కరోనా మహమ్మారి కారణంగా సుమారుగా ఒక సంవత్సరం నుండి సినిమా దియేటర్లు పూర్తిగా మూసి ఉన్నాయని, సినిమా ఎగ్జిబిటర్స్, సినిమా దియేటర్ల నిర్వహకులు ఆర్ధికంగా ఎంతో నష్టపోయారని వారిని ఆదుకోవాలని వారు ఈ రోజు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు విజ్ఞప్తి చేశారు.
శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో తెలంగాణా స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసి పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు
ప్రభుత్వం ఈ కష్టకాలంలో అండగా నిలిచి ఆదుకోవాలని కోరారు. ప్రధానంగా సినిమా దియేటర్లు మూసి ఉంచిన సమయానికి ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని వారు కోరారు.
సింగిల్ స్క్రీన్ ధియేటర్ లలో వాహనాల పార్కింగ్ చార్జి వసూలు చేసే వెసులుబాటు కల్పించాలని, SGST ట్యాక్స్ ను రద్దు చేయాలని, GO 75 ను పునరుద్దరించాలని కూడా కోరారు.
షూటింగ్ ల ఈనుమతులకు వసూలు చేసే చార్జీలను తగ్గించాలని తదితర డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అందజేశారు.
మంత్రిని కలిసిన వారిలో సునీల్ నారంగ్, అనుపమ్ రెడ్డి, అభిషేక్ నామా, సదానంద్ గౌడ్, బాల గోవింద్ రాజ్ తాడ్ల తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో TSFDC ED కిషోర్ బాబు ఉన్నారు.