(ఇఫ్టూ ప్రసాద్ పిపి)
ప్రధాన స్రవంతికి చెందిన ప్రచార మాధ్యమాలలో నేడు ఆఫ్ఘనిస్తాన్ పై విస్తృతంగా అసత్య ప్రచారం సాగుతోంది. అమెరికా సైనిక ఉపసంహరణ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు తమ స్వేచ్చా స్వాతంత్ర్యాల్ని కోల్పోయారనేది అందుకొక నిదర్శనం.
ఏ దేశ ప్రజల భవిష్యత్తునైనా ఆ దేశ ప్రజలే నిర్మించుకోవాలి. ఒక దేశ ప్రజల భవిష్యత్తును మరో దేశం నిర్మించాలనడం ఆయా దేశాల స్వాతంత్ర్యం, సార్వభౌమాధికార న్యాయ సూత్రాలకు విరుద్ధమైనది. ఈ అంతర్జాతీయ రాజకీయ న్యాయ ప్రమాణాలకు పైన పేర్కొన్న ప్రచారం పూర్తి విరుద్ధమైనది.
ఇది సామ్రాజ్యవాద యుగం. ఈ యుగంలో మాతృదేశ భావనకి రాజకీయ ప్రాసంగీకత ఉంటుంది. విదేశీ దురాక్రమణల కి గురైన ఆయా బాధిత దేశాల ప్రజలకి స్వేచ్చా స్వాతంత్ర్యాల్ని ఏ పరిస్థితుల్లో విదేశీ పరతంత్య పాలన అందించలేదు. ఇదో ప్రాధమిక రాజకీయ మౌలిక సూత్రం. పైన పేర్కొన్న ప్రచారం ఈ మౌలిక రాజకీయ సూత్రానికి పూర్తి విరుద్ధమైనది.
బ్రిటన్ నిరంకుశ పరిపాలన నుండి 1776లో అమెరికా స్వాతంత్ర్యం పొందింది. తమ స్వాతంత్య్ర సాధన కోసం బెంజిమన్ ఫ్రాoక్లిన్ వంటి నాటి అమెరికా స్వాతంత్ర్యోద్యమ నేతలు ప్రాన్స్ చక్రవర్తి లూయూ సాయం కోరారు. ఐతే ఆ పేరిట ప్రాన్స్ జోక్యాన్ని ఒప్పుకోలేదు. తమ అమెరికా దేశ ప్రజలు బ్రిటన్ వల్ల కోల్పోయిన స్వేచ్చా స్వాతంత్ర్యాలను మరో విదేశీ సైనిక జోక్యం ద్వారా ఎప్పటికీ పొందలేరని బెంజిమన్ ఫ్రాoక్లిన్ వంటి వాళ్ళు స్పష్టం చేశారు. (తర్వాత 13 ఏళ్ళకె 1789లో పారిశ్రామిక విప్లవ తుఫానులో ఫ్రెంచ్ ప్రభుత్వం పతనమైనది) ఈ ప్రాధమిక రాజకీయ సూత్రానికి పై ప్రచారం పూర్తి విరుద్ధమైనది.
మతతత్వ తాలిబన్లను బూచిగా చూపించి, ఆఫ్ఘనిస్తాన్ ని 7-10-2001న అమెరికా సైన్యాలు దురాక్రమించాయి. అమెరికా దురాక్రమణ చర్య అమెరికా స్వాతంత్ర్య ప్రకటనకి పూర్తి విరుద్ధమైనది.
అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణల చరిత్ర ఓ నగ్న సత్యాన్ని వెల్లడిస్తుంది. ప్రపంచంలో నిరంకుశపాలన సాగించిన ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు పాలించే ఏ ఒక్క దేశంలోనూ వాటిని కూల్చి స్వేచ్చా స్వాతంత్ర్యాల్ని ఆయా దేశాల పీడిత ప్రజలకి అందించిన చరిత్ర అమెరికాకి లేదు. పైగా పెనం మీది నుండి పొయ్యులో పడ్డ చందంగా అది వారిని మరిన్ని దురవస్థల పాల్జేసిందని చరిత్ర పదేపదే నిరూపించింది. పైన పేర్కొన్న మీడియా ప్రచారం ఈ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమైనది.
ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబన్ల ప్రభుత్వం పరిపాలించిన గత కాలంలో సైతం దానికి దేశ పాలనా యంత్రాంగం మీద పూర్తి పట్టు ఏనాడూ రాలేదు. ముఖ్యంగా ఉత్తరాన తజిక్, ఉజ్బెక్, కిర్గిజ్ వంటి మైనారిటీ జాతులు, నైరుతి లో హజారా జాతికి చెందిన ప్రజలపై వారికి నియంత్రణ లేదు. 2001 వరకు మనుగడలో ఉన్న తాలిబన్ల సర్కారుకు నార్థర్న్ అలయన్స్ (NA) గట్టి పోటీదారుగా కూడా నిలిచింది. ప్రధానంగా పఠానీ జాతీయుల ప్రాంతాల వరకే తాలిబన్ల నియంత్రణ ఉండేది. నేటి స్థితి చాలా మారింది. పైన పేర్కొన్న NA కూడా తన గత స్థానాన్ని కోల్పోయింది. నేటి వాస్తవిక పరిస్థితిని చూస్తే, తాలిబన్ల సారధ్యంలో తొలిసారి ఏకీకృత దేశం (unified nation) గా ఆఫ్ఘనిస్తాన్ ఏర్పడ బోతోంది. ఈ నూతన భౌతిక పరిస్థితికి కారణం అమెరికా, నాటో విదేశీ దురాక్రమణ సేనలు దాన్ని దురాక్రమించి వల్లకాడుగా మార్చడమే! ఫలితంగా నేడు ఆఫ్ఘనిస్తాన్ దేశ ప్రజలు తెగలు, జాతులు, ప్రాంతాలకి అతీతం గా విదేశీ పరతంత్ర్య పాలనను ఐక్యంగా వ్యతిరేకించడమే! అమెరికా, నాటో సైనిక బలగాలు తమ దేశంలో తిష్ట వేసి ఉన్నంత కాలం ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు నిజంగానే స్వేచ్చా స్వాతంత్యాలు లభిస్తే, ఈ కొత్త భౌతికస్థితి ఏర్పడే అవకాశం ఉండదు. కానీ అమెరికా సైనిక బలగాల ఉపసంహరణకు ముందు, ఆఫ్ఘనిస్తాన్ దేశ ప్రజలు స్వేచ్చా స్వాతంత్ర్యాల్ని అనుభవించినట్లు మీడియా ప్రచారం చేయడం గమనార్హం.
సామ్రాజ్యవాద ప్రచార సాధనాలు తిమ్మిని బమ్మిగా చిత్రించగలవు. నిజానికి తాజా అమెరికా సైనిక ఉపసంహరణ ప్రక్రియ ఆఫ్ఘనిస్తాన్ ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబించేది. అట్టి చేదు నిజాన్ని కప్పిపెట్టి, ఇకనుంచి మాత్రమే ఆ దేశ ప్రజలు స్వేచ్చా స్వాతంత్ర్యాల్ని కోల్పోతున్నట్లు చిత్రించడం గమనార్హం. సామ్రాజ్యవాద మీడియాతో అప్ లింకింగ్ చేయబడి, వాటి ప్రాబల్యం, ప్రభావాలతో సాగే దేశీయ ప్రచారసాధనాలు సైతం అదే అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఈ భౌతిక వాస్తవం పట్ల సామ్రాజ్యవాద వ్యతిరేక రాజకీయ శక్తులకు స్పష్టత ఉండాల్సి ఉంది.
ఒకవేళ పైన పేర్కొన్న ప్రచారం నిజమేనని భావిస్తే లేదా భ్రమిస్తే, అది దేనికి దారి తీస్తుందో కూడా అవగాహన ఉండాల్సి ఉంది. ఈ భావన ప్రకారం విదేశీ దురాక్రమణ సైనిక బలగాలు ఆఫ్ఘనిస్తాన్ లో ఇంకా కొనసాగి వుండాల్సిందనే వాదనను కూడా సమర్ధించాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇరవై ఏళ్ళ క్రితం ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని అమెరికా, నాటో బలగాలు దురాక్రమించడం సరైనదని సమర్ధించాల్సి వస్తుంది. 2001 లో బుష్ ప్రభుత్వం ప్రకటించిన
” *ఉగ్రవాదంపై నిరంతర యుద్ధ* ” ప్రకటనని కూడా సమర్ధించాల్సి వస్తుంది. ఇది రాజకీయంగా ప్రమాదకర ఆలోచనా విధానం. ఇది తెలిసి చేసినా, తెలియక చేసినా చారిత్రిక అపరాధమే అవుతుంది.
సామ్రాజ్యవాద యుగంలో ప్రజా వ్యతిరేక స్వదేశీ నిరంకుశ ప్రభుత్వాల పాలన కంటే, విదేశీ వలస రాజ్యాల పాలన ఎక్కువ ప్రమాదకరమైనది. ప్రజాతంత్ర వ్యతిరేక స్వభావం గల స్వదేశీ ప్రభుత్వాల నిరంకుశ పాలనని వ్యతిరేకించే పేరిట ఒకవేళ విదేశీ పరతంత్య పాలనని స్వాగతించడాన్ని ఏ దేశ ప్రజలూ ఆమోదించజాలరు. కానీ, విదేశీ సైనిక దురాక్రమణ పాలనను వ్యతిరేకించే మార్గం చేపట్టిన స్వదేశీ ప్రజా వ్యతిరేక రాజకీయ శక్తుల్ని సైతం ప్రజలు తాత్కాలికంగానైనా సమర్ధిస్తారు. ప్రజా వ్యతిరేక పాలన కంటే, జాతి వ్యతిరేక పాలన పై ప్రజాగ్రహం ఎక్కువ పాళ్లలో ఉంటుంది. రెండు శతాబ్దాల పాటు విదేశీ వలస పాలనపై పోరాడిన చరిత్ర భారతదేశ ప్రజలకి ఉంది. ఈ ఘన సాంప్రదాయ చరిత్ర గల మన దేశ ప్రజలు ఈ నేపధ్య దృక్కోణంతో పై తప్పుడు ప్రచారాన్ని వ్యతిరేకిస్తారని ఆశిద్దాం. ( Image credit: Aljazeera)
(ఇందులో వ్యక్తం చేసినవి రచయిత సొంత అభిప్రాయాలు.)