(డా. జతిన్ కుమార్)
పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కోవిడ్-19 సంక్రమించే అవకాశం ఎంతవుందనే విషయంపై అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. న్యూఢిల్లీలోని మ్యాక్స్ గ్రూప్ ఆఫ్ ఆసుపత్రులలో సిఎస్ఐఆర్-ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ ఇటీవల చేసిన అధ్యయనంలో, టీకాలు తీసుకున్నవారిలో వ్యాధి సంక్రమించినా అది అంత తీవ్రంగా వుండదని కనుగొన్నారు. 600 మంది వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్య సంరక్షణ కార్మికుల్లో ఎవరికీ ఆసుపత్రిలో చేరవలసిన అవసరం రాలేదు.
ఆసుపత్రిలో చేరే అవసరం లేకపోవడం అంటే వ్యాక్సినేషన్లు వ్యాధి యొక్క తీవ్రతను బాగా తగ్గిస్తున్నాయని అర్ధం కొందరిలో రోగ లక్షణాలు కూడా కనిపించటం లేదు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అధిక శాతం ఈ కారణంగా వ్యాధి వాహకులు [కారియర్స్] కావచ్చని ఇది చూపిస్తుంది. ఇది ఆందోళన కలిగించే విషయం, ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలలో ఈ స్థితి వుంటే వారు నిత్యం రోగులతో కలసి వ్యవహరిస్తుంటారు కనుక ఎక్కువ మందికి ఈ వ్యాధిని సంక్రమింపజేసె అవకాశం వుంది.
మరో ఆందోళనకర అంశం ఏమిటంటే, ఈ సంక్రామ్యతలు చాలా వరకు వైరస్ యొక్క డెల్టా వేరియెంట్ వల్ల సంభవించాయని అధ్యయనం యొక్క ప్రధాన శాస్త్రవేత్త చెబుతున్నారు. ముందస్తు సంక్రామ్యతలు లేదా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ల ద్వారా సృష్టించబడ్డ యాంటీబాడీలు డెల్టా వేరియెంట్ను ఎదుర్కోవటం లో పూర్తి సమర్థవంతంగా లేవని అధ్యయనం పేర్కొంది. కాబట్టి, వ్యాక్సినేషన్లు చాలా సందర్భాల్లో వ్యాధి యొక్క తీవ్రతను తగ్గించవచ్చుకానీ ఇది సామూహిక ‘మంద రోగనిరోధక శక్తి’ కి దారితీయదు. లాక్ డౌన్ లు తదితర కఠినచర్యల నుండి బయటపడటానికి చాలా దేశాలు మంద నిరోధక శక్తి కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే ఇది సాధ్యం కాకపోవచ్చని ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి. డెల్టా వేరియంట్ ను ఎదుర్కునే ఎలాంటి సమర్థవంతమైన సాధనం లేనప్పుడు మాస్కూలు ధరించటం ,భౌతికదూరం పాటించడం వంటి విధానాలు నిరవధికంగా కొనసాగాల్సి ఉంటుంది. అందువల్ల పాఠం ఒక్కటే.” వాక్సిన్ తప్పకుండా తీసుకోండి. కోవిడ్ జాగ్రత్తలు మానకండి,”