మా తెలుగు తల్లికి మల్లెపూదండ… ఏ సినిమా కోసం రాసిన పాట?

తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర గీతం ‘మా తెలుగు తల్లికి  మల్లెపూదండ’ అందించిన వాడు శంకరం బాడి సుందరాచారి. అది చక్కటి తెలుగు గీతం. తెలుగు సంస్కృతి, తెలుగు భౌగోళికం ఇముడ్చుకున్న మధురమయిన గేయం. కాని దీనిని మనకు అందించిన మహానుభావుడు  శంకరం బాడి సుందరాచారి (జననం   ఆగస్టు 10,1914) మాతృభాష  తమిళం. కాకపోతే, ఆయన కుటుంబం  తిరుపతిలో ఉండేది. అక్కడే జన్మించాడు. తెలుగు ప్రాంతంలో పుట్టిపెరిగాడు, తిరుపతి మదనపల్లెలలో చదువుకు కున్నాడు కాబట్టి ఆయన తెలుగువాడు కాకతప్ప లేదు. ఒక విధంగా ఆయన మనకు తమిళం అందించిన కానుక.

ఆయన కవిత్వం  తెలికగా సాగుతుంది. మనం తెలిపోయేలా చేస్తుంది. ఆయనకు తేటగీతి బాగా ఇష్టం. ‘మా తెలుగు తల్లికి  మల్లెపూదండ’ కూడా తేటగీతిలో రాసిందే. అదొక గేయమయి పోయింది మనకు. దానిని ఒకే గేయం లాగా పాడుతూ ఉంటాం. నిజానికది నాలుగు తేట గీతాలు. ఆయన పేరు ‘శంకరంబాడి సుందరాచారి’ కూడా తేటగీతి లో ఇమిడింది. ఈ విషయం చెబుతూ అందుకే తేటగీతి అంటే నాకు ఇష్టం అని చెప్పుకునే వాడు. ఆయన తేటగీతాలలో ఎంతయిన చెప్పుకోవచ్చు.

తెటగీత అంటే ఏమిటి. దీనికి అప్పకవీయం లో ఛందో నిర్వచనం ఉంది

‘సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరుదినకరద్వయంబు తేటగీతి’

ప్రతిపాదంలోనూ ఒక సూర్యగణం + రెండు ఇంద్ర గణాలు + రెండు సూర్యగణాలు ఉంటాయి. 1.2.1 యతి నాల్గవ గణంలో మొదటి అక్షరం యతి ప్రాసయతి చెల్లును. ప్రాసయతి చెల్లించిన పద్యాన్ని అంతరాక్కర గా పిలుస్తారు. అయితే అన్ని అంతరాక్కరలు తేటగీతులు కావు.1.2.2 ప్రాసప్రాస నియమం లేదు

ఇపుడు మరొక విషయం.  మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేది రాష్ట్రం కోసం రాసిన గీతం కాదు. అది  1942లో ’దీనబంధు‘ అనే సినిమా కోసం రాసిన గేయం.  అయితే, అది సినిమా వాళ్లకి నచ్చలేదు. ఇది జనవరి 1, 1942లో  విడుదలయింది. తర్వాత ఈ పాటి టంగుటూరి సూర్యకుమారి అద్భుతంగా పాడారు. దానితో బాగాప్రాచుర్యంలోకి వచ్చింది.

దీనబంధు సినిమాని రూపవాణి పిక్చర్స్ వారు తీశారు. డైరెక్టర్ ఎంఎల్ బందల్, ఈ సినిమాలో ఆయన నటించారు కూడా.

1975 ప్రపంచ తెలుగు మహాసభల్లోఈ పాట ఆంధ్ర ప్రదేశ్ అధికార గీతంగా ఆమోదించారు.

ఒకసారి ఏదైనా పని వెతుక్కుందామని మద్రాసు వెళ్ళారు. ఆంధ్ర పత్రిక ఆఫీసుకు వెళ్ళి పని కావాలని అడిగారు. దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు “నీకు తెలుగు వచ్చా” అని అడిగారు.

దానికి సమాధానంగా “మీకు తెలుగు రాదా” అని అడిగి పంతులు గారు నివ్వెర పోయేలా చేశారు. నేనిప్పటి వరకు తెలుగు లోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియ లేదు అని అన్నారు.

ఆంధ్ర పత్రికలో ఉద్యోగం చేస్తుండగా, ఒక ప్రముఖునిపై పద్యం వ్రాయవలసి వచ్చింది. తాను వ్యక్తులపై పద్యాలు వ్రాయను అని భీష్మించుకుని, దాని కోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు సుందరాచారి.

బుద్ధగీతి అనే పేరుతో బుధ్ధ చరిత్ర కూడా రాసారు.

రవీంద్రుని గీతాంజలిని అనువదించారు. మూలంలోని భావాన్ని మాత్రమే తీసుకుని, భావం చెడకుండా, తెలుగు నుడికారం పోకుండా చేసిన ఆ స్వతంత్ర అనువాదం బహు ప్రశంసలు పొందింది.ఏకలవ్యుడు అనే ఖండకావ్యం, కెరటాలు అనే గ్రంథం కూడా రచించారు.. సుందర సుధా బిందువులు అనే పేరుతో భావ గీతాలు వ్రాసారు. జానపద గీతాలు వ్రాసారు. స్థల పురాణ రచనలు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *