‘తెలంగాణ తిరగబడమంటుంది’

(అభిప్రాయం)

(గద్దల మహేందర్)

వీరుల అమరత్వం యాది చేసుకుని త్యాగాల చరిత్రను నెమరు వేసి వేలాది గొంతులు ఒక్కటై దండు కట్టి నినదించాల్సిన తరుణం ఆసన్నమైంది. మళ్లీ పల్లెలు ఉద్యమానికి ఊపిరి పోయాల్సిన అవసరమనే ఒక విస్తృతమైన చర్చ మొదలైన సందర్భంలో తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన సమయమిది.

వీరుల త్యాగాల నెత్తుటి పునాదిపై ఏర్పడిన తెలంగాణ, వేలాది అమరులు కలలు కన్న ఆశయాలు, ఆకాంక్షలు ఎక్కడి వరకు నెరవేరినాయో ప్రశ్నిస్తూ సబ్బండ ప్రజానీకాన్ని ఏకం చేయాల్సిన అవసరాన్ని ఉద్యమ నాయకత్వం గుర్తించాలి. నాటి ఉద్యమంలో ఒక్కటై పోరాడిన ఉద్యమ నాయకులు, అనేక పార్టీలు, ప్రజా సంఘాలు, విప్లవ సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, మేధావులు తమ ఆలోచనలకు మరోసారి పదును పెట్టాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పే సందర్భం వచ్చింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కి పోయింది. అధికార పార్టీలో కొంత ఆందోళన పుట్టిందనే భావన వ్యక్తమవుతున్నా సందర్భం కనిపిస్తోంది.

తెలంగాణలో అధికార మార్పిడి జరిగింది తప్ప ! ప్రజా ప్రయోజనాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, జీవన ప్రమాణాలను పెంపొందించే నిర్ణయాలు చేయలేదు. ఈ ఏడు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏడుపే మిగిలింది. ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు ఏవి అమలుకు నోచుకోలేదు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలకు చేస్తున్న పనులకు అసలు పొంతన లేదు. ప్రజల ఐక్యమత్యంను చీల్చడానికి, ప్రగతి భవన్ లో పావులు కలిపి అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేపట్టింది.

కొత్త జిల్లాలతో ప్రజల బ్రతుకులేమైన మారినాయా? కులానికో పథకం ప్రవేశపెట్టి, తన చుట్టూ తిరిగేలా చేసిందే తప్ప నిజంగా ప్రజల బాగోగులకు అవసరమైన ప్రణాళికలు చేయలేదు. మనిషి మనుగడకు అవసరమైన విద్య, వైద్యం ఉపాధి లాంటి వాటిని పూర్తిగా పక్కకు నెట్టిన కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలను ప్రభుత్వం వొదిలించే సంక్షేమ పథకాల మీద ఆధారపడేటట్లు చేసింది. సమన్వయంగా సమానత్వంతో ముందుకు సాగేలా చూడలేదు. వ్యక్తిస్వామ్య విధానం పెరిగిపోయింది. దీంతో ఏకపక్ష నిర్ణయాలు అమలుపరచడం జరుగుతుంది.

బడ్జెట్ కేటాయింపులు భారీగా ఉన్నప్పటికీ, అది ఉన్నత వర్గాల ప్రయోజనాల కోసమే వాడినారు. రాష్ట్ర జనాభాలో ఎవరి వాటా వారికి దక్కేలా చర్యలు లేవు. ముఖ్యంగా రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా దళితులపై దాడులు అవమానాలు పెరిగాయి. ఆదివాసీలు, లంబాడాల, గుత్తికోయల హక్కులు హరించబడ్డాయి.

అటవీ హక్కుల చట్టం అమలు చేసే పరిస్థితి లేదు. బి.సి సబ్ ప్లాన్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఊసేలేదు. నియామకాల జాడలేదు. రాజకీయ రిజర్వేషన్లు ప్రతిపాదన అమలు కావడం లేదు. విద్యార్థులు చదువుకోవడానికి స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ లేదు. యువతకు ఉపాధి చూపించే మార్గము కనిపించడం లేదు. మహిళలకు భద్రత కరువైంది.

కార్మిక, కర్షక బతుకులు అగమ్యగోచరమయ్యాయి. గ్రామాల్లో ఉపాధి కరువై బ్రతుకుదెరువు కోసం ప్రజలు పల్లెలు విడిచి పట్నం చేరుకోగా పల్లెల్లో దారిద్రం పెరిగిపోతుంది.

హరితహారం పేరుతో దళిత బహుజన భూములను లాక్కోవడం జరుగుతుంది. దళితులకు మూడు ఎకరాల భూమి హామీగానే గాలికొదిలిన కెసిఆర్ ఇప్పుడు ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టాడు. ప్రాజెక్టుల రీ డిజైన్ వల్ల భూస్వాములకు రైతుబంధు లాంటి పథకాలు ఇవ్వడం వలన వేలాది భూములు ఉన్న వారికి ప్రయోజనం ఎక్కువగా జరుగుతుంది.కాబట్టి ప్రజాధనం వృధా చేయడం జరిగింది. ఈ విచ్చలవిడి ఖర్చులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయినందువల్లనే మిగులు తెలంగాణ అప్పుల తెలంగాణగా మారిపోయింది.

అభివృద్ధి అందని ద్రాక్షగా మారి ఏ మూలన కనిపించడం లేదు. ప్రభుత్వ విద్యా రంగం పూర్తిస్థాయిలో విస్మరించబడింది. ప్రైవేట్, కార్పొరేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతులివ్వడంతో ఎంతో చరిత్ర కలిగిన సాంప్రదాయ యూనివర్సిటీలు మూతపడే ప్రమాదముంది.

బడ్జెట్ కేటాయింపుల్లో విద్యకు, యూనివర్సిటీలకు సరిగ్గా కేటాయించకుండా ఉద్దేశపూర్వకంగానే విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానం పోలేదు. విద్య, వైద్య లాంటి మౌలిక రంగాల నుండి ప్రభుత్వం క్రమేనా తప్పుకుంటుంది. ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించలేని వ్యవస్థ కొనసాగుతుంది. ప్రజల స్థితి అట్టడుగు స్థాయికి దిగజారిపోయింది. ఎరువుల ధరలు, విత్తనాల ధరలు పెరిగి గిట్టుబాటు ధరలు లేక రైతుల కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రుణమాఫీ అమలు చేయడం లేదు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే ఎంత గొప్ప అభివృద్ధిని చూస్తామనుకున్నా ప్రజలకు పూర్తి విరుద్ధంగా తెలంగాణలో పాలన కొనసాగుతుంది. ఇలా అనేక సమస్యలు నిత్యం మన ముందుకనిపిస్తూనే ఉన్నాయి.
ఆనాటి ఉద్యమ వీరుల బలిదానాలు, చావు కేకలు నిశ్శబ్ద విప్లవాలు మళ్లీ ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రజలారా మేల్కోండి అంటూ నినదిస్తున్నాయి.

బానిస బ్రతుకుల నుండి తుపాకీ పట్టించిన నేల అక్షరాలు నేర్పించి అడవి బాట పట్టిన యువత. భూస్వామ్య విధానాలకు, బానిస సంకెళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ గడ్డ అనేక విప్లవ, పోరాటాలకు చిరునామాగా నిలిచిన తెలంగాణ ప్రపంచ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగిన, ఖ్యాతిని మూటగట్టుకుంది. ఇంత చరిత్ర కలిగిన తెలంగాణ నేల ఇప్పుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉందని ఆలోచించాలి.

ఆనాటి వీరుల గాధలను తెలుసుకొని మళ్లీ ఒకసారి చరిత్రను పరిశీలించి రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరుగుతున్న పరిణామాలను గమనించి, ముందుకు సాగాల్సిన ప్రాధాన్యత క్రమాన్ని అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో కొంత నూతన ఉద్యమాలకు పురుడు పోసుకున్న సందర్భం కనిపిస్తుంది.

పోరాట వారసత్వాన్ని పుణికి పుచ్చుకోవాలి. నియంతృత్వ రాజ్య పాలన పై నిప్పు రవ్వల వలె సమరం చేయాలి. ప్రతి మనిషి ఒక ప్రభంజనమై కదాలలి. తిరుగుబాటుకు సిద్ధం కావాలి.

(గద్దల మహేందర్, జనగామ , సెల్ 9963226580)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *