-ఆంజనేయుని జన్మస్థలం మీద అంజనాద్రి వెబినార్
పురాణాలు, శాసనాలు, భౌగోళిక ఆధారాలన్నీ తిరుమల అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని స్పష్టంగా చెబుతున్నాయి. ఇక ఇందులో ఆలోచించాల్సిందేమీ లేదని పలువురు పీఠాధిపతులు,పండితులు, చారిత్రక పరిశోధకులు తేల్చిచెప్పారు.
టిటిడి శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి అనే అంశంపై నిర్వహించిన రెండురోజుల అంతర్జాతీయ వెబినార్ శనివారం సాయంత్రం ముగిసింది. దేశంలోని నలుమూలలతో పాటు అమెరికా నుంచి పీఠాధిపతులు, మఠాధిపతులు, పురాణ, ఇతిహాస, భౌగోళిక పరిశోధనల్లో నిష్ణాతులు పాల్గొన్నారు.
తిరుమల క్షేత్రంలో అంతర్భాగమైన అంజనాద్రి పర్వతమే ఆంజనేయ స్వామి వారి జన్మస్థలమని, ఆళ్వారుల పాశురాలలోని వైష్ణవ సాహిత్యం ద్వారా తెలుస్తోందని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ చక్రవర్తి రంగనాథన్ తెలిపారు. “వైష్ణవ సాహిత్యంలో తిరుమల-అంజనాద్రి ” అనే అంశంపై మాట్లాడుతూ భగవంతుని అనుగ్రహంతో జన్మించిన ఆళ్వారులు భక్తి ప్రపత్తులను నలుదిశల వ్యాపింప చేశారని చెప్పారు. వారు రచించిన 4 వేల పాశురాలలో 207 పాశురాలు తిరుమల క్షేత్ర వైభవాన్ని, అందులో 12 పాశురాలు విశేషంగా ఆంజనేయస్వామివారి గురించి తెలుపుతున్నాయన్నారు.
పండిత పరిషత్ కార్యదర్శి డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ ” భక్తి కీర్తనలలో అంజనాద్రి ” అనే అంశంపై ప్రసంగించారు. భగవత్ సాక్షాత్కారం కలిగిన శ్రీ తాళ్ళపాక అన్నమయ్య, శ్రీ పురందర దాసులు, శ్రీ వెంగమాంబ లాంటి ప్రముఖ వాగ్గేయకారులు అంజనాద్రి పర్వతం గురించి తమ కీర్తనలలో ప్రస్తావించారన్నారు. శ్రీ రంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో ఉన్న శాసనం ద్వారా శేషాచలమే ఆంజనేయస్వామివారి జన్మస్థలమని తెలుస్తోందన్నారు.
జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం ఆచార్యలు శ్రీ రాణి సదాశివమూర్తి ” పురాణ భూగోళంలో హనుమంతుడు – అంజనాద్రి ” అనే అంశంపై ఉపన్యాసిస్తూ అంజనాద్రి దాస క్షేత్రమని, వేంకటాచల మహాత్యం అనేది వివిధ పురాణాల సంకలనమని చెప్పారు. కృత యుగంలో వృషాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి, కలియుగంలో వెంకటాచలంగా పిలవబడుతోందని చెప్పారు. పద్మ, స్కంద, బ్రహ్మాండ పురాణంలో ఈ విషయం ఉందన్నారు. శ్రీ రామచంద్రమూర్తి ఆయోధ్య నుండి శ్రీలంకకు ప్రయాణించిన మార్గాన్ని వైజ్ఞానికంగా అక్షాంశాలు, రేఖాంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీ అర్చకం రామకృష్ణ దీక్షితులు ” సప్తగిరులలో అంజనాద్రి ప్రాముఖ్యం ” అనే అంశంపై మాట్లాడుతూ శ్రీవారికి నిత్యం జరిగే కైంకర్యాలు, హోమాలు, క్రతువుల్లో చతుర్ణామాలతో అర్చన చేస్తారన్నారు. త్రేతాయుగంలో తిరుమల ఆంజనేయస్వామివారి జన్మస్థలంగా ప్రసిద్ధికెక్కిందన్నారు. ప్రతి గురువారం నిర్వహించే తిరుప్పావడ సేవలో పఠించే శ్రీనివాస గద్యం, ఆలవట్ట కైంకర్యంలో అంజనాద్రి ప్రాముఖ్యతను వివరించారు.
కాలిఫోర్నియా నుండి ప్రముఖ ఐటి నిపుణులు శ్రీ పాలడుగు శ్రీ చరణ్ ” సంస్కృత సాహిత్యంలో హనుమంతుడు – (ఋగ్వేదం నుండి స్తోత్రముల వరకు ) ” అనే అంశంపై వర్చువల్‌గా ప్రసంగించారు. ఋగ్వేదం నుండి వర్తమాన సాహిత్యం వరకు అన్ని పదాల్లో తిరుమల అంజనాద్రి అని నిరూపించబడిందన్నారు. దానికి సాహిత్య ఆధారాలు ఉన్నట్లు వివరించారు.
మధ్య ప్రదేశ్ చిత్రకూట్ లోని రామభద్రాచార్య ప్రత్యేక ప్రతిభావంతుల విశ్వవిద్యాలయం కులపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు రామభద్రాచార్య అనుగ్రహ భాషణం చేశారు. గోవింద రాజీయంలో తిరుమల అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని స్పష్టంగా ఉందన్నారు. ఈ విషయంలో రెండో ఆలోచనే అవసరం లేదన్నారు.
తిరువనంతపురం లోని ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. ఉన్ని కృష్ణన్ మాట్లాడుతూ, తిరుమలలో అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయునికి జన్మ ఇచ్చినందువల్లే ఆ కొండకు అంజనాద్రి అని పేరొచ్చిందని చెప్పారు. ఇందుకు తగిన పురాణ ఆధారాలను ఆయన వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి శ్రీ వనం జ్వాలా నరసింహారావు, ముంబైకి చెందిన ప్రసిద్ధ కవి, ఆధ్యాత్మిక వేత్త శ్రీ సాంపతి సురేంద్ర నాథ్ మాట్లాడారు.
కర్నాటక రాష్ట్రం సోసలే లోని వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యా శ్రీశతీర్థ మహాస్వామి అనుగ్రహ భాషణం చేశారు.
టీటీడీ అదనపు ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి, జాతీయ సంసృత విశ్వవిద్యాలయం ఉప కులపతి, టిటిడి పండిత పరిషత్ అధ్యక్షులు ఆచార్య వి.మురళీధర్ శర్మ, మాడభూషి శ్రీధర్, శ్రీ జాదవ్ విజయ కుమార్ తో పాటు పలువురు పండితులు, ఆచార్యులు వెబినార్‌లో పాల్గొన్నారు.