బాలాజీ అంటే మనమంతా అనుకునేది శ్రీనివాసుడని. కాని అసలు బాలాజీ అనే పేరు శ్రీనివాసునిది కానే కాదని ఎంతమందికి తెలుసు?
సంస్కృతంలో ‘వబయో రభేదః’ అని సూత్రం వున్నది. ఈ సూత్రాన్ని ఔత్తరాహులు విశేషంగా ఉపయోగిస్తారు. మనం బృందావనం అన్నప్పుడు వారి పలుకులలో అది వృందావన్ అవుతుంది. మనము వంగదేశం అంటే వారు బంగదేశం అంటారు. ఈవిధమైన ప్రయోగం వారికి పరిపాటి.
ఇక ప్రస్తుతం అంశంలోకి వస్తే బాలాజీ అనే శబ్దం అసలు ఆంజనేయుడి పేరు. వాలం వున్నందున వాలాజీ అని పిలువబడతాడు. వాలాజీ యే బాలాజీగా పైన చెప్పుకున్నవిధంగా రూపాంతరం చెందింది.
ఇందుకు ప్రమాణం రాజస్థాన్ లోని సాలాసర్ ప్రాంతంలోని హనుమంతుని బాలాజీ అని సంబోధించటం రాజస్థాన్ లో ఇంకా నాలుగుచోట్ల హనుమంతుని ప్రసిద్ధ ఆలయాలున్నాయో అన్నిచోట్లా బాలాజీ అనే పిలుస్తారు.
హైదరాబాదులో గమనించినట్లైతే ఆంజనేయుని ఆలయాలు ఔత్తరాహుల నిర్వాహణలో వున్న వాటికి అనుబంధంగా మిఠాయి దుకాణాలుంటాయి( అక్కడ పాలకోవా తయారు చేయబడుతుంది అలయంలో నివేదనకు వారు పాలకోవా సరఫరా చేస్తారు). ఆ దుకాణాల పేర్లు బాలాజీ బజ్రంగ్ ,బాలాజీ రామ్ ప్రసాద్ వంటి పేర్లుంటాయి.
ప్రాసంగికంగా ఇక్కడ మరొక విషయం చెప్పుకోదగినది. బజ్రంగ్ అంటే వజ్రాంగ అని.( మహావీర్ విక్రమ్ బజరంగీ కుమతి నివార్ సుమతి కే సంగీ – హనుమాన్ చాలీసా) . పైన చెప్పుకున్నట్లగ ‘వ’ ‘బ’ గా మారి వజ్రాంగ్ అనేది బజ్రాంగ్, బజ్రంగ్ గా మారింది.
హథీరాంజీ కి మునుపు ఔత్తరాహులకు శ్రీనివాసుని వైభవం తెలియదు. ఔత్తరాహుడైన హథీరాం తిరుమల చేరి శ్రీనివాసునియందు భక్తి కలిగి ఆయనచేత కాపాడబడిన ఉదంతం లోకవిదితం.
ఏనుగును హిందీ లో హాథీ అంటారు. రాం బాబాజీ హాథీ రాంబాబాజీగా మారారు. ఆయన శ్రీనివాసుని కృపచేత ప్రసిద్ధుడైన తరువాత ఔత్తరాహుల రాకపోకలు తిరుమలకు మొదలైనాయి. వారు తిరుమలలో జాబాలి తీర్థం వద్ద హనుమంతుని ప్రతిష్టించుకుని ‘జాపాలి బాలాజీ ‘అని అనటం మొదలుపెట్టారు.
ఆ కారణంగా వారికి తిరుమల బాలాజీ క్షేత్రంగా ప్రచారం జరిగింది. వారంతా ‘తిరుమల బాలాజీ హోకే ఆయె’ అని చెప్పుకోవటం పరిపాటి.
ఈస్టిండియా కంపెనీ నుండి తిరుమల ఆలయం నిర్వాహణ హథీరాంజీ మఠం మహంతుల చేతికి చేరాక శ్రీనివాసుని ఆలయం లో అనేక విషయలలో హింది జొప్పించబడింది.
ఇది కూడా చదవండి:
తిరుమల పవిత్రతను ఈస్టిండియా కంపెనీ ఎలా కాపాడిందంటే…
ఉదాహరణకు సవాల్ జవాబ్ పట్టి వంటివి. ఔత్తరాహులు మథురప్రియులు. వారి కొరకే తిరుమలలో నేడు జగత్ప్రసిద్ధమైన లడ్డూల ప్రసాదం ప్రవేశపెట్టబడింది.
లడ్డూ శ్రీనివాసునికి ప్రీతిపాత్రమని ప్రచారం జరిగింది. నిజానికి శ్రీనివాసునికి వడ ప్రీతికరమైన ప్రసాదం. తిరుమలై వడై అழగు అని తమిళంలో పழைమొழி (నానుడి ) వున్నది.
శ్రీనివాసుని ఫోటోలు తీసి చిత్రాలు వేయించి ఉత్తరాదిన తిరుమల గురించిన ప్రచారం ముమ్మురంగ సాగుతూ వుండగా వారికి తిరుమల అనగానే హనుమంతుడు గుర్తుకు వచ్చేలాగా ఫోటోల కింది భాగంలో ‘తిరుమల శ్రీవేంకటేశ్వర (బాలాజీ)’ అని దేవనాగరి లిపిలో ప్రింటు చేయబడి ప్రచారం కల్పించబడింది ఈవిధంగా బాలాజీ అంటే శ్రీనివాసుడని ప్రచారం జరిగింది. అదే తరువాత కాలాన శ్రీనివాసుడిని బాలాత్రిపురసుందరి అనే తప్పుడు ప్రచారానికి దారితీసింది.
నేడి హనుమత్ జన్మస్థలం అనే కొత్తవివాదం ఈ బాలాజీ పేరును ఆసరాగానే సాగుతున్నది.
మనకు ఇతిహాసాలు పురాణాలు వున్నాయి. పురాణాలలో సాత్విక రాజసిక తామసికములపి మూడు విధాలైన విభజన వున్నది తామసిక రాజసిక పురాణాలు ప్రామాణికాలు కావు సాత్విక పురాణాలే ప్రామాణికాలు. ఒకవేళ సాత్విక పురాణాలకూ ఇతిహాసాలకూ విభేదం వస్తే ఇతిహాసమే పరమ ప్రమాణమౌతుంది.
శ్రీరామాయణంలో ఎక్కడా కూడా హనుమజ్జననం తిరుమల పైన జరిగిందని కానీ, రాములవారు లంకమీదకు యుద్ధానికి వెళుతూ తిరుమల కు వచ్చినట్లు కానీ ఆంజనేయునీ తల్లి అయిన అంజన వారికి ఆతిథ్యమిచ్చినట్లు కానీ చెప్పబడలేదు. కనుక నేటి ఈ హనుమజ్జన్మస్థలం వివాదం అప్రామాణికం హాస్యాస్పదం. కేవలం కొంతమంది స్వార్థపరుల స్వప్రయోజనాలకై తయారుచేయబడుతున్నదేమో ననిపిస్తున్నది.
శ్రీమతే రామానుజాయ నమః…
(సేకరణ: వైద్యం వేంకటేశ్వరాచార్యులు)
ఇది కూడా చదవండి