(వైఎస్ షర్మిల)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు లక్ష వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారు. కేవలం 25వేల లోపు లోన్లు ఉన్న లక్షన్నర మందికి మాత్రమే రుణమాఫీ చేసి, చేతులు దులుపుకున్నారు.
39లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. రుణమాఫీ కాకపోవడంతో కొత్తగా లోన్లు కూడా ఇవ్వడం లేదు. దీంతో రైతులు బయట ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటివరకు 15లక్షల మంది పెన్షన్ కావాలని దరఖాస్తు చేసుకుంటే.. అవి ఇవ్వకపోగా 2లక్షల మంది పాత పెన్షనర్లను తొలగించారు.
15లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. వైయస్ఆర్ లాగా పూర్తి రీయింబర్స్మెంట్ ఇప్పుడు ఇవ్వడం లేదు. కేవలం 35వేలు ఇచ్చి సరిపెట్టుకుంటున్నారు. వీటిని కూడా విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 54లక్షల మంది యువత తమకు ఉద్యోగాలు కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు.
ఇంటికొక ఉద్యోగం, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారు.
నేడు దేశంలోనే అత్యధిక నిరుద్యోగ సమస్య ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. ఏడేండ్లలో నాలుగు రెట్లు నిరుద్యోగం పెరిగింది. ఒకప్పుడు 1200 మంది తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటే.. ఉద్యోగాల కోసం నేడు వందల మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు.
YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ నియోజకవర్గం, కోనరావుపేట మండలం, గొల్లపల్లె గ్రామంలో ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న మహేందర్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించి, అదే గ్రామంలో ఒక రోజు “నిరుద్యోగ నిరాహార దీక్ష“ చేపట్టారు.
ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ? నేడు తెలంగాణ మొత్తం కేసీఆర్ గడీల్లో బందీ అయింది. నిరుద్యోగుల ప్రాణాలంటే కేసీఆర్ కు విలువ లేదు. వందల మంది నిరుద్యోగులు చనిపోతున్నా దున్నపోతు మీద వానపడ్డట్టు కేసీఆర్ గారు వ్యవహరిస్తున్నారు.
నిరుద్యోగులకు ఏమైంతే నాకేం నా ఇంట్లో అయిదు ఉద్యోగాలు ఉన్నాయి కదా అని మురిసిపోతున్నాడు కేసీఆర్. కండ్ల ముందే కనిపిస్తున్న లక్షా 90వేల ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు.
ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవి ఆత్మహత్యలా? ప్రభుత్వ హత్యలా? నిరుద్యోగి మహేందర్ ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్న షబ్బీర్ అనే అబ్బాయి ఉద్యోగం రావడం లేదని ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్ల ఇండ్లలో ఎంత దుఖం? ఎంత శోకం?
చేతి కందిన బిడ్డలు శవమై ఇంటికి తిరిగొస్తే తల్లిదండ్రుల బాధలు వర్ణనాతీతం. నేడు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోంది. మేము పార్టీ పెట్టకముందే నిరుద్యోగుల కోసం మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేశాం.
ఇది పెద్ద దొర కేసీఆర్ కు ఇష్టం లేక పోలీసులచే దాడి చేయించి, బట్టలు చింపి, చేయి విరిచి, ఆడవాళ్లు అని చూడకుండా వ్యవహరించారు. అయినా సరే నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలు చేశాం.
చిన్నదొర ఆడవాళ్లు ఉద్యమాలు చేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. మేం వారానికి ఒకసారి నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తుంటే వ్రతాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
దమ్ముంటే లక్షా 91వేల ఉద్యోగాలు భర్తీ చేసి , 54లక్షల మంది నిరుద్యోగులకు ఒక మార్గం చూపించి, వారు ఎంతటి మొనగాళ్లో నిరూపించుకోవాలి. కేసీఆర్ కొడుకు కేటీఆర్ అని పిలిస్తే వాళ్లకి నచ్చడం లేదు. మరి ఏమని పిలవాలో వాళ్లే చెప్పాలి.
అమెరికా నుంచి తీసుకొచ్చి, మొదటిసారి గెలిస్తే రెండు శాఖలకు మంత్రిని చేశారు. ఆయనకు ఏ అర్హత ఉందని రెండు సార్లు మంత్రి పదవులిచ్చారు? కొడుకు అనే కదా ఇచ్చింది? ఉన్నమాటంటే ఉలుకెందుకు?
నేను ఈ రోజే కాదు ఏ రోజైనా వైయస్ఆర్ గారి బిడ్డను అని చెప్పుకోడానికి గర్వపడుతున్నాను. మరి కేసీఆర్ కొడుకు అని మీరు అనిపించుకోడానికి మీకు ఎందుకు నామోషో మీకే తెలియాలి.
పక్కనే ఉన్న సిరిసిల్లకు కేసీఆర్ కొడుకు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంత దగ్గర్లో ఉన్న మహేందర్ యాదవ్ చనిపోతే, “మీరు ఆత్మహత్యలు చేసుకోకండి మీకు ఉద్యోగాలు కల్పిస్తాం” అని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత వీళ్లకు లేదా? ఆ మాట కూడా చెప్పని ఒక నాయకుడు, నాయకుడేనా? నిరంకుశ, దొరల పాలన ఎలా ఉందో ప్రజలు గమనించాలి. చిన్నదొర రిబ్బన్ కటింగ్కు జిల్లాకు వస్తున్నాడంటే రెండు రోజుల ముందే ప్రజా సంఘాల నాయకులను, జర్నలిస్టులను నిర్బంధిస్తారు. అదేమిటని ప్రశ్నిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు. హాస్టల్లో ఉన్న దళిత అమ్మాయిలకు కూడా వారి ప్రాణమానాలకు రక్షణ లేదు.
ఈ అమానుషం చేస్తున్నది కేటీఆర్ గారి బంధువులు అని చెప్తున్నా కూడా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. స్టింగ్ ఆపరేషన్ చేస్తున్న జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారు. పాలకులను దళితులపై ఉన్న ప్రేమ ఇదేనా? నేరేళ్ల ఘటనలో దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. గుట్కా రాష్ట్రమంతటా నిషేదం అయినా పాలకులే దాన్ని తయారు చేస్తున్నారు. పాలకులే అమ్ముతున్నారు. దీనికి పోలీసులు అండగా నిలుస్తున్నారు.
గతేడాది బతుకమ్మ చీరెల డబ్బులు కూడా నేటికీ ఇవ్వలేదు. ఒక మహిళ ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి, ఇక నేను లంచాలు కట్టలేనని చెప్పి పుస్తెల తాడుని ఎమ్మార్వో ఆఫీసుకు కట్టింది. చిన్నదొర, పెద్దదొరకు ఆ మహిళ బాగా బుద్ధి చెప్పింది.
ఏడేండ్లలో ఏడు వేల మంది రైతులు, వేయి మంది నేతన్నలు, వందల సంఖ్యలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్ రాక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంత జరుగుతుంటే కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి ఉండాలా?
ప్రజల గురించి పట్టించుకోని కేసీఆర్ కుటుంబంలో అయిదుగురికి ఉద్యోగాలు ఉండాలా? ప్రజలంతా ఆలోచన చేయాలి. ఇకనైనా ప్రభుత్వం లక్షా 91వేల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కొత్త జిల్లాలు, కొత్త మండలాలకు కావాల్సిన సిబ్బందిని కూడగట్టుకుంటే దాదాపు 3లక్షల 85 ఖాళీలు ఉంటాయని ఒక అంచనా. వీటిపైనా లెక్క తేల్చి, ఆ ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. 54లక్షల మంది నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా శిక్షణ ఇప్పించి ఓ మార్గం చూపించాలని కోరుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లలో దరఖాస్తు పెట్టుకున్న 10లక్షల మందికి లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
ఇంటికో ఉద్యోగం ఇస్తానని, లేదంటే నిరుద్యోగులకు ప్రతి నెలా 3,016 రూపాయలు ఇస్తానని కేసీఆర్ చెప్పిన హామీని నిలబెట్టుకోవాలి. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం నిరుద్యోగం. నిరుద్యోగానికి కారణం కేసీఆర్.. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. లక్షా 91వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేని కేసీఆర్ ను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరుతున్నాం. ఒక దళితున్ని ముఖ్యమంత్రిని చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చిన తెలంగాణ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుంది.
(’ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష‘లో షర్మిల ప్రసంగం ఇది. YSR తెలంగాణ పార్టీ కార్యాలయం అందించిన నోట్)