రైతన్నల పోరుకు సెల్యూట్ (రైతు కవిత)

 

రైతన్నల పోరుకు సెల్యూట్

-కాకం అంజన్న.

సెల్యూట్……. సెల్యూట్
భూమి దున్నే రైతుకు సెల్యూట్
బువ్వ పెట్టే చేతికి సెల్యూట్
ఎడ్లమెడల కాడికి సెల్యూట్.
సాలు తోలే మేడికి సెల్యూట్

పోరు నాగలై తిరగబడిన రైతు ఉద్యమానికి సెల్యూట్
ఢిల్లీ పాలకుల గళ్ళ పట్టిన అన్నదాతల పోరుకు సెల్యూట్

చెమట బొట్టును నీరుగా జేసి
పంటలకు ప్రాణం బోసి.
చీడ పీడ లన్నింటిని తుంచి
చంటి పాపవోలె పైరును పెంచి..
రతనాల పంటలు పండించి
దేశానికి అన్నం పెడుతుంటే..

బహుళజాతి కంపెనీలకు..
రైతు బతుకును బలి ఇస్తుంటే..
ఏలె టోళ్ల ఎత్తులు ఇకపై.
సాగనియ్యమని సమర శంకమై..

చర్నాకొళ లై తిరగబడ్డ రైతన్నలకు సెల్యూట్
ముళ్ళు కర్రలై మర్లబడ్డ అన్నదాతకు సెల్యూట్..

స్వేచ్ఛ మార్కెట్టు అంటూ..
రైతుల లాభం కోసమే అంటూ…
బక్క బతుకుపై బురదను కప్పి,
నక్కజిత్తుల ,మాటలు చెప్పి..
కార్పొరేట్ లతో దోస్తీ చేసి.
రైతును ముంచగా పూనుకుంటే..
కన్నంలోన పందికొక్కులా
పంటను మింగగా చూస్తుంటే..
కొత్త చట్టాలు మాకొద్దంటూ
పోరుకు అగ్గిని రాజీసీ…

సలికెపారలై ఎదురుతిరిగిన మట్టి మనుశులకు సెల్యూట్
పోరు జెండలై గొంతు ఎత్తిన.. భూమి పుత్రులకు సెల్యూట్

చేపకు గాలం వేసినట్టు…..
కాంట్రాక్టు వ్యవసాయం అంటూ.
గడెం నాగలిని విరిసేసి
రైతు భూమిపై కన్నేసి.
బహుళ జాతి కంపెనోడు..
పల్లెలకడుగు పెడుతుంటే.
గద్దనోటిలో కోడిపిల్లలా
రైతుల బతుకులు మారుతుంటే…
బహుళజాతి కంపెనీలను.
బడితెలు ఎత్తి తరీమేటందుకు

కోడె గిత్తలై కాలు దువ్విన రైతు పౌరుషానికి సెల్యూట్
కొడవళ్ళయ్యి. కొట్లాడిన అన్నదాత ధైర్యానికి సెల్యూట్..

ఇళ్లు ఇడుపును వదిలేసి..
కందిరీగాలై పొరుకు లేసి…
రోడ్లపైననే వంటలు జేసి..
పోరు మంటలు రాజేసి…
చలి కి సైతము వణుకుతున్న..
రైతుల గుండెలు ఆగుతున్నా..
సర్కారుకు తల వంచం అంటూ
పట్టిన జెండా దించం అంటూ..
చట్టాలు రద్దు జేసే వరకు..
చుట్టిన రుమాలు విడవం అంటూ.

తొలకరి మెరుపై పీపీకిలి ఎత్తిన రైతన్నల ధైర్యానికి సెల్యూట్
మత్తడి ఉరకై. పరుగులేత్తిన అన్నదాత పాదాలకు సెల్యూట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *