ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కులాలకు, కులాల నేతల సంక్షేమానికి చాలా ప్రాముఖ్యం ఇస్తున్నారు. కులకులానికి ఆయన కార్పొరేషన్లు ఏర్పాటుచేశారు. ఇపుడు కులకులానికి చెందిన వైసిపి నేతలకుఆయన నామినేటెడ్ పదవులిచ్చారు. నిజానికి ఇపుడు ఆంధ్రలో కులాల స్వర్ణయుగం మొదలుయిందని రెండు మూడు రోజులుగా వైసిపి మంత్రులు,ఎమ్మెల్యేలు,నేతలుచెబుతూ వస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, పేదలకు జగన్ మోహన్ రెడ్డిగారి పరిపాలన ఒక సువర్ణయుగం అని రాష్ట్ర మంత్రులు ధర్మాన కృష్ణదాస్, కె. నారాయణ స్వామి, మాలగుండ్ల శంకర నారాయణ, సీదిరి అప్పలరాజు ప్రశంసించారు.
చిన్నదో పెద్దదో ఒక పదవితో తమకులానికి గుర్తింపు వచ్చిందని కుల సంఘాలనేతలతు,పదవులు పొందిన వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా కేటాయించిన కార్పొరేషన్ ఛైర్మెన్ పదవులలో సమాజంలో అణగదొక్కబడిన మహిళలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక ప్రాధాన్యతనిచ్చారని, తాను మహిళా పక్షపాతినని మరోసారి నిరూపించుకున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి కితాబిచ్చారు.
137 నామినేటెడ్ పదవులలో 69 పదవులను మహిళలకే ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డిది అరుదైన రికార్డు అని, మహిళా పక్షపాతిగా సీఎం జగన్ దేశానికే ఆదర్శమని ఆమె అభిప్రాయపడ్డారు.
అయితే, టిడిపి నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు దీనికి మరొక భాష్యం చెప్పారు.
పరిపాలించే స్థానాల్లో సొంత వారు.. పరిపాలించబడే స్థానాల్లో బడుగులా? అని ఆయన ప్రశ్నించారు. “అధికారాలు, నిధులు ఉన్న పదవులన్నింటినీ జగన్ రెడ్డి బంధువర్గానికి పంచి.. నిధులు లేని, అప్రధాన్య పోస్టుల్ని బడుగు వర్గాలకు కట్టబెట్టారు. బలహీన వర్గాలంటే ప్రభుత్వానికి ఎంత చులకన భావం ఉందో ఈ కేటాయింపుల్లో చూపిన వ్యత్యాసంతో తేలిపోయింది” అని వ్యాఖ్యానించారు.
మొత్తానికి ఇది కులాల సాధికారీకరణ (social empowerment) అని వైసిపి నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కులానికి ఎంత వాటా అధికారం దక్కిందనే దాన్నిచాలా మంది లెక్క కట్టారు. ఇవి కులాల వారీగా నామినేటెడ్ వివరాలు:
రెడ్డి: 25
కాపు: 15
మాల: 15
ముస్లిం: 12
మాదిగ: 10
యాదవ: 10
బలిజ: 7
కమ్మ: 6
క్షత్రియ: 5
వైశ్య: 4
రెడ్డిక: 3
బోయ: 3
గౌడు: 3
గవర: 2
మత్స్య: 2
వెలమ: 2
బ్రాహ్మణ: 1
తెలగ: 1
దాసరి: 1
తొగట: 1
కురుబ: 1
కళింగ: 1
దేవాంగ: 1
చేనేత: 1
రాజులు: 1
మంగళ: 1
నాగవంశీ: 1
——-
మొత్తం = 135
———
సంతోషం. కానీ రాష్ట్రంలో వడ్డెర జాతికి + ST +రజక లకు ఒక్కటి కూడా ఇవ్వలేదు ఈ కులాల నేతల విచారం వ్యక్తం చేశారు. వందలు,వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న కార్పొరేషన్లను రెడ్లకు అప్పగించారని, సాహిత్యం, సంగీతం వంటి అకాడమీలకు బీసీలకు ఇచ్చారనే విమర్శ కూడా ఉంది.
ఇది ఒక ‘క్విక్ ఎనాలిస్’ మాత్రమే. మరిన్ని వివరాలు పాఠకులు కామెంట్స్ సెక్షన్ లో జోడించవచ్చు.