వరంగల్ సందర్శించిన శ్రావణబెళగొళ పీఠాధిపతి

ప్రసిద్ధ శ్రావణ బెళగొళ గోమటేశ్వర జైన పీఠాధిపతి శ్రీ జగద్గురు కర్మయోగి చారుకీర్తి భట్టారక స్వామిజీ  వరంగల్ సందర్శించారు. నగరంలో ఆగ్గలయ్య గుట్టను సందర్శించారు.అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రశంసించారు.

చారుకీర్తి స్వామీజీ 1969 డిసెంబర్ 12న సన్యాసం స్వీకరించారు.1970 ఏప్రిల్ 19న  శ్రావణ బెళగొళ ధర్మాచార్యపీఠ అధిష్టించారు. సంస్కృతం, ప్రాకృతం, కన్నడ భాషల్లో ఆయన గొప్ప పండితుడు.పీఠం తరఫున ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు బాగా చేరువ అయ్యారు. ఆయన ఆధ్వర్యంలో 1970 నుంచి 1981,1993, 2006, 2018లలో మహామస్తకాభిషేకం ఘనంగా నిర్వహించారు. 1981లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆయనకు కర్మయోగి అనే బిరుదు ప్రసాదించారు. దేశంలో తొలి ప్రాకృత యూనివర్శిటీ ని ఆయన శ్రావణ బెళగొళ స్థాపిస్తున్నారు. దీనికోసం కర్నాటక ప్రభుత్వం 32 ఏకరాలభూమిని అందించింది. రు. 20 కోట్ల ధనసాయం కూడాచేసింది.

ఇలాంటి స్వామీజీ  వరంగల్ ను సందర్శించారు.

వరంగల్ కూడా పూర్వం ఒక గొప్ప జైన కేంద్రం.  వరంగల్ అనగానే మనకు కాకతీయులు గుర్తుకువస్తారు . కానీ వరంగల్ నగరానికి అంతకన్నా గొప్ప జైన చారిత్రక నేపథ్యం ఉంది.

ఓరుగల్లును రాజధానిగా చేసుకుని సుమారు మూడు శతాబ్దాల పాటు పరిపాలించిన కాకతీయులు తొలుత హనుమకొండ రాజధానిగా 30 సంవత్సరాల పాటు పాలించారని అనంతర కాలంలో ఓరుగల్లు నగరానికి రాజ్ధానిని మార్చారు. తొలితరం కాకతీయులు జైన మతాన్ని అవలంబించారు

ఆ కాలంలో అనేక జైన బసదుల నిర్మాణాలు చేశారు. ఆ ఆనవాళ్లు నేటికి పదిలంగా ఉన్నాయి.  జైన గురువు అగ్గలయ్యకు జైనుల్లో గొప్ప వైద్యుడిగా పేరుంది. పద్మాక్షిగుట్ట, అగ్గలయ్య గుట్టలు రెండు ఒక నాడు జైనకేంద్రాలే.

ఇన్ని రోజులు ఆగ్గలయ్య గుట్ట పైకి వెళ్ళేందుకు సరైన మార్గం లేకపోవడంతో మరుగున పడింది. గతేడాది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ‘హృదయ్‌’ పథకంలో చేర్చడంతో అభివృద్ధి జరిగింది. వీటి అభివృద్ధి పనులకు గాను 1.3 కోట్లు కేటాయించారు.

గుట్టపైకి వెళ్లేందుకు సుమారు 300 రాతి మెట్లను కొండకే తొలిచారు. కేవలం ఆరునెలల వ్యవధిలో మెట్ల నిర్మాణం పూర్తయింది. పర్యాటకులు, భక్తులు విగ్రహాలను దర్శించుకునే వీలు కలిగింది. గుట్ట అభివృద్ధికి, అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దడం జరిగింది. గుట్టపై ప్రవేశ ప్లాజా (ఎంట్రన్స్ ప్లాజా), మెట్లు, రెయిలింగ్, గుట్టపై ఉన్న జైన్ తీర్థంకరుడు ఉన్న ప్రాంతంలో ప్లాట్‌ఫాం, గుట్ట చివరి భాగంలో వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. ఈ గుట్టపైకి చేరుకునేందుకు మెట్లను తొలిచి మార్గాన్ని ఏర్పాటు చేశారు.

రాతితో స్వాగత తోరణాలు నిర్మించి ఎంతో అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్తు దీపాలు, నీటి ఫౌంటేన్లు, ఏర్పాటు చేయడం జరిగింది . వీటికి అదనంగా 200 వరకు రాతి స్తంభాలను మెట్ల దారికి ఇరువైపులా రెయిలింగ్‌లా ఏర్పాటు చేస్తున్నారు. కొండపై జైన తీర్థంకరుడి విగ్రహం ముందు విద్యుత్తు దీపాలు, ఉద్యానవనం ఏర్పాటు చేశారు.
అగ్గలయ్య గుట్ట అభివృద్ధి కార్యక్రమాల ద్వారా
వేయిస్తంభాల ఆలయం, వరంగల్‌ కోట లాంటి పర్యాటక ప్రదేశాల
సరసన అగ్గలయ్య గుట్ట కూడా చేరిందని చారుకీర్తి భట్టారక స్వామిజీ అన్నారు.

జైన క్షేత్ర పరిసరాలు అభివృద్ధి అయ్యేలా చొరవ చూపి సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేసిన ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ కు స్వామీజీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి ప్లానింగ్ ఆఫీసర్ అజిత్ రెడ్డి , భీంరావ్ , ఆర్డీవో వాసుచంద్ర , తహసీల్దార్ రాజ్ కుమార్ , జైన ప్రతినిధులు అనిల్ జైన్ , ప్రకాష్ జైన్ , కిషోర్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *