(వడ్డేపల్లి మల్లేశము)
గతంలో ప్రభుత్వాలు హామీలు తక్కువ ఆచరణ ఎంతోకొంత అనే పద్ధతిలో కొనసాగేవి. నేడు హామీల వర్షం కురిపిస్తూ వాగ్దానాలు, ప్రలోభాలు, రాయితీల వంటి ఆకర్షణ పథకాలతో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి, అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి, పార్టీ ఫిరాయింపుల ద్వారా అధికార పార్టీని బలోపేతం చేసుకోవడానికి మాత్రమే రాజకీయ పార్టీలు పరిమితమైనవి.
పరిమితమైన లక్ష్యాలతో అపరిమితమైన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం రాజకీయ పార్టీలకు ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. అంటే రాజకీయ పార్టీలకు ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగం పట్ల అచంచల విశ్వాసం ఉండడం మాత్రమే కాకుండా ప్రజల అభివృద్ధి సంక్షేమం పట్ల స్పష్టమైన దార్శనికత ఉండాలి.
కానీ నేడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కొనసాగుతున్న పరిపాలన ఆ పార్టీలు అధికారంలోకి వచ్చిన తీరు ప్రలోభాల పేరుతో చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఇక తెలంగాణ రాష్ట్రం లోనైతే తెరాస మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటుందట. నమ్ము దామా? ఆ వైపుగా ప్రభుత్వ అడుగులు ఉన్నాయా?
ప్రజా ఆకాంక్షలను విస్మరించిన ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సుమారుగా ఆరు దశాబ్దాల ప్రజల ఆకాంక్షలు, పోరాటము, చైతన్యము, భావజాల వ్యాప్తి ముఖ్యంగా బుద్ధిజీవులు మేధావి విద్యార్థి లోకం ద్వారానే సాధ్యమైంది అని చెప్పక తప్పదు.
ప్రజల ఆకాంక్షలను ఆవేశాలను అవసరాలను అదునుగా తీసుకున్న తెరాస పార్టీ ఉద్యమ పార్టీగా కొనసాగుతూ రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అయితే ఇందుకు అనేక పార్టీల యొక్క మద్దతు కూడా ఉన్న విషయాన్ని మనం మరవరాదు. ముఖ్యంగా తెరాస పార్టీ ఉద్యమకాలంలో అనేకమైన హామీలను వాగ్దానాలను ఇచ్చి ప్రజల మనసులను దోచుకున్న ది.
ఉద్యమ సమయంలోనే అనేక సామాజికవర్గాల సందేహాలు బలంగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కలిసి పోరాడాలి అనే ఏకైక సూత్రం ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ గారి మార్గనిర్దేశం లో ప్రజా ఉద్యమం కొనసాగింది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాత ఎన్నికల సమయంలో ఉద్యమ పార్టీ కనుక ప్రజల గురించి పట్టించుకునే నమ్మకంతో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని ఆశతో ఉద్యోగులు, బుద్ధిజీవులు, మేధావులతో పాటు సామాన్య ప్రజానీకం కూడా తెరాస పార్టీకి పట్టం కట్టారు.
హామీలను విస్మరించిన ప్రభుత్వం
ఇంటికొక ఉద్యోగం ఇస్తామని, నీళ్లు నిధులు నియామకాలు ఆత్మ గౌరవం అనే నాలుగు ప్రధాన ఆకాంక్షల పట్ల బలంగా పని చేసి తెలంగాణ లో ప్రపంచము నివ్వెరపోయే స్థాయిలో పరిపాలన చేస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఆ వైపుగా కనీస అడుగులు కూడా పడలేదు.
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అన్న ప్రధాన హామీ అమలు కాకపోగా ఇప్పటికి ఆ ప్రశ్నకు ప్రభుత్వము దగ్గర సమాధానం లేదు. ఎవరూ అడగకుండానే దళితులకు 3 ఎకరాల భూమి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానన్నా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు.
ప్రకృతి, గుట్టల విధ్వంసం పట్ల టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ కాలంలో బాగా స్పందించి నప్పటికీ అధికారానికి వచ్చిన తరువాత ప్రభుత్వ పెద్దలే ఆ పనులకు పూనుకోవడం లో అర్థం ఏముంది?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి సుమారుగా లక్ష పైచిలుకు ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఏడేళ్ల తర్వాత 2021లో ఆ ఉద్యోగాల సంఖ్య 2,50,000 చేరుకున్నట్లు వివిధ పార్టీల నాయకులు ప్రకటిస్తున్నారు. ఎందుకు భర్తీ చేయడం లేదు? 40 లక్షలకు పైగా ఉన్నటువంటి అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ధ్యాస లేకుండా ఉద్యోగంలో ఉన్న వారికి మరో మూడేళ్లు విరమణ వయస్సును పెంచడంలో ఎవరి మేలు కోరినట్లు?
గత మూడేళ్ల క్రితమే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని మాట ఇచ్చిన ప్రభుత్వం ఆ వైపుగా కనీస ఆలోచన కూడా లేకుండా యువతను మోసగించినదని ప్రధాన రాజకీయ పార్టీలు లక్ష కోట్లు యువతకు బకాయి పడినట్లు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వాలు నియమించిన టువంటి 52 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను ఇటీవల ప్రభుత్వం తొలగించడం దేనికి సంకేతం?
సాగు చేస్తున్న రైతులకు పెట్టుబడి సాయంగా ప్రారంభమైన రైతుబంధు వందల ఎకరాలు ఉన్నటువంటి పెట్టుబడిదారులు భూస్వాములకు వర్తింప చేయడం ద్వారా ప్రభుత్వ నిధులు ప్రజాధనం కోటానుకోట్ల రూపాయలు వృధా అవుతుంటే సామాన్యునికి అందిన లాభం ఏమిటి?
సుమారుగా ఒక లక్ష 30 వేల కోట్ల పైచిలుకు డబ్బుతో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే భూములు ఉన్నటువంటి బడా భూస్వాములకు మాత్రమే ప్రయోజనం జరిగింది కానీ పేద వర్గాలు కూలీలు పేద రైతులకు దక్కిన ఫలితాలు ఏమిటి?
రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ప్రజాధనం కొద్ది వర్గాలకే అందితే కేవలం పెన్షన్ల తోనే తృప్తిపడి తమ పిల్లలకు ఉద్యోగాలు రాకున్నా ఈ ప్రభుత్వమే కొనసాగాలని సామాన్య ప్రజానీకం కోరుకుంటున్నదా?
20 ఏళ్ళ అధికారం అత్యాశే అవుతుందా?
మరో 20 ఏళ్లు తెలంగాణ రాష్ట్రంలో నేటి ప్రభుత్వం కొనసాగుతుందని ప్రభుత్వ పెద్దలు ఆశించడం ప్రజల చైతన్యాన్ని ప్రజల ఆకాంక్షలను గుర్తించకపోవడమే అవుతుంది.
ప్రధాన హామీ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అన్నది మరిచి దాని బదులు దళిత బంధు పేరుతో దళితులను మచ్చిక చేసుకోవాలనుకోవడం మిగతా మెజారిటీ ప్రజానీకాన్ని దూరం చేసుకోవడమే.
సుమారు 45 వేల కోట్లతో మిషన్ భగీరథ పనులు ప్రారంభిస్తే ఆ నీటిని ప్రభుత్వ పెద్దలతో పాటు ప్రజలు ఎవరూ కూడా వాడకపోవడం తో ఆ పథకం కింద ధ్వంసమైన రోడ్లను చూసినప్పుడు ఈ పథకం ఎంత దుబారా? ఎంతో నష్టాన్ని కలిగించిందని తేలిపోతుంది.
వాగ్దానాలు, హామీలు, ప్రలోభాలు, రాయితీలు
గత ఏడు సంవత్సరాలకు పైగా రాష్ట్రంలో కొనసాగుతున్న టువంటి ఎన్నికల విధానాన్ని గమనిస్తే మద్యం, డబ్బు, కులాల వారీగా సమావేశాలతో కూడిన రాజకీయాలు సమాజాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టినవి.
ప్రజలు ఎన్నికల కోసమే ఎదురు చూసిన సంప్రదాయాన్ని బలపరిచిన సన్నివేశం మనకు కనబడుతుంది.
రాష్ట్ర యువతకు ఇప్పటికీ స్పష్టమైన యువజన విధానం లేకపోగా మద్యం, అశ్లీల నృత్యాలు, క్లబ్బులు, మత్తుపానీయాలు, మత్తు పదార్థాలు, అసంబద్ధ టీవీ సినిమా ప్రచారాల వలన నేటి యువత నిర్వీర్యం అయిపోయినది. ఉద్యోగాలు లేక నిరుద్యోగ భృతి అందక మద్యానికి బానిసలుగా మారిన యువతను చూసి ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంటే సామాన్య ప్రజలు ప్రభుత్వం వెంట ఉన్నట్లా? అఖిలపక్ష సమావేశాలను తప్పకుండా నిర్వహిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం కరానా వంటి భయంకరమైన సన్నివేశంలో కూడా ఏనాడు అఖిల పక్షాలతో సమావేశం నిర్వహించక పోవడం ప్రజాస్వామ్యం పట్ల ఈ ప్రభుత్వానికి విశ్వాసం ఉన్నట్లేనా?
కాంగ్రెస్ పార్టీ పై ఎన్నికైన 12 మందితో పాటు ఇతర పార్టీల నుండి కూడా శాసనసభ్యులను అధికార పార్టీలో చేర్చుకుని పార్టీ ఫిరాయింపుల ను ప్రోత్సహించడం ప్రజాస్వామ్య బద్ధమేనా?
ఇటీవల హుజురాబాద్ లో జరగనున్న ఉప ఎన్నిక సందర్భంగా ఎలాంటి నోటిఫికేషన్ వెలువడక పోయినా గత మూడు మాసాలుగా ప్రభుత్వ పెద్దల ఎన్నికల ప్రచారం నిర్వహించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లలేదా?
ఉద్యోగిస్వామ్యం లో విపరీతమైన టువంటి అవినీతి, రాజకీయ వర్గంలో శాసనసభ్యులు రాజకీయ పార్టీల ప్రతినిధులు మంత్రులు కూడా అక్రమ భూ దందాలకు పాల్పడినట్లుగా అనేక ఆరోపణలు వస్తున్నా ఈటెల రాజేందర్ పై తీసుకున్న చర్య మిగతా వారిపట్ల తీసుకోకపోవడం లో ఆంతర్యం ఏమిటి?
ఇన్ని రకాల ప్రశ్నలతో సామాన్య ప్రజానీకం గందరగోళానికి గురి అవుతుంటే తమ ఆకాంక్షలు నీరుగారిపోయాయి అని ఆవేదన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం నుండి స్పష్టమైన టువంటి హామీ లేకపోగా రుజువులు కూడా లేని కారణంగా ప్రభుత్వ పయనం గమ్యానికి వ్యతిరేక దిశలో కొనసాగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు ప్రజా సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీవీ సినిమా ప్రసారాల లోని అసంబద్ధత ను అరికట్టే లేకపోగా సమాజములో అత్యాచారాలు అకృత్యాలు విచ్చలవిడిగా పెరిగిపోయినవి. మహిళా సంఘాలు ప్రజా సంఘాలు అత్యాచార బాధితులు సామాజిక కార్యకర్తలు మద్యపానాన్ని వెంటనే నిషేధించాలని డిమాండ్ చేస్తుంటే పట్టించుకోని ప్రభుత్వానికి భవిష్యత్ ఎలా సాధ్యం?
సామాన్య ప్రజలే తమకు తెలంగాణ ప్రభుత్వం గత ఏడు సంవత్సరాలుగా ఇచ్చిన ఇస్తున్న హామీలు, రాయితీలు, ప్రలోభాలు ,వాగ్దానాలు ఏ మేరకు అమలైనయో ఆలోచించుకొని పెట్టుబడిదారులు, బడా భూస్వాములకు మాత్రమే ప్రయోజనం జరుగుతున్న పాలనలోని డొల్లతనాన్ని గుర్తించి రాబోయే ఎన్నికల్లో తగు నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం.
వాగ్దానాలను విస్మరించిన ప్రభుత్వాలను కాదని ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలపై ఒత్తిడి చేయడం తమ హక్కులను ప్రయోజనాలను సాధించుకోవడం సామాన్య ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయులు ఉద్యమనేత హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)