డాక్టర్ చండ్ర రజనీకి భారత రాష్ట్రపతి “ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్ -2021” ప్రదానం చేశారు.
మన దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తూ వివిధ రంగాలలో ప్రవాస భారతీయులు చేస్తున్న కృషిని గుర్తించి భారత రాష్ట్రపతి ఇచ్చే అత్యున్నత పురస్కారం “ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్” కు ఎంపికయ్యారు. అజర్ బైజాన్ దేశ రాజధాని బాకులో స్థిరపడ్డ తెలుగు బిడ్డ డా.రజనీ చండ్ర – డీ మెలో వైద్య రంగంలో విశేష కృషి చేసి, దేశ ప్రతిష్టను పెంచినందుకు గుర్తింపుగా “ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్ -2021″ను ప్రకటించారు.
కరోనా కారణంగా రాష్ట్రపతి భవన్ లో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా నిర్వహించలేని కారణంగా అజర్ బైజాన్ లోని భారత రాయబారి ఆగస్టు 6న రాయబారి కార్యాలయంలో నిర్వహించిన ఉత్సవంలో రాష్ట్రపతి తరపున అవార్డును అందజేశారు.
డా.చండ్ర రజనీ విద్యార్థి దశలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఏ.ఐ.ఎస్.ఎఫ్.)లో చురుకుగా పని చేసిన కార్యకర్త. నేను ఏ.ఐ.ఎస్.ఎఫ్. జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కాలంలో నాటి సోవియట్ యూనియన్ (యు.ఎస్.ఎస్.ఆర్.)లో ఉన్నత విద్యార్జనకు ఏ.ఐ.ఎస్.ఎఫ్. ద్వారా 1987లో వెళ్ళి, పట్టభద్రురాలై అజర్ బైజాన్ రాజధాని బాకులో డాక్టరుగా రజనీ స్థిరపడింది.
డా.చండ్ర రజనీ ఒక సామాన్య కుటుంబంలో జన్మించింది. వాళ్ళ నాన్న గారు అమరజీవి కా.చండ్ర వెంకటకృష్ణయ్య గారు కృష్ణా జిల్లా మంగళాపురం, ఒకనాటి దివి తాలూకాలో కమ్యూనిస్టు ఉద్యమంలో పని చేశారు. తదనంతర కాలంలో విజయవాడలో విశాలాంధ్ర దినపత్రిక కేంద్ర కార్యాలయం చంద్రం బిల్డింగ్స్ కు ఎదురుగా ఒక కిరాణా షాపు నిర్వహించుకొంటూ పిల్లలను క్రమశిక్షణతో పెంచి చదివించడంతో పాటు కమ్యూనిస్టు భావజాలం వైపు వారి ఆలోచనలను మలిచారు. ఏ.ఐ.ఎస్.ఎఫ్.లో పని చేయమని ప్రోత్సహించే వారు. రజనీతో పాటు ఆమె తమ్ముళ్లు శ్రీనివాస్, వెంకట్, ఇద్దరూ కూడా ఏ.ఐ.ఎస్.ఎఫ్.లో క్రియాశీల కార్యకర్తలుగా పనిచేశారు.
అక్క తోడ్పాటుతో శ్రీనివాస్ అజర్ బైజాన్ కు వెళ్ళి స్థిరపడ్డాడు. వెంకట్ విశాఖ ఉక్కు కర్మాగారంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఎఐటియుసి కార్యకలాపాలకు అండగా ఉంటున్నాడు. రజనీ పెద్ద బాబాయ్ కా.చండ్ర బాబురావు గారు విశాలాంధ్ర దినపత్రికలో క్యాషియర్ గా సుదీర్ఘ కాలం సేవలందించారు.
చిన్న బాబాయ్ కా.చండ్ర రవింద్ర గుంటూరు పట్టణంలో సిపిఐ కార్యకలాపాల్లో భాగస్వామి. ఆ కుటుంబాలన్నీ కమ్యూనిస్టు కుటుంబాలే. అలాంటి నేపథ్యంలో పెరిగి, ఏ.ఐ.ఎస్.ఎఫ్. ఉద్యమాలలో పాల్గొన్న డా.రజనీకి “ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్” లభించడం చాలా సంతోషం, గర్వకారణం. ఆమెకు టి.లక్ష్మీనారాయణ, ఏ.ఐ.ఎస్.ఎఫ్.
పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.