తెలుగు, తమిళంలో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న విజయ్ సేతుపతిపై(Vijay Sethupathi)ఇటీవల విమానాశ్రయంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి అటు తమిళనాడు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే దాడి గురించి రకరకాల ఉహాగానాలు తెరపైకొచ్చాయి. దాడి ఎందుకు జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. ఈ విషయం మర్చిపోకముందే సేతుపతిని ఎవరైనా కొడితే బహుమానాలు ఇస్తానని ఓ సంస్థ బహిరంగంగా ప్రకటించింది.
హిందూ మక్కల్ కట్చి సంస్థ మాత్రం బాగా జరిగింది అంటోంది. సేతుపతిని ఇంకా కొట్టాలని, ఎవరైనా అలా చేస్తే తన్నుకు 1001 రూపాయల చొప్పున నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. స్వాతంత్ర్య సమరయోధుడైన దైవతిరు పసుంపోన్ ముత్తురామలింగ తేవర్ని తను అవమానించాడని, అలాంటి వాడిని కొట్టినా తప్పు లేదని, సేతుపతి క్షమాపణ చెప్పేవరకు ఇలానే చేస్తామని ఆ సంస్థ ప్రతినిధి అర్జున్ సంపత్ అన్నారు.
ఇక ఈ ప్రకటన చూసిన తర్వాత కావాలనే సేతుపతిపై దాడి చేయించి ఉంటారా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అయితే అర్జున్ సంపత్ మాత్రం తాము అలాంటిదేం చేయించలేదు అంటున్నారు. చేస్తే మాత్రం కచ్చితంగా బహుమతి ఇస్తామని అంటున్నారు. సేతుపతిపై దాడి చేసిన మహా గాంధీతో తాను మాట్లాడానని సంపత్ చెప్తున్నారు. నేషనల్ అవార్డ్ వచ్చిందుకు గాంధీ వెళ్లి విష్ చేయబోతే సేతుపతి వ్యంగ్యంగా మాట్లాడాడట. తేవర్ పూజకి రమ్మని ఆహ్వానిస్తే, ఈ లోకంలో తనకి తెలిసిన తేవర్ (దేవుడు) యేసుక్రీస్తు ఒక్కడేనని జవాబు చెప్పాడట. అందుకే అతనికి కోపమొచ్చి వాదనకు దిగాడని చెబుతున్నాడు.
సంఘటన వివరాల్లోకి వెళితే…బెంగుళూరు ఎయిర్‌పోర్టులో విమానం దిగి బయటకు వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై దాడి చేశాడు. వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి తన్నాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఆగంతకుడిని పట్టుకున్నారు. తనపై దాడి చేసిన వ్యక్తిని ఏమీ అనకుండా అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయాడు విజయ్. తాజాగా ఈ ఉదంతంపై స్వయంగా విజయ్ సేతుపతి స్పందించారు.
‘నిజానికి ఇది చిన్న ఘటన. దాడి జరగానికి ముందే ఆ వ్యక్తి మా వ్యక్తిగత సిబ్బందితో గొడవపడ్డాడు. విమానం ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అయ్యాక కూడా ఇది కొనసాగింది. ఆ సమయంలో అతనుతాగిన మైకంలో ఉన్నాడు. అందుకే మతిస్థిమితం కొల్పోయి ఆ విధంగా ప్రవర్తించాడు. వీడియోలు వైరల్ కావడంతో జనాలు దీన్ని పెద్ద సమస్యగా చేస్తున్నారు. అయినా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫిల్మ్ మేకర్ అయిపోతున్నారు’ అంటూ వ్యంగంగా బదులిచ్చారు.
ఇక పర్శనల్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోకపోవడంపై స్పందిస్తూ.. ‘నాకు సెక్యూరిటీ గార్డులను నియమించుకోవడం ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు కూడా నా స్నేహితుడితోనే ప్రయాణిస్తాను. అతను నాకు 30ఏళ్లుగా తెలుసు. ఇప్పుడు అతను నాకు మెనేజర్‌గా కూడా ఉన్నాడు. నా అభిమానులను కలవడానికి, మాట్లాడటానికి నేను ఇష్టపడతాను. ఈ ఘటన జరిగినంత మాత్రానా నేను ఏమీ మారిపోను. ఇప్పుడు కూడా అభిమానులను కలుస్తూనే ఉంటాను’ అని పేర్కొన్నారు.