(మలసాని శ్రీనివాస్)
చుట్టూ ఉన్న కోటానుకోట్ల జీవరాసుల మధ్య తనకు ఈ జీవితం ఎక్కడి నుంచి వచ్చిందన్నది ఆదిమానవుడికి ఒక పట్టాన అంతు పట్టలేదు. మొదట అదొక నిగూఢమైన రహస్యం అనుకున్నాడు. తర్వాత కాలంలో తన ఊహకు అందని ఏదో అమోఘమైన శక్తి ఈ విశ్వాన్నంతా ఒకేసారి, ఉన్నఫళంగా సృష్టించి ఉంటుందని భావించాడు. అదే ఇంత అద్భుతంగా తయారైందని విశ్వసించాడు. అందుకే, ప్రతి మతంలోనూ ‘సృష్టి’ ప్రస్తావన కనిపిస్తుంది. దేవుడి పేర్లూ మతాలూ వేరు వేరైనా, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అందరూ నమ్మింది ఒకే విషయం! ”దేవుడే ఈ విశాల విశ్వానికి సృష్టికర్త-” అని!! ఆ భావం కొన్ని వేల ఏండ్ల పాటు వర్థిల్లింది. సృష్టికి సంబంధించిన విషయంలో మతాలు చెప్పిందే ఆయా సమాజాల్లో ‘సత్యం’గా చలామణి అయ్యింది.
మత గ్రంథాలు ప్రామాణికమయ్యాయి. అందువల్ల ఆ విశ్వాసాన్ని కాదని, ఆలోచించే వారే లేకపోయారు. ఎవరైనా వ్యతిరేకంగా నోరెత్తితే ఏకంగా మరణశిక్షలే ఉండేవి. అందువల్ల శాస్త్రీయ ధృక్పథం – అనేది ఊపిరి పోసుకోవడానికి కొన్ని శతాబ్దాలు పట్టింది. వివేకానికి మూర్ఖత్వం పెద్ద ప్రతిబంధకంగా నిలిచింది. మరో వైపు మత పెద్దల, మత న్యాయస్థానాల తీర్పులు జనాన్ని భయకంపితుల్ని చేశాయి. తెల్లవాడు నల్లవాణ్ణి, ఉన్నవాడు లేనివాణ్ణి, అగ్రవర్గం వాడు నిమ్నవర్గం వాడిని, పురుషుడు స్త్రీని బానిసలుగా చూసే హీన సంస్కృతి రాజ్యమేలింది. పైస్థాయి వారు కింది స్థాయి వారిని ఎంతగా ప్రభావితం చేశారంటే- ”తాము పాపులం గనక, ఆ దేవుడు – ఆ ప్రభువు తమను బానిసలుగా పుట్టించాడని, అంతా దేవుని ఇష్ట ప్రకారమే జరుగుతూ ఉందని, యజమానులకు సేవలు చేస్తూ తరించడమే తాము చేయాల్సి ఉందని అమాయకంగా నమ్ముతూ మోసపోయారు.
అలాంటి పరిస్థితుల్లో మరో రకమైన ఆలోచన రావడానికే వీలులేక పోయింది. బలప్రయోగాలు ఎల్లకాలమూ రాజ్యమేలలేవు కదా? స్థల కాలాన్ని, అందులోని పరిస్థితుల్ని జాగ్రత్తగా గమనించిన ప్రజలు ఆలస్యంగానైనా సరే, వివేకం పెంచుకుంటారు కదా?
It’s ‘National Scientific Temper Day’ today.
.
.#narendradabholkar #nationalscientifictemperday #deathanniversary #assasination pic.twitter.com/lpXPy7YB9H— CASPR (@CASPR_INDIA) August 20, 2021
పదిహేడు, పద్దెనిమిది శతాబ్దాలలో కోపర్నికస్, గెలీలియో, బ్రూనో, న్యూటన్, లిల్, డార్విన్, హట్టన్ వంటి వైజ్ఞానికులు విశ్వ నిర్మాణం, జీవ పరిణామం విషయాలలో కొత్త సిద్ధాంతాలను ముందుకు తెచ్చారు. మత విశ్వాసాలకు బలమైన సవాళ్ళు విసిరారు. ఎదుర్కోవడానికి స్థిరంగా నిలబడ్డారు. ఈ విశ్వాన్ని నడిపిస్తున్న సూత్రాలేమిటో నిశితంగా పరిశీలిస్తే, మనకు ఈ విశ్వంలోనే కనిపిస్తాయని నిరూపిస్తూ వచ్చారు. దీనితో జనంలో రెండు ప్రశ్నలు తలెత్తాయి. ఒకటి-మతం చెప్పింది విశ్వసించడమా? రెండు – సైన్సు చూపిన మార్గాన్ని అనుసరించడమా? ఇవి రెండూ ప్రజల చర్చకు దారితీశాయి. ఆనాడే కాదు, శతాబ్దాలు దాటొచ్చినా, ఈ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. సంస్కృతి, సంప్రదాయం, ఆచారం పేర్లతో ప్రపంచంలో ఎక్కువ శాతం మంది మూఢనమ్మకాల్లో మగ్గిపోతూ ఉన్నారు. అదే సమయంలో శాస్త్ర సాంకేతిక ఫలితాలను పూర్తిగా అనుభవిస్తున్నారు. ”వైజ్ఞానిక రంగం అందించిన అన్ని వసతుల్ని ఒకవైపు అనుభవిస్తూనే, ఇంకా ఎందుకు మూడు వేల నాటి పనికిరాని భావజాలాన్ని పట్టుకుని వేళ్ళాడుతున్నారు?” అన్నది నేటి సైన్సు కార్యకర్తల ప్రశ్న. దేన్ని అనుభవిస్తున్నారో దాని పట్ల నిజాయితీగా ఉండనవసరం లేదా? నిజాయితీ లేక అబద్ధపు బతుకులు బతికేవారిని ఏమనాలీ?
ఆగస్టు 20, శాస్త్రీయ దృక్పథ దినోత్సవం సందర్భంగా (National Scientific Temper Day)…
క్రీ.శ. 1700 నుంచి వైజ్ఞానికులు భూమి పొరల్లో కొన్ని కొన్ని చోట్ల శిలాజాలను గుర్తిస్తూ వచ్చారు. క్రమంగా ఏ శిలాజం ఏ జంతువుదో గుర్తించగలిగే నైపుణ్యాన్ని పెంచుకున్నారు. అందులో కొన్ని రకాల వృక్షాలు, జంతువులు తర్వాతి కాలాలలో జీవించి లేవని గుర్తించారు. ఈ విషయంలో పరిశోధనలింకా జరుగుతూనే ఉన్నాయి. జార్జికువిర్ (1769-1832) అనే ఫ్రెంచ్ ప్రకృతి పరిశోధకుడు గతంలో జీవించిన కొన్ని ప్రాణులు అంతరించి పోయాయని ప్రతిపాదించాడు. అందువల్ల ఈ ”అంతరించి పోవడ”మనే విషయం వెలుగులోకి వచ్చింది. అంతే కాదు, అదొక ముఖ్యమైన అధ్యయన విషయమైంది.
జేమ్స్ హట్టన్ స్కాట్‌ల్యాండ్ భూగర్భ శాస్త్రవేత్త 1788లో భూసిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. భూమి పొరలు పొరలుగా ఉందని- దాని సారాంశం! అది నిజమే అని నిర్ధారణ అయ్యింది. ఎందుకంటే ఒక్కొపొరలో వృక్ష జంతు శిలాజాలు లభ్యమవుతూ ఉండడం వల్ల – అవి ఏయే కాలాలలో జీవించి ఉండేవో లెక్కలు కట్టడానికి వీలయ్యింది.
మత గ్రంథాల్లో చెప్పినట్టుగా ఒక్కసారిగా మహా ప్రళయాలు రావడం లేదని అవి క్రమేపీ కొన్ని వందల, వేల యేండ్లపాటు జరుగుతూనే ఉంటాయని బ్రిటిష్ భూ భౌతిక శాస్త్రవేత్త చార్లెస్ లిల్ (1797-1875) ఉదాహరణలతో సహా ప్రతిపాదించాడు. ఛార్లెస్ లిల్, జేమ్స్ హట్టన్ భూ సిద్ధాంతానికి ప్రాచుర్యం తెచ్చినవాడు. ఈ ఇద్దరి పరిశోధనా ఫలితాలు ఛార్లెస్ డార్విన్‌కు ఉపయోగపడ్డాయి. ఇవేకాక, ఇంకా ఇతర సిద్ధాంతాలెన్నో డార్విన్‌కు ఉపయోగపడ్డాయి.
డార్విన్‌కు సమాంతరంగా ఆల్‌ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ కూడా జీవ పరిణామ క్రమంపై పరిశోధనలు చేశాడు. విలియం స్మిత్ – ఇంగ్లీష్ జియోలజిస్ట్ తొలిసారి ‘ఇంగ్లాండు – వేల్స్’ల జియోలోజికల్ మాప్స్’ ప్రకటించాడు.
దేవుడు చేసిన ఈ సృష్టిలో ఎలాంటి మార్పులూ ఉండవని ప్రజలు నమ్మేవారు. యుగాంతంలో సర్వం నాశనమైపోయి, మళ్ళీ కొత్త జీవాలు పుడుతాయని విశ్వసించేవాళ్ళు. ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు ఏవీ లేకపోవడం వల్ల, ఇతర ప్రాంతాలు తిరిగి చూసే వీలుండేది కాదు. తమ చుట్టుపక్కల ఉన్న వృక్ష, జంతు జాతుల్ని మాత్రమే చూస్తూ ‘జీవాల్లో మార్పేమీ ఉండదు’ అని అనుకునేవారు. పారిశ్రామిక విప్లవం వల్ల రవాణా సౌకర్యాలు పెరిగాయి. రవాణా సౌకర్యంతో పాటు వ్యాపారాలు పెరిగాయి. వ్యాపారాలతో పాటు ప్రయాణాలు పెరిగాయి. ప్రయాణాలు పెరగడం వల్ల మనుషులకు వేర్వేరు ప్రాంతాల్లోని జీవ వైవిధ్యాన్ని గమనించడానికి వీలయ్యింది. క్రమంగా కొత్త విషయాలు గ్రహించడానికి, కొత్తగా ఆలోచించడానికి అవకాశం వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా మనుషులు తమ చుట్టూ ఉన్న పరిసరాల్ని పరిస్థితుల్ని గమనిస్తూ ప్రకృతి నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటూ వచ్చారు. ఒక్కొక్క మెట్టెక్కి మేడపైకి చేరుకున్నట్టు – ఒక్కొక్క ఆవిష్కరణతో మానవ జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ వస్తున్నారు. వ్యవసాయ, ఆహార, ఆహార్య, రవాణా, వైద్య, విద్య, సంక్షేమ – వంటి అన్ని రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చుకున్నారు. పూర్తిగా జీవనశైలినే మార్చుకున్నారు. ”మనుషులం గనక, మనుషుల్ని ప్రేమించాలి. వర్ణ, వర్గ, లింగ ప్రాంతీయ బేధాలు లేకుండా, మానవ జాతి అంతా ఒక్కటేనని నినదించాలి” అని అంటున్నారు. కాని, కొందరు స్వార్థపరులు, కుట్రదారులు మనిషిని మనిషితో కలవకుండా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో అందరూ అప్రమత్తులై ఉండాలి. మనిషిని కాదు – మనిషిలోని స్వార్థాన్ని చంపితే, నిస్వార్థం పెల్లుబికి వస్తుంది.
ఎక్కువమంది నమ్మే అబద్ధం ఏనాటికీ సత్యంగా మారిపోదు. వారు అలా అబద్ధాన్ని నమ్మడానికి వారి అవగాహనా రాహిత్యమో, అమాయకత్వమో, అవివేకమో, లేక మూర్ఖత్వమో కారణం కావొచ్చు. తక్కువ మంది నమ్మే సత్యం ఎప్పటికీ అబద్ధం కాదు. హేతుబద్ధంగా తనని తాను నిరూపించుకుని, తగిన కారణాల్ని చూపించినప్పుడే, విశ్లేషణలకు, వివరణలకూ అవకాశమిచ్చినప్పుడే అది వాస్తవమౌతుంది. సత్య నిరూపణ అంటే ఇదే. సత్య శోధన అంటే ఇదే.
ఛాందసులు నమ్మే సత్యశోధన, సత్యాన్వేషణ వేరు. వాటితో దేనికీ సంబంధం లేదు. ఏ నిరూపణలకూ నిలబడకుండా తమ విశ్వాసాల్ని గుడ్డిగా నమ్మమని బోధించేవి – ఏవైనా సరే, అవి అబద్ధాలవుతాయి. సత్యం సత్యమే అసత్యం అసత్యమే! వీటిని నమ్మేవారి సంఖ్యతో మనకు పనిలేదు. అబద్ధాలు రాజ్యమేలినా, వాటిలోని డొల్లతనం శతాబ్దాలుగా బయట పడుతూనే ఉంది కదా? మనోభావాల్ని అడ్డుపెట్టుకుని, అబద్ధాల్ని సత్యాలుగా ఎల్లకాలం చలామణి చేయలేరు. నానాటికీ జనంలో వివేకం పెరుగుతున్న దశలో గుడ్డి నమ్మకాల్ని వ్యాపింపజేయాలనుకోవడం బుద్ధితక్కువ పని.
ఏ కాలంలో నైనా, ఏ సమాజంలోనైనా వైజ్ఞానికులు,హేతువాదులు కొద్దిమందే ఉన్నారు. ప్రపంచంలో మార్పు వారితోనే సాధ్యమవుతూ వచ్చింది. నిత్యజీవితంలోని అన్ని రంగాల్లో వస్తున్న అన్ని మార్పులకు కారణం వీరే. ఆలోచించకుండా ఒక ప్రవాహంలో కొట్టుకుపోయే జనం కొన్ని మిలియన్ల మంది ఉండొచ్చుగాక, వారితో సమాజంలో ఏ మార్పూ రాలేదు. ఇక ముందు కూడా రాదు. తమ మానసిక బలహీనతలతో, కొన్ని భ్రమలకు లోనై, అదే వాస్తవమనుకుని, దైవశక్తుల్ని, మతాల్ని, సంబంధించిన గ్రంథాల్ని నమ్ముకుంటూ అధిక సంఖ్యాకులు జీవితం వృధా చేసుకుంటూ ఉంటారు. భక్తి అనేది మోసానికి, వ్యాపారానికి, దోపిడీకి పర్యాయపదాలైన తర్వాత కూడా, నిజం గ్రహించలేని అచేతనుల్ని ఏమందాం?
అటు విశ్వ రహస్యాల్ని, ఇటు జీవ రహస్యాల్ని తెలుసుకుంటూ నిత్య చైతన్యవంతులై ఉంటే ‘జ్ఞానసిద్ధి’ కలుగుతుంది. ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఈ సమాజంలో నువ్వేమిటి? నీ స్థాన మేమిటి? అనేది తెలుసుకుంటే ‘ఆత్మదర్శనం’ కలుగుతుంది. అంతేగాని, ఆత్మ-పరమాత్మ అంటూ ముక్కూ, కండ్లూ మూసుకుని బోధించేవారి వల్ల – వినేవారి వల్ల ఈ లోకానికి ఎప్పుడూ ఎక్కడా ఏ ఉపయోగమూ కలుగలేదు. ఇక ముందు కూడా కలగదు. సైన్సుకు అందని ‘అతీతమైన శక్తి’ ఉందని జనాన్ని ఊదరగొట్టేవారు, తాము చేసే పనులన్నింటికీ తమ ‘అతీత శక్తి’ని మాత్రమే ఉపయోగించుకుని – జనానికి ఏవైనా మంచి ఫలితాలు చూపగలిగితే అప్పుడు ఆలోచిద్దాం? దీనికి ముఖ్యమైన షరతు ఏమిటంటే, వారు తమ దైనందిన జీవితంలో సైన్సు విజ్ఞానాన్ని గాని, సైన్సు పరికరాల్ని గాని, సైన్సు ఉత్పత్తులను గానీ ఏమాత్రం వాడగూడదు.
(మూఢనమ్మకాల నిర్మూలనం కోసం కృషి చేస్తూ హత్యకు గురైన డా. నరేంద్ర దబోల్కర్ స్మృతిలో 20 ఆగస్టును జాతీయ వైజ్ఞానిక స్పృహ-దినంగా పరిగణిస్తున్నాం)
(మలసాని శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు)