నిశాచరుడు
ఈ నడిరాత్రి
నిదుర దూరమైన కలతలో
హస్తినలో రైతన్నల
వేదన ఆవహించి
ఇల్లు వాకిలోదిలి
బతుకు పోరులోని
ఆరాటానికి మనసు చెదిరి నేను !
మతులు చెడి
మానవత్వం వీడి
ఉద్యమాన్ని నులిమే
నీచాతి నీచపు ఎత్తుగడల
ధ్యాసలో వాళ్ళు!
మహోజ్వల పోరుకు
న్యాయందక్కేనా అనే మొసలి కన్నీరెట్టి
చీవాట్లెట్టిన అత్యున్నత న్యాయస్థానం
గణతంత్రదినోత్సవాన జరిగినఘటనకు
నోరు మెదపదేమనే ప్రశ్నల్ని
సంధించుకుంటూ….
ఎర్రకోటపై తొలిసారి ఎగిరిన
ఏవేవో జండాల వెనుక దాగిన
ఎజెండాలను ఊహించుకుంటూ
దేశ సార్వభౌమత్వానికి
ప్రతీకయైన త్రివర్ణ పతాకం
నిలిచే చోట
పీడకుల పైశాచికత్వం
రెపరెప లాడిందేమిటని
రెప్పవాల్చక కంట తడితో
నిశీధిలో నిశాచరునిలా నేను!
(దేశరాజధాని న్యూ ఢిల్లీ సమీపాన జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం వారు ప్రచురిస్తున్న కవితా సంపుటిలో ప్రచురణ నిమిత్తం రాసినది)
గోలి మధు
చైతన్య సాహితీ వేదిక, మంగళగిరి
9989186883