత్నం చేశాడు. తర్వాత 1956లో ఒకసారి, 1961లో మరొకసారి నెహ్రూను హత మార్చే ప్రయత్నాలు జరిగాయని చెబుతారు.ఇందులో నాలుగు ప్రయత్నాలను విఫలం చేశారు. ఈ విషయాన్ని నాటి హోం మంత్రి సర్దార్ పటేల్ పార్లమెంటులో స్వయంగా చెప్పారు. నెహ్రూ మీద హత్యా యత్నం జరుగుతుందేమోనని ఆందోళనతో పటేల్ రాత్రుళ్లు నిద్రపోయేవాడు కాదట.
30 భాషల్లో నెహ్రూ ఆత్మకథ
నెహ్రూ తన ఆత్మ కథ “Towards Freedom” జూన్ 1934 – ఫిబ్రవరి 1935 మధ్య జైలులో ఉన్నపుడు రాశాడు.68 చాప్టర్లు 672 పేజీలున్న ఈపుస్తకం మొదట 1936లో ఇంగ్లండుకు చెందిన ది బాడ్లే హెడ్ లిమిటెడ్ ప్రచురించింది. ఇంతవరకు 12 ముద్రణలు పొందింది. దాదాపు 30 భాషల్లోకి అనువాదమయింది.
అంత్యక్రియలకు 15 లక్షల మంది
గుండెపోటుతో 1964 మే 27న నెహ్రూ చనిపోయారు. ఆయన అంత్యక్రియలను వీక్షించేందుకు సుమారు 15 లక్షల మంది ప్రజలు హాజరయ్యారని ఒక అంచనా. గాంధీ అంత్యక్రియల తర్వాత మరొక అంత్యక్రియల కార్యక్రమానికి ఇంత మంది ప్రజలెపుడూ హాజరుకాలేదని చరిత్రకారులు చెబుతారు.