తిరుపతి కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2021 ఆగ‌స్టు 04: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధ‌వారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలను ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నారు.

మొదటిరోజు శ్రీ సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం శాత్తుమొర ఆస్థానం నిర్వహించారు.

సాయంత్రం పవిత్ర ప్రతిష్ట, శయనాధివాసం తదితర కార్యక్రమాలు చేపడతారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వ‌తి, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, ఆగ‌మస‌ల‌హాదారు శ్రీ వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ జ‌య‌కుమార్‌, శ్రీ మునిర‌త్నం పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *