భారతీయ జనతా పార్టీ కెసిఆర్ మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించేందుకు సిద్దమయింది. దీనికి వ్యూహం తయారు చేస్తున్నది. హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గెలిస్తే, ఈ వ్యూహాన్ని బహిర్గతం చేయాలనుకున్నది. అనుకున్నట్లే ఇపుడు ఈటెల రాజేందర్ టిఆర్ ఎస్ ను చిత్తుగా ఓడించడంతో, కెసిఆర్ ను ఢీకొనగలమన్న ధీమా పార్టీలో వచ్చింది. ఈటెల కెసిఆర్ ను సునాయాసంగా ఓడించడంతో తొందర్లో ఈ బిసి వ్యూహాన్ని బిజెపి ప్రకటిస్తున్నదని విశ్వసనీయం సమాచారం. ఇంతవరకు ఎక్కడా ఎపుడూ బిసి వ్యూహాన్ని భారతీయ జనతాపార్టీ ప్రకటించలేదు. విశ్వసనీయ వ్యక్తులందించిన సమాచారం ప్రకారం తెలంగాణలో మొదటి సారి ‘బిసి ముఖ్యమంత్రి’ బిజెపి అని ప్రకటించబోతున్నది.
నిజానికి చాప కింద నీరులాగా హుజూరాబాద్ లో బిజెపి ‘బిసి క్యాంపెయిన్’ ని చాలా పకడ్బందీగా మొదలుపెట్టింది. నియోజకవర్గంలోని బిసి కులాలన్నింటితో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బిజెపి నేతలు చెప్పిందొకటే- ఈటెల గెలిస్తే తెలంగాణకు బిసి ముఖ్యమంత్రి వచ్చే మార్గం సుగమం అవుతుంది, అని.
తెలుగు రాష్ట్రాలకు రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, బ్రాహ్మణుడు ముఖ్యమంత్రి అయ్యారు. వెలమ ముఖ్యమంత్రి అయ్యారు. కమ్మ ముఖ్యమంత్రి అయ్యారు. ఎస్ సి కూడా ముఖ్యమంత్రి అయ్యారు. కాని, అత్యధిక జనాభా ఉన్న బిసిల నుంచి ముఖ్యమంత్రి కాలేదు. అంతేకాదు,ఏ పార్టీ కూడా బిసిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ కూడా ఇవ్వలేదు.
ఇపుడున్న ప్రాంతీయపార్టీలతో అది సాధ్యం కూడా కాదు. ఎందుకంటే, కుటుంబాల ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలుగా పరిపాలన సాగిస్తున్న ప్రాంతీయపార్టీల నుంచి ముఖ్యమంత్రి పదవిని మరొకరు లాక్కోవడం అసంభవం. టిఆర్ ఎస్ నుంచి ముఖ్యమంత్రి పదవిని కెసిఆర్ కుటుంబానికి కాకుండా మరొకరికి లభిస్తుందా, లేదు. ఇలాగే వైఎస్ ఆర్ సి, టిడిపి లపరిస్థితి కూడా. అందువల్ల భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం అజండాను ప్రయోగించి బిసి ముఖ్యమంత్రిని ప్రకటించాలని చూస్తున్నది. ఈటెల రాజేందర్ ను పార్టీలో చేర్చుకునేటపుడే బిజెపి అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందని పార్టీ సీనియర్ నాయకుడొకరు వెల్లడించారు. అయితే, ముందే ప్రకటించి ఎన్నికల్లో ప్రచారం చేయడం పార్టీ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని, అందువల్ల ఎన్నికల ఫలితాలు వచ్చే దాకా అగాలని నేతుల భావించారని తెలిసింది. అయితే, బిసి కుల సమావేశాలలో ఒక సీనియర్ నాయకుడు మాత్రం, బిసి ముఖ్యమంత్రి మీకు కావాలా వద్దా, తెలంగాణ బిసి ముఖ్యమంత్రి కావాలనుకుంటే, ఈటెలను గెలిపించండని అడుగుతూ వచ్చాడు, అదే చెబుతూ వచ్చాడు.
ఈటెల గెలుపుతో అందరికంటే హర్షంతో ఉన్నది బిజెపి అధిష్టానం. ముఖ్యంగా కేంద్రం హోం మంత్రి అమిత్ షా అని తెలిసింది. ఎందుకంటే, ఆయన ఈటెలను చేర్చుకున్నపుడు, ఈటెల భుజంమీద చేయి వేసి, వెన్నుచరచి పంపాడని, దీనికి లోతయిన అర్థం ఉందని ఒక సీనియర్ నాయకుడు చెప్పారు.
హూజూరాబాద్ ఎన్నికల తెలంగాణ రాజకీయాలను కొత్త మలుపు తిప్పబోతున్నది. బిసిలకు కెసిఆర్ మీద అంతగా అభిమానం లేదని, టిడిపి వెళ్లిపోయిన నేపథ్యంలోొ వీళ్లంతా ఒక ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నట్లు ఇపుడు రుజువయిపోయిందని కాషాయ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక బిజెపి బిసి వ్యూహంతో దూకుడు పెంచబోతున్నది.
ఈ దోరణిని రుజువు చేసేందుకే అన్నట్లు హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు వస్తుండగానే, పార్టీ సీనియర్ నాయకుడు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల సంస్థ (KVIC)దక్షిణ భారత అధ్యక్షుడు పేరాల శేఖర్ రావు ఒక ఆసక్తికరమయిన ప్రకటన విడుదలచేశారు.
ఈటెల గెలుపుతో తెలంగాణకు వెనకబడిన వర్గాల ముఖ్యమంత్రి వచ్చేందుకు మార్గం సుగమం అయిందని ఆయన పేర్కొన్నారు.
“తెలంగాణలో 60 శాతం ఉన్న ఒబిసి కులాలకు టిఆర్ ఎస్ పట్ల కెసిఆర్ పట్ల ఉన్న భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి. బిజెపిని ఈ వర్గాలు తమ ఆశాజ్యోతిగా చూస్తున్నాయి.. హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ గెలుపు, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి మొదటి బిసి ముఖ్యమంత్రి రావాడానికి మార్గం సుగమం చేసింది,” అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
హుజూరాబాద్ గెలుపునకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా కృషి చేసినా ఈటెల వ్యక్తిత్వం వల్ల ప్రజలు ఆయన పట్ల మొగ్గు చూపేందుకు కారణమయిందని శేఖరరావు తెలిపారు.
శేఖర్ రావు జాతీయ స్థాయిలో బిజెపి నేతల్లో ఒకరు. చాలా కాలం ఆయన ఈశాన్య భారత రాష్ట్రాలలో పార్టీ ఇన్ చార్జీ గా ఉన్నారు. ముఖ్యంగా అస్సాంలో పార్టీ వేల్లూనుకోవడంలో ఆయన పాత్ర చాలా ఉంది. హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం చేశారు. ఈటెల రాజేందర్ నాయకత్వాన్ని ఆయన ఈ ప్రకటనలో ప్రశంసించారు.
“బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రతిభావంతమయిన వ్యక్తిత్వం, తెలంగాణ సాధనలో ఆయన క్రియాశీలక పాత్ర, పరిణతితో కూడిన ఆయన ప్రవర్తన, అన్ని రకాల వర్గాల ప్రజలతో ఆయనకు ఉనన ఆత్మీయ సంబంధాలు హుజూరాబాద్ లో బిజెపికి బాగా సహకరించాయి,” శేఖర్ రావు పేర్కొన్నారు.
వేలాది మంది బిజెపి నాయకులు, కార్యకర్తలు, అనేక నెలలుగా చేసిన శ్రమకు ఫలితం, ఈ అద్భుత విజయం వైపు బిజెపి ప్రయాణం అని ఆయన హుజూరాబాద్ పనితీరు ప్రశంసించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
“టిఆర్ ఎస్ – కెసిఆర్ అవినీతి, నియంతృత్వ పోకడలు, ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంతో నవ్వుల పాలు చేయడం, అధికార దుర్వినియోగం, పోలీసు రాజ్యం, టిఆర్ ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి ముఖ్యకారణాలు.
“హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఓటమే. ఆయన రాష్రాన్ని పాలించే అర్హతను కోల్పోయారు.
“ముఖ్యంగా తెలంగాలో 60 శాతం ఉన్న ఒబిసి కులాల ఆశలకు టిఆర్ ఎస్ కెసిఆర్ పట్ల ఉన్న భ్రమలను పూర్తిగా తొలగిపోయాయి. బిజెపి తమ ఆశాజ్యోతిగా చూస్తున్నారు. హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ గెలుపు, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి మొదటి బిసి ముఖ్యమంత్రి రావాడానికి మార్గం సుగమం చేసిందని నా అభిప్రాయం.”