19న ‘రైతు సమరభేరి’ కవితా సంపుటి ఆవిష్కరణ

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న అలుపెరగని పోరాటాలకు మద్దతుగా ప్రముఖ కవి  గోలి మధు సంధించిన కవితల సమాహారం ‘రైతు సమరభేరి’గా వెలువడుతూ ఉంది.

గోలి మధు కలం నుంచి అన్నదాతలకు చేదోడుగా జాలువారిన నూరుకు పైగా కవితల సంపుటి ‘రైతు సమరభేరి’ దానశీలి దామర్ల కుబేరస్వామి దాతృత్వంలో అనతి కాలంలోనే రెండవ ముద్రణ రూపుదిద్దుకుంది. రైతాంగ ఉద్యమానికి మద్దతుగా ఈ కవితల సంపుటి పుస్తకాన్ని రైతు ఉద్యమాలతో మమేకమైన అతిథులతో ఆవిష్కరించనుండడం విశేషం!

మంగళగిరి నగరంలోని తెనాలి రోడ్డులో గల శ్రీ మార్కండేయ పద్మశాలీయ కళ్యాణమండపంలో 19-9-2021 ఆదివారం ఉదయం 10 గంటలకు సాహితీ అభిమానులు, ఆత్మీయుల నడుమ చైతన్య సాహితీవేదిక ఆధ్వర్యంలో ప్రజాకవి గోలి మధు రచించిన ‘రైతు సమరభేరి’ కవితాసంపుటి పుస్తకావిష్కరణ సభ జరగనుంది.

మానవ వికాస మండలి అధ్యక్షులు రేకా కృష్ణార్జునరావు అధ్యక్షతన జరిగే సభలో ప్రముఖ సామాజిక విశ్లేషకులు టి.లక్ష్మీనారాయణ ‘రైతు సమరభేరి’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.

ముఖ్యఅతిథిగా సామాజిక, సాంస్కృతిక విశ్లేషకులు దేవి హాజరయ్యే ఈ సభలో అతిథులుగా మంగళగిరి నగర ప్రముఖులు, పుస్తక ముద్రణ దాత దామర్ల కుబేరస్వామి, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.దుర్గాభవాని, ప్రగతి శీల మహిళాసంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్.గంగాభవాని, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జొన్నా శివశంకర్, సీపీఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, మంగళగిరి జేఏసీ కన్వీనర్ ఎండీ యూసుఫ్, ప్రగతి శీల న్యాయవాదుల వేదిక జిల్లా కన్వీనర్ శిఖా సురేష్ బాబు, విశ్వశాంతి కళాపరిషత్ కన్వీనర్ పొట్లాబత్తుని లక్ష్మణరావు, యువ కవయిత్రి వాసి జ్యోత్స్న, మంగళగిరి చైతన్య వీవర్స్ కల్చరల్ అసోసియేషన్ కార్యదర్శి అల్లక తాతారావు హాజరవుతారు.

‘రైతు సమరభేరి’ కవితాసంపుటి పుస్తక పరిచయం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి కళాకారులు కంచర్ల కాశయ్య చేసే ఈ సభకు తెలుగు ఉపాధ్యాయిని గోలి సౌమ్య స్వాగతం పలుకుతారు. కవి, రచయిత, కళాకారుడు సందుపట్ల భూపతి వందన సమర్పణ చేస్తారు. తొలుత మంగళగిరి విశ్వశాంతి కళాపరిషత్ కళాకారులచే ‘మతసామరస్య ప్రబోధం’ మూకీ నాటిక ప్రదర్శన ఉంటుంది.

కొవిడ్ నిబంధనలతో జరిగే ఈ పుస్తకావిష్కరణ సభకు సాహిత్యాభిమానులు హాజరై ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి సంఘీభావం తెలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మంగళగిరి చైతన్య సాహితీవేదిక మనఃస్ఫూర్తిగా కోరుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *