(వైద్యం వేంకటేశ్వరాచార్యులు)
గాంధారి పుట్టిన నేల, ఒకప్పటి గాంధారము నేటి ఆఫఘనిస్తాన్ గురించి రెండు మాటలు ఆఫ్ఘనిస్తాన్ అంటే….
బౌద్ధ తాత్విక శాఖలన్నింటిలోకీ
మణిపూసగా భావించబడే
సౌత్రాంతిక బౌద్ధాన్ని స్థాపించిన
‘కుమారలత’ నడయాడిన భూమి.
ఆఫ్ఘనిస్తాన్ అంటే …
అభిధమ్మ కోశకారిక అని పిలువబడే
మహత్తర గ్రంధాన్ని రచించి
తన బోధనాశక్తితో
చైనాను బౌద్ధ ప్రభావంలోకి తీసుకొచ్చిన
‘వసుబంధు’ బతికిన నేల.
ఆఫ్ఘనిస్తాన్ అంటే…
యోగాచార తాత్విక శాఖను స్థాపించిన
మహాయాన తాత్వికుడు
‘అసంగుడు’ జీవించిన చోటు.
ఆఫ్ఘనిస్తాన్ అంటే…
ప్రపంచ భాషాశాస్త్రవేత్తలంతా
అచ్చెరువొందే పటిష్ట
వ్యాకరణ గ్రంధం అష్టాధ్యాయి ని
రచించిన ‘పాణిని’ పుట్టినిల్లు.
ఆఫ్ఘనిస్తాన్ అంటే…
భారత , పార్థియన్ , గ్రీక్ ,రోమన్
కళల ,శిల్పరీతుల ,సంస్కృతుల
సంగమ స్థలి అయిన ‘గాంధారం.’
ఆఫ్ఘనిస్తాన్ అంటే…
మధ్య ఆసియా ,ఆగ్నేయాసియా ,చైనా ,జపాన్ల
సంస్కృతినీ ,చరిత్రనూ
లోతుగా ప్రభావితం చేసిన
బౌద్ధిక – సాంస్కృతిక ఉప్పెన.