(వడ్డేపల్లి మల్లేశము)
కొన్ని దశాబ్దాల క్రితం తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఇంటి గోడ మీద “ఓ స్త్రీ రేపు రా” అనే నినాదం రాసేవాళ్లు. ఆ కాలంలో అర్ధరాత్రి పూట ఒక రక్తపిశాచి ఊరంతా తిరుగుతున్నదని, అది ఎంటి తడుపు తడితే అక్కడ చావేనని ప్రచారంలో ఉన్నప్పుడు ఈ నినాదం ప్రతి ఇంటి గోడ మీద కనిపించేది.
ఈ వరసలోనే ఇపుడు తెలంగాణలో ‘ మా ఎమ్యేల్యే రాజీనామా చేయాలి’అని నినాదం ఎక్కడ చూసినా వినబడుతూ ఉంది. ఇపుడు గోడరాతలు లేవు కాబట్టి, ఈ నినాదం ఫేస్ బుక్ గోడ మీద కనిపిస్తూ ఉంది. వాట్సాప్ లో ఈ నినాదం రాస్తున్నారు, షేర్ చేస్తున్నారు. ఈ పోస్టులు పెద్ద ఎత్తున వైరలయ్యాయి.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల తర్వాత ఎన్నికలకంటే ఉప ఎన్నికలే మేలనే భావం సర్వత్రా కల్గించారు ముఖ్యమంత్రి కెసిఆర్. ఇపుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ పెడధోరణికి పరాకాష్ట అవుతున్నది.
అందుకే మా ఎమ్మెల్యే కూడా పోతే బాగుండనే ప్రచారం సరదాకు సీరియస్ గానే అయినా జోరుగా సాగుతూ ఉంది. సాధారణ ఎన్నికల్లో ఓటుకు అయిదొందలో వేయో దక్కేది. ఉపఎన్నికల్లో ఇది లక్షలోకి సెన్సెక్స్ లా పెరిగిపోయింది. ఉప ఎన్నికలకోసం ‘మా ఎమ్మెల్యే కూడా పోతే బాగుణ్ణ’ననే చర్చ జరగని ఇల్లు, టీ కొట్టు, బజ్జీ బండి, గ్రూప్ లేదేమో తెలంగాణలో.
TRS ఎన్నికల రాజకీయం
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాడు తెలంగాణ ఆకాంక్షల నేపథ్యంలో ఉత్కృష్ట స్థాయిలో పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో అవకాశాలను కోల్పోయిన తెలంగాణ ప్రాంతానికి చెందిన పేద, మధ్యతరగతి, అట్టడుగు ప్రజానీకం, దళితులు, ఆదివాసీలు స్వపరిపాలనలో అభివృద్ధి చెందుతారని అందరూ ఆశించారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం మొదటి సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం గడవగానే అనేక వర్గాలు ప్రజాసంఘాలు. ప్రతిపక్షం నుండి అనేక విమర్శలు రావడం ప్రారంభమైనది. మరికొందరు గతంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి అంటే ఈ కాలం సరిపోదని కొంతకాలం వేచి చూడాలని కూడా సూచనలు చేయడం జరిగింది.
ఆ రకంగా మొదటి దఫా ఐదు సంవత్సరాలు పూర్తి కాకముందే ముందస్తు ఎన్నికలు రావడంతోనే రాజకీయ విష సంస్కృతి ప్రారంభమైనట్లు గా తెలుస్తున్నది.
ఇదే సందర్భంలో రాష్ట్రంలోని ప్రజా సంఘాలు, మేధావులు, వక్తలు అనేక వేదికలపైన ఒక ప్రకటన చేస్తూ గమ్యాన్ని చేరుకోవాలంటే ఆ వైపుగా ప్రయాణం ప్రారంభించాలి కదా! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం గమ్యం ఒక వైపు ఉంటే గమనం మరొక వైపు ఉన్నది. అలాంటప్పుడు గమ్యాన్ని ఎలా చేరుకోగలం లక్ష్యాన్ని ఎలా సాధించగలమని వారు ప్రశ్నించారు. ప్రజానీకాన్ని చైతన్యం చేశారు.
పెన్షన్లు మిగతా అభివృద్ధికె సంబంధించినటువంటి వాటితోపాటు రైతుబంధు, రైతు బీమా వంటి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను ముందు పెట్టుకుని ప్రజల ఓట్ల కోసం ప్రభుత్వం, టిఆర్ఎస్ పార్టీ పనిచేయడం క్రమంగా ఎన్నికల కోసమే పరిపాలన అనే స్థాయికి చేరుకోవడం విచారకరం.
రెండవసారి ముందస్తు ఎన్నికల తో పాటు అనేక సందర్భాలలో వచ్చిన ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంలో ప్రజానీకాన్ని కులాల వారీగా వర్గాల వారీగా సమీకరించి బతుకమ్మ బోనాలను సంస్కృతికె సంబంధించినటువంటి మత్తులో దించి ఓట్ల దండుకోవడం క్రమంగా ప్రారంభమైనది.
ఉప ఎన్నికలే ఓటర్లకు లాభసాటి
దుబ్బాక ఎన్నికల సందర్భంలోనూ, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంలో, జిహెచ్ఎంసి ఎన్నికల వేళ వివిధ రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఓటర్లను ప్రభావితం చేయడానికి అనేక రకాల ఆశలు చూపి ప్రభువులుగా ఉండవలసిన ప్రజలను బానిసలుగా చేసిన సందర్భం మనం మర్చిపోలేము. ఈ ఎన్నికల్లో మద్యం మత్తు ప్రధాన పాత్ర పోషించడంతో ఈ దుర్భర పరిస్థితికే మరింత కారణమవుతున్నది.
అధికార పార్టీ అలాంటి అకృత్యాలకు పాల్పడినప్పుడు మిగతా రాజకీయ పార్టీలు కూడా ఒకరిని మించి ఒకరు ప్రకటనలు వాగ్దానాలు చేస్తూ విచ్చలవిడిగా ఖర్చు చేసి ప్రజలను త్వరలో పెట్టడమే ఎన్నికల విధానంగా మారిపోయింది ఈ రాష్ట్రంలో.
మరొక ప్రత్యేక విషయం ఏమిటంటే అధికార పార్టీ తరఫున అదినేత, మంత్రులు, శాసనసభ్యులు కూడా ఎన్నికల సందర్భంలో లోపల అనేక రాయితీలను ప్రకటించి అప్పటికప్పుడే కొన్ని పథకాలను మంజూరు చేయడం కూడా గతంలో జరుగుతున్నది. అభివృద్ధి అంటే నిరంతరాయంగా జరగాల్సి ఉంది. కానీ ఎన్నికల వేళ ప్రకటించడం అది అధికార దుర్వినియోగం అవుతుంది. మరి అలాంటప్పుడు ప్రతిపక్షాలు ప్రజలకు ఏమి ఇవ్వగలవు?
కొత్త దారి చూపిన హుజూరాబాద్ ఉప ఎన్నిక
హుజూరాబాద్ లో స్థానిక శాసన సభ్యులు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేసిన కారణంగా ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. రాజేందర్ మీద అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు రావడం, ఆయన రాజీనామా చేసి బిజెపిలో చేరడం, రాజీనామాను స్పీకర్ ఆమోదించడంతో ఎన్నిక అనివార్యమవుతున్నది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఎట్లాగైనా గెలిపించాలని ప్రభుత్వం పడరాని పాట్లు పడుతుంది. స్థానిక అభివృద్ధి కోసం అంటూ కోట్ల రూపాయలు మంజూరు చేయడమే కాకుండా దళిత బంధు పేరుతో ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయల నగదు అందించే కార్యక్రమాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం లోనే ప్రత్యేకంగా పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ప్రకటించడంలోని ఆంతర్యం ఏమిటి?
ఉప ఎన్నిక జరుగుతున్నందున గెలవడం కోసం ఇలా అధికారాన్ని వినియోగించి కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఉంటే మిగతా నియోజకవర్గాల్లోని ప్రజలు తమ శాసన సభ్యులు కూడా రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తే బాగుంటుందనేది చర్చనీయాంశమయింది.
ఈ ఆలోచన నుండి పుట్టిందే ” శాసనసభ్యుల్లారా రాజీనామా చేయండి” అనే వైరల్ పోస్టు. మరొక అడుగు ముందుకు వేసి హైదరాబాద్ ఘోషామహల్ బిజెపి ఎమ్మెల్య రాజాసింగ్ తాను రాజీనామాకు సిద్ధమని, హుజూరాబాద్ కు ప్రటించినట్లే తన నియోజకవర్గానికి కూడా ‘బంధు’ పథకాలు ప్రకటించాలని కోరారు. కొన్ని మండలాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు తాము కూడా రాజీనామా చేస్తాము తమ మండలాన్ని అభివృద్ధి చేయండి అని ప్రభుత్వానికి వేడుకుంటున్నారు. అంటే ఈ రుగ్మత ఏ స్థాయికి పోతుందో అర్థం చేసుకోవచ్చు.
‘బంధు’ ఎందుకు, ఇన్నాళ్లు అభివృద్దే జరగలేదా?
ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్య పద్ధతిలో ఏర్పడే ప్రభుత్వాలు ఆ యా ప్రాంతాల ప్రజాప్రతినిధుల నాయకత్వంలో అభివృద్ధి చేయడానికి ప్రజాధనాన్ని ఖర్చు చేయడం అనేది ఆనవాయితీగా ఉండేది.
చట్టసభల్లో వివిధ పద్దుల పైన సుదీర్ఘమైన చర్చ జరిగిన అనంతరం రాష్ట్రంలో అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న వెనుకబడిన ప్రాంతాలను పరిశీలించి సమ న్యాయం చేయడం ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్ప సుగుణం.
ఈ సుగుణం రాజ్యాంగంలో మాత్రమే రాయబడి ఉండి ఆ రాజ్యాంగం అమలు కాని కారణంగా యొక్క వ్యక్తిగత ఎజెండాతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పలు కూడా రెండు మూడు జిల్లాలు తప్ప మిగతా జిల్లాలన్నీ కూడా నామమాత్రంగానే అభివృద్ధికి నోచుకోకపోవడం లో ఆంతర్యమేమిటో మీకు అందరికీ తెలిసిందే.
మంత్రుల నియోజకవర్గాలు లేదా ముఖ్యమంత్రి నియోజకవర్గం మాత్రమే అభివృద్ధి చెందితే మిగతా శాసనసభ్యులు ఎందుకు? ఇలాంటివి ఇక్కడ పరిస్థితులు రాష్ట్రంలో కొనసాగుతుంటే…..
కులానికొక ‘బంధు’ కావాలి
హుజూరాబాద్ లో 50 వేల దళిత ఓటర్లు ఉన్న కారణంగా ఆ వోటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వీలుగా గత ఐదేళ్లలో ఏనాడు కూడా పట్టించుకోని దళిత అభివృద్ధి దళిత బంధు పేరుతో కేవలం హుజూరాబాద్ కు మాత్రమే వర్తింప చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామిక విలువలను అపహాస్యం చేయడమే.
దళితుల, వెనుకబడిన తరగతుల అట్టడుగు వర్గాల ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అభివృద్ధికి ఒక ప్రాతిపదిక లేకుండా ఆర్థిక వెనుకబాటు ను ఆసరాగా చేసుకోకుండా కుల నిర్మూలన కు బదులుగా కులాలను మరింత పెంచి పోషిస్తూ ప్రభుత్వాల పార్టీల అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే ప్రవేశపెట్టడాన్ని ఇవాళ బుద్ధిజీవులు మేధావులు ప్రజా సంఘాలు వ్యతిరేకించాలి.
ఇపుడు బీసీ బంధు, రజక బంధు… అన్ని కులాల బంధు తోపాటు ఆదివాసీల బంధు కోసం ప్రజలు డిమాండ్ చేస్తున్నారంటే రాష్ట్రంలో అభివృద్ధి లేనట్లే కదా
ఇలా ఎన్నికలొచ్చినప్పుడే ప్రకటనలు చేస్తూ, వరాలు వెదజల్లుతూ ప్రాజెక్టులను మంజూరు చేస్తూ అభివృద్ధిని కొన్ని ప్రాంతాలకు పరిమితం చేయడం అధికార దుర్వినియోగం కిందికే వస్తుంది.
ప్రజలు అభివృద్ధి చెందడం కాదు ప్రలోభపెట్టి ఓట్లు దండుకోవడం పార్టీలకు ప్రధానంమయింది. ప్రభుత్వానికి అదొక పాలసీ అయిపోయింది.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)