(కోడం కుమారస్వామి)
పాల తడారని లేత పెదవి నవ్వులతో మాట్లాడాలి
మృత్యు ఒడిచేరుతూ అలసిన కనుపాపతో మాట్లాడాలి
మనోపుటలో రాసుకున్న అక్షరాల్ని మాట్లాడాలి
సత్యం అసత్యమై ఊరేగుతున్నపుడు మాట్లాడాలి!!
కరచాలనంలో దాసుకున్న బాస చెదురుతున్నపుడు మాట్లాడాలి
ప్రేమ కనులజలపాతంతో మునివేళ్లు మాట్లాడాలి
మనిషి శ్వాసయి మాట్లాడాలి! మానవీయ ధర్మంగా మాట్లాడాలి!!
దుఃఖం సముద్రమైనపుడు ఓదార్పు కెరటమయి మాట్లాడాలి
సముద్రం నిశబ్దమైనపుడు చిరుగాలి సంగీతమై మాట్లాడాలి
ఒకరికొకరు పరాయికరణవుతున్నపుడు మనోక్షరమై మాట్లాడాలి
మాట్లాడటం నేరం కాదు! మాట్లాడటం ధర కాదు!!
మాట్లాడటం నిషేధమైనపుడు మరోసారి మాట్లాడాలి!
చూపులు నరికేసినచోట చిగురించి మాట్లాడాలి
కలవడం తప్పయిన జాగలో కలిసిమెలిసి మాట్లాడాలి!
నువ్వు నేనయి, నేను నువ్వయి యుగళగీతమయి మాట్లాడాలి!!
శబ్దం నిశ్శబ్దమైనపుడు చిరు నవ్వు మాట్లాడాలి!
గుండెపటువ కన్నీటి నెత్తరు బరువైనపుడు సుట్టకుదురై మాట్లాడాలి
ఆంక్షలపై మాట్లాడాలి! ఆకాంక్షలపై మాట్లాడాలి!!
వసంతమేఘ గర్జనకు గద్దర్ పల్లవిలా మాట్లాడాలి!
గుండె దరువుకు దరువేసిన డోలక్ దయలా మాట్లాడాలి!
బడిపంతులు ఆజంఅలీలా,హక్కుల పురుషోత్తంలా మాట్లాడాలి!
నిర్బంధపు సంకేళ్లు గొంతుకు బిగుసుకున్నా వరవర కవితయి మాట్లాడాలి!
(కోడం కుమారస్వామి, అధ్యాపకులు, జనగామ
మొబైల్ :9848362803)
ధన్యవాదాలు సర్…
చాలా మంచిగా చెప్పారు.ప్రశ్నించలేని తనం ఒక దౌర్భాగ్యం.
మీ స్పందన కు ధన్యవాదాలు సర్