(టి.లక్ష్మీనారాయణ)
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌ.జస్టిస్ ఎం.వి.రమణ గారు చేసిన వ్యాఖ్యలు అన్ని తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో పతాక శీర్షికలతో ప్రముఖంగా ప్రచురించాయి. నిన్ననే (ఆగస్టు 2 సాయంత్రం) రెండు టీ.వి. ఛానల్స్ ఆ అంశంపై చర్చలో పాల్గొనమని విజ్ఞప్తి చేస్తే, ఒక దాన్లో పాల్గొన్నాను. కానీ, ఆ అంశంపై నేరుగా చర్చ జరగలేదు.
సమస్య స్వభావాన్ని పరిశీలిస్తే అంత పెద్దది కాదు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఉల్లంఘన కళ్ళ ముందు కనపడుతున్నది. శ్రీశైలం జలాశయంలో కనీస నీటిమట్టం 834 అడుగులకు దిగువన నీళ్లున్నప్పుడు జలవిద్యుదుత్పత్తికి నీటిని వాడకూడదు. 834 అడుగులకుపైన నీళ్లున్నప్పుడు కూడా దిగువన కృష్ణా డెల్టా మరియు నాగార్జునసాగర్ ఆయకట్టుకు సాగునీరు అవసరాలకు అనుగుణంగా శ్రీశైలం జలాశయంలోని నీటిని జలవిద్యుదుత్పత్తికి వినియోగించుకోవాలన్న నిర్దిష్టమైన మార్గదర్శకాలను 1996 జూన్ 16న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ.నెం.69లో విస్పష్టంగా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కృష్ణా నది యాజమాన్య బోర్డు జలవిద్యుదుత్పత్తిని ఆపేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ రెండు దఫాలు ఉత్తరాలు వ్రాసింది. బోర్డు ఆదేశాలను, శ్రీశైలం జలాశయంలో నీటి వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను, 2015 జూన్ 18 & 19 తేదీలలో జరిగిన రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశానంతరం కుదిరిన ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించింది.
ఈ ఉల్లంఘనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమంత్రికి, కేంద్ర జలశక్తి మంత్రికి పిర్యాదు చేసినా స్పందన కరువైన నేపథ్యంలో సుప్రీం కోర్టులో దావా వేసింది. అదీ సమస్య. ఉల్లంఘన జరిగిందా! లేదా! అన్నది తేల్చడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించడానికి దోహదపడుతుంది. కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుకు పరిధులు నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 14 తర్వాత అమలులోకి వస్తుంది. అటుపై ఈ తరహా ఘటనలు పునరావృతం కావడానికి అవకాశం ఉండదు.
ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందన కాస్త ఆలోచనకు పదును పెట్టింది. “మీకు తెలుసు నేను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కోరుకొంటే సమాఖ్య వ్యవస్థలోని అంశాలను పరిగణనలోకి తీసుకొని వివాదాన్ని పరిష్కరించే అంశాన్ని పరిశీలిస్తా. భారత ప్రభుత్వం, ఇతర వ్యవస్థలు జోక్యం చేసుకోవాలి. న్యాయపరంగానే పరిష్కరించుకోవాలని మీరు భావిస్తే నేను ఈ విచారణ నుంచి తప్పుకొని మరో ధర్మాసనానికి బదిలీ చేస్తా. మధ్యవర్తిత్వానికి మీకు అంగీకారమైతే నేను విచారణ చేపడతా. లేకుంటే తప్పు కొంటా. మీ అభిప్రాయాలను చెప్పండి”. ఈనాడు దినపత్రికలో ప్రచురించిన దాన్ని ప్రామాణికంగా తీసుకొని యధాతథంగా ప్రస్తావించా.
రాష్ట్ర విభజనతో తలెత్తిన సమస్యల నేపథ్యంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తినే సంకట స్థితిలోకి నెట్టిన పరిణామం.
(టి.లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు)