తెలంగాణ పరిశ్రమల, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు వ్యూహాలను ఇతర దక్షిణాది రాష్ట్రాలు అర్థం చేసుకోలేకపోతున్నాయి. ఇన్వెస్టర్లు ఆకట్టుకోవడంలో కెటిఆర్ వ్యూహాలు ఈ రాష్ట్రాలకు అంతుబట్టడం లేదు. చాలామంది పరిశీలకులు విశ్లేషకులు కెటిఆర్ శైలిని ప్రశంసిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఎటువైపు వెళ్తున్నారో రాడార్ తో నిఘా వేసి ఎక్కడైనా ఒక ఇన్వెస్టర్ నీడ కనిపించగానే, కెటిఆర్ ఎగరేసుకుపోవడం బాగా చర్చనీయాంశమయింది.
ముఖ్యంగా కేరళకు చెందిన రెడీ మెడ్ వస్త్రాల సంస్థ (Kitex) ను తెలంగాణ వైపు మళ్లించడంలో కెటిఆర్ కనబర్చిన చాణక్యం దేశంలోని ఇతర రాష్ట్రాలన్నింటిని కంగు తినిపించింది. ఇపుడు కొత్త కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అబ్రకదబ్ర చేసి కైటెక్స్ ని కర్నాటక వైపు చూడమంటున్నారు.
కెటిఆర్ వేసిన ఎత్తు మీద జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. కొందరయితే ఈఇన్వెస్ట్ మెంట్లు చాణక్యంలో కెటిఆర్ ను ఒక నాటి కర్నాటక ముఖ్యమంత్రి ఎస్ ఎమ్ కృష్ణతో పోలుస్తున్నారు.
ఇక కేరళ ప్రభుత్వం సతాయింపులు భరించలేమ్ బాబోయ్ అంటూ కైటెక్స్ ప్రకటించి కొచ్చిలో ఏర్పాటు చేయాలనుకున్న రు. 3500 కోట్ల ఎపరేల్ పార్క్ ప్రాజక్ట్ ను క్యాన్సిల్ చేసుకుంది.
కైటెక్స్ కేరళలో ఉన్న అతి పెద్ద పారిశ్రామిక సంస్థ. ఇందులో సుమారు 15 వేల మంది ఉద్యోగులున్నారు. అయితే, కేరళ ప్రభుత్వానికి ఈ కంపెనీకి ఎక్కడో బెడిసింది. రకరకాల ప్రభుత్వ శాఖలు ఈ కంపెనీ మీద దాడులుచేసి అక్రమాల కోసం వెదకడం మొదలుపెట్టారని కంపెనీ ఆరోపిస్తున్నది.దీనితో విసుగెత్తిన ఈ కంపెనీ కేరళకు గుడ్ బై చెప్పేసింది. కేరళలో ఒక్క పైసాకూడా ఇన్వెస్టు చేసేది లేదు పొమ్మంది.
కైెటెక్స్ చేసిన ప్రకటనలో ఇతర దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక సువర్ణావకాశాన్ని చూశాయి. కైటెక్స్ ను తమ రాష్ట్రానికి ఆహ్వనించాలని కర్నాటక, తమిళనాడు భావించాయి. ఈ రెండు రాష్ట్రాలకు కేరళలో సరిహద్దు అనుబంధాలున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ కూడా కైటెక్స్ పెట్టుబడులు తెలంగాణ కు వస్తే బాగుంటుందని ఆశపడింది. మూడు రాష్ట్రాలు ఆశపడటం లో తప్పులేదు. అయితే, మూడు రాష్ట్రాలు స్పందించిన తీరులో చాలా తేడా ఉంది. అక్కడే కుర్రవాడయిన కెటిఆర్ తన చాణక్యం ప్రదర్శించారు.
కర్నాటక కైటెక్సె కు ఆహ్వానం పంపడం గురించి యోచిస్తూనే ఉంది. తమిళనాడు ‘త్రూ ది ప్రాపర్ చానెల్ ’ లో ఉత్తరాలు రాసి ఆహ్వానించింది.
తెలంగాణ ప్రభుత్వం ఏకంగా ప్రత్యేక విమానం పంపించి కంపెనీ సిఎండి సాబు జేకాబ్ ను హైదరాబాద్ రప్పించింది. రెడ్ కార్పెట్ ఆహ్వానం పలికింది. ఈ మర్యాదలతో జేకాబ్ ముగ్ధుడయ్యాడు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టుందుకు సమ్మతించాడు. వరంగల్ లో ఆయన మొదటి దశలో వేయి కోట్ల రుపాయలు పెట్టుబడి పెడతాని ప్రకటించారు. ఈ ప్రకటన దేశమంతా ప్రకంపనలు సృష్టించింది. తామెందుకు వెనబడిపోయామో అన్ని రాష్ట్రాలు ఒక సారి సమీక్షించుకునేలా చేసింది.
ఇది మొదటి సారి కాదు, చాలా సార్లు ఇలా జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఎత్తుగడలకు కర్నాటక బాగా నష్టపోతున్నదని, కర్నాటక ప్రభుత్వాలకు కెటిఆర్ కున్నటువంటి చొరవ , ముందు చూపులేదనే విమర్శలు అక్కడ వినబడుతున్నాయి.
నాలుగేళ్లకిందట ఒక మొబైల్ కంపెనీ కర్నాటకలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపింది. ప్రభుత్వాన్ని సంప్రదించింది. బెంగుళూరు శివార్లలో కొంత భూమి కావాలని కోరింది. దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేసి మంత్రులు, అధికారులు విసుగెత్తించారు. ఇక లాభం లేదనుకుని ఈ కంపెనీ చెన్నై వెళ్లాలనుకుంది. అలాంటపుడు వాళ్లకి హైదరాబాద్ నుంచి కాల్ వచ్చింది. ఆహ్వానం అందుకున్నారు. హైదరాబాద్ లో వాలిపోయారు. ఆ సెల్ ఫోన్ కంపెనీ నిర్మాణం పూర్తయింది. ఉత్పత్తి ప్రారంభించింది. ఇలా కర్నాటక చాలా సార్లు ఇన్వెస్టు మెంట్లు కోల్పోయింది.
కర్నాటకలో ఎపుడో ఎస్ ఎం కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇన్వెస్టర్లను ఇలా మచ్చిక చేసుకునేవాడని చెబుతారు. ఆయన పోయాక ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకుఏ ప్రభుత్వానికి చొరవ లేకుండాపోయిందనే విమర్శ వస్తున్నది. ’స్టార్ఆఫ్ మైసూర్‘ (Star of Mysore)లో విక్రమ్ ముత్తన్న అనే కామెంటేటర్ ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణని కెటిఆర్ ను పోలుస్లూ ఒక విశ్లేషణ చేశారు.
2016లో మైసూరులో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ ఒక అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇది చాలా అల్పవిషయంగా పైకి కనబడుతుంది. అయితే, ఇలాంటి చాలా అల్ప విషయాలకు కూడా అనంత శక్తి ఉంటుందని కృష్ణ గ్రహించిన విషయం ఇందులో కనిపిస్తుంది.
ఒక సారి ముఖ్యమంత్రి కృష్ణ విప్రో అధినేత అజీం ప్రేమ్ జీ కి ఫోన్ చేసి ఒక ముఖ్యమయిన విషయం మాట్లాడేందుకు ఒక సాయంకాలం విధాన సౌధకు ఆహ్వానించారు.
అపుడు ప్రేమ్‌జీ మాట్లాడుతూ “ మా ఆఫీసు నుంచి సార్జాపూర్ రోడ్ మీదుగా మీ మీ విధాన సౌధకు రావాలంటే గంటా నలభై అయిదు నిమిషాలు పడుతుంది. రోడ్డు మీద ట్రాఫిక్ లో ఇరక్కు పోయి అంతా సేపు సమయం వృథా చేయలేను. కాబటి ఆ సాయంకాలం రాలేను. రేపు పొద్దున నేను ఆఫీసుకు పోయేటపుడు మీ విధాన సౌధ మీదుగా వచ్చి కలుస్తాను లేండి.’ అన్నారు
ఇదే ఇంకొక ముఖ్యమంత్రి అయితే, చిర్రుబుర్రు లాడే వాడేమో. అయితే, ప్రేమ్ జీ మాటల్లోని సమస్యను అర్థం చేసుకున్నారు. వెంటనే అధికార్లను పిలిచి విప్రో అధినేత చెప్పింది నిజమేనా అని వాకబు చేశాడు. ఇదే నిజమయతే, నెలరోజుల్లో ఈ సమస్య పరిష్కారం కావాల్సిందే, రాజీ లేదని చెప్పేశాడు.
ముఖ్యమంత్రి ఫోన్‌చేసి పిలిచినా అజీమ్ ప్రేమ్ జీ రానన్నందుకు కృష్ణకు బాధకల్గలేదు. బాధపడ్తే పనికిమాలిన ఇగో సమస్య ఉన్న రాజకీయనాయకుడిని అయిపోతాడు. అందుకే ఆయన ఇగో గొడవలోకి వెళ్లకుండా సమస్య ఏమిటో చూసి దానిని పరిష్కరించేందుకు పూనుకున్నాడు.
ఆహంబావపు పవర్ సెంటర్ గా ఉండటం కాదు, కావలసింది, పని చేయించగలిగే ఫెసిలిటేటర్ మారాలనుకున్నాడు.
ఆయన ఒక సారి ఇన్వెస్టర్లు గురించి చెప్పిన మాటలో ఈ ఫిలాసఫీ వ్యక్తమయింది. ‘ఇన్వెస్టర్లను వ్యాపారస్థులుగా చూడవద్దు. భాగస్వాములాగా చూడాలి,’ (We do not look at investors as businessmen. We consider them as our partners-partners in development and technological upliftment) అని ఆయన అన్నారు.
దాని వల్లేనేమో ఆ రోజుల్లో ఆయన రెండు సార్లు జాతీయ స్థాయి ఎంపికలో ‘ఉత్తమ ముఖ్యమంత్రి’ (Best Chief Minister)గా అగ్రభాగాన నిలబడ్డారు. అపుడు నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు 8 వ స్థానం లభించింది. ఇండియా టుడే, ఆర్గ, మార్గ్ లు ఈ సర్వేని మూడ్ ఆఫ్ ది నేషన్ (Mood Of the Nation) పేరుతో ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ప్రతిష్ట ఎలా ఉందనే విషయం కనుగొనేందుకు చేశాయి.
కృష్ణ సక్సెస్ పాత కొత్తల మేలుకలయిక. ఆ వయసులో కూడా సాంప్రదాయిక రాజకీయనాయకుడిగా కుంచించుకు పోకుండా ఆధునికతను ఆయన రెండుచేతులు చాచి ఆహ్వానించారు. ఫలితంగా నాటి బెంగళూరుకు దేశ విదేశ పెట్టుబడుల వరదల ప్రవహించాయి. ఎస్ ఎం కృష్ణ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.
ఇపుడు తెలంగాణ ఐటి మంత్రి కెటి రామారావు దాదాపు అదే దార్శనికతను ప్రదరిస్తున్నారు.అందుకే, దక్షిణాది కి రావాలనుకుంటున్న పెట్టుబడులను కెటిఆర్ కన్నుగప్పి ఇతర రాష్ట్రాలు మళ్చించుకుపోవడం సాధ్యం కాదేమో!