టిటిడి ఆలయాల్లో స్వామి, అమ్మవార్ల కైంకర్యాలకు ఉపయోగించిన పుష్పాలు సప్తగిరులకు సూచికగా ఏడు బ్రాండ్లతో పరిమళభరితమైన అగరబత్తులుగాభక్తులకు అందుబాటులోకి వచ్చాయి. తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద మూడు కౌంటర్లలో, శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న పుస్తకాల విక్రయశాల వద్ద ఒక కౌంటర్లో అగరబత్తుల విక్రయాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి
టిటిడి ఆలయాల్లో పూజలు, అలంకరణలకు వినియోగించే పుష్పాలు వృథా కాకుడదని అగరబత్తుల తయారీని ప్రారంభించారు. స్వామివారిపై ఉన్న భక్తితో బెంగుళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ యంత్రాలు ఏర్పాటు చేసుకుని, సిబ్బందిని నియమించుకుని అగరబత్తులు తయారు చేసి టీటీడీ కి అందిస్తున్నది.
ఎస్వీ గోశాలలోని అగరబత్తుల ప్లాంట్ లు ఏర్పాటు చేశారు. ఇక్కడి 10 యంత్రాల ద్వారా రోజుకు 3.50 లక్షల అగరబత్తుల తయారీ జరుగుతుంది. ఈ అగరబత్తులు అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, తుష్టి, దివ్యసృష్టి, దివ్యదృష్టి అనే బ్రాండ్లతో నేటి నుంచి తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అందుబాటులోకి వచ్చాయి. త్వరలో తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తారు.
అయితే, తిరుమల శ్రీవారి ఆలయంలో వినియోగించే పుష్పాలను అగరబత్తుల తయారీలో వినియోగించడం లేదని ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
టిటిడి ఆలయాల్లో వినియోగించిన పూలతో స్వామి, అమ్మవార్ల ఫోటోలు తయారు చేయడానికి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో ఎంఓయు కుదుర్చుకుంది.
దీనికోసం తిరుపతిలోని ఆ విశ్వవిద్యాలయంకు చెందిన సిట్రాస్ రిసెర్చ్ స్టేషన్లో మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, వారికి రూ.83 లక్షలతో పరికరాలు, శిక్షణకు నిధులు టిటిడి సమకూరుస్తుందని, దీనికి బదులుగా స్వామివారి ఫోటోలతో పాటు, క్యాలండర్లు, కీ చైన్లు, పేపర్ వెయిట్లు, రాఖీలు, క్యాలండర్లు, డ్రై ఫ్లవర్ మాలలు తదితరాలు తయారు చేసి వారు టిటిడికి ఇస్తారని చెయిర్మన్ తెలిపారు.
మల్టీ కలర్ తో ఆకర్షణీయంగా సప్తగిరి మాస పత్రిక
శ్రీవారి ఆశీస్సులతో టిటిడి ఆర్ష ధర్మ ప్రభోదం కోసం 1949వ సంవత్సరంలో సప్తగిరి పత్రికను బులెటిన్గా ప్రారంభించిందని చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. 1970వ సంవత్సరం నుండి తెలుగు, తమిళం, కన్నడ, ఆంగ్లం, హిందీ భాషల్లో, 2014వ సంవత్సరం నుండి సంస్కృత భాషలో ముద్రణ ప్రారంభమైందన్నారు. 2016వ సంవత్సరం నుంచి సప్తగిరిని పూర్తిగా రంగుల్లో పాఠకులకు అందిస్తున్నామన్నారు.ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆధ్యాత్మిక పత్రికల్లో అగ్రగామిగా ఉందన్నారు.
సప్తగిరి మాస పత్రిక ఆరు భాష్లల్లో పునఃప్రారంభమైందని, ఇందులో అనేక కొత్త శీర్షికలతో, ధారావాహికలతో పాఠకులకు నిరంతరాయంగా అందుతుందని చెప్పారు.
అంతకుముందు అగరబత్తుల తయారీ ప్లాంట్ వద్ద శ్రీవారి చిత్రపటానికి ఛైర్మన్, ఎమ్మెల్యే, ఈవో, అదనపు ఈవోలు పూజలు నిర్వహించి ప్లాంట్ను ప్రారంభించారు. తరువాత ప్లాంట్లో అగరబత్తులు తయారుచేసే యంత్రాల పనితీరును పరిశీలించారు.
.