ఫాదర్ స్టాన్ స్వామిని హత్య చేసిందెవరు?

*ఫాదర్ స్టాన్ స్వామిది వ్యవస్థ చేసిన హత్యే*

*భీమా కోరేగాం16 కుటుంబ సభ్యుల, మిత్రుల ప్రకటన*..

భీమా కోరేగాం కుట్రకేసు నిందితుల కుటుంబ సభ్యులమూ, మిత్రులమూ అయిన మేము ఫాదర్ స్టాన్ స్వామి మరణం పట్ల తీవ్రమైన వేదననూ, దిగ్భ్రాంతినీ వ్యక్తం చేస్తున్నాము.

ఇది ఒక సహజ మరణం కాదు, ఒక మృదు స్వభావిని వ్యవస్థ చేసిన హత్య, ఈ హత్యకు పాల్పడింది అమానుష రాజ్యం.

జార్ఖండ్ లోని ఆదివాసుల మధ్యనే తన జీవితమంతా గడిపి, వనరుల మీద, భూమి మీద ఆదివాసుల హక్కు కోసం పోరాడిన ఫాదర్ స్టాన్ స్వామి మరణం తానెంతో ప్రేమించిన జార్ఖండ్ నుంచి సుదూరంగా, కక్షపూరిత రాజ్యం చేతిలో అబద్ధమైన కేసులో ఇరికించబడి, జైలుపాలై ఇలా జరిగి ఉండవలసింది కాదు.

భీమా కోరేగాం కేసులో తప్పుడుగా ఇరికించబడి, అరెస్టయి, జైలు పాలయిన పదహారు మందిలో ఫాదర్ స్టాన్ స్వామి చివరివారు. ఎనబై నాలుగు సంవత్సరాల వయసులో, పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ ఉండిన ఫాదర్ స్టాన్ ఈ కేసులో అరెస్టయిన వారందరిలోనూ వయసులో పెద్దవారు, అందరికంటె బలహీనమైనవారు.

అటువంటి ఆరోగ్యంతో కూడ, ఆయన తన స్వాభావిక శక్తితో, అకుంఠితమైన నిజాయితీతో ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలిచారు. జైలులో ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణిస్తుండినప్పటికీ, ఆయన ఎల్లప్పుడూ తన తోటి ఖైదీల గురించే ఆలోచించారు, వారి కోసం ప్రార్థనలు చేశారు.

ఆయన జైలు నుంచి రాసిన ఉత్తరాలలో, వేరువేరు అబద్ధపు కేసులలో ఇరికించబడి జైలులో మగ్గిపోతున్న సహఖైదీల గురించి రాశారు. సమాజంలో కొనసాగుతున్న అన్యాయాల గురించి ఆవేదన చెందారు.

ఆయన మృదుస్వభావాన్నీ, ఆయన మానవీయ దృక్పథాన్నీ, ఆయన కరుణనూ గుర్తు చేసుకుంటూనే, మేం ఆయన నిర్బంధం అనే అంతులేని అన్యాయాన్ని మరచిపోలేము. ఆ వయసులో, అటువంటి అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని, అందులోనూ చుట్టూరా కరోనా మహావిపత్తు సాగుతుండగా జైలులో ఉంచడమే మొట్టమొదటి దుర్మార్గమైన చర్య.

ఆయనను 2020 అక్టోబర్ 8న అరెస్టు చేసేనాటికే ఆయన గురించి దర్యాప్తు అంతా పూర్తయిపోయింది. ఆయన న్యాయవిచారణ నుంచి తప్పించుకు పారిపోతారనే అనుమానమేమీ లేదు. అయినా ఆయనను అరెస్టు చేయడం, నవీ ముంబాయిలోని తలోజా జైలులో నిర్బంధించడం అంటే ఆయనకు మరణశిక్ష విధించడమే.

తనను అరెస్టు చేస్తున్నప్పుడు ఫాదర్ స్టాన్ ఒక స్ఫూర్తిదాయకమైన వీడియో ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన తన కంప్యూటర్ లో దొరికిన కొన్ని పత్రాల ఆధారంగా తనను మావోయిస్టు కుట్రలో భాగంగా ఎన్ఐఎ ఆరోపిస్తున్నదనీ, కాని ఆ డాక్యుమెంట్లను తానెన్నడూ చూడలేదనీ, వాటిని తాను తన కంప్యూటర్ లో పెట్టే ప్రశ్నే లేదనీ అతి సున్నితంగా, కాని స్పష్టంగా వివరించారు.

తన కంప్యూటర్ లోకి ఆ డాక్యుమెంట్లను ఎవరైనా దొంగతనంగా ప్రవేశపెట్టి ఉంటారని ఆయన అన్నమాట, ఆ తర్వాత ఈ సంవత్సరం మొదట్లో ఆర్సెనల్ కంప్యూటింగ్ వెల్లడించిన, వాషింగ్టన్ పోస్ట్ ప్రముఖంగా ప్రచురించిన వివరాలతో రుజువయింది.

నెట్ వేర్ మాల్ వేర్ సహాయంతో ఆరోపణకు ఉపయోగపడే డాక్యుమెంట్లను భీమా కోరేగాం నిందితుల కంప్యూటర్లలో సుదూరం నుంచే జొప్పించడం ఎలా జరిగిందో ఆర్సెనాల్ కంప్యూటింగ్ వెల్లడించింది.

ఈ దురుద్దేశపూరితమైన సాక్ష్యాధారాల కూటసృష్టికి ఫాదర్ స్టాన్ తన ప్రాణాలతో మూల్యం చెల్లించవలసి వచ్చిందని మాకు ఆగ్రహం కలుగుతోంది.

ఆయన జైలులో ఉండగా ఫాదర్ స్టాన్ ఆరోగ్యం పట్ల దుర్మార్గమైన నిర్లక్ష్యం యథావిధిగా సాగిపోయింది. జైలులో ఆయనకు స్ట్రా గాని సిప్పర్ గాని ఇవ్వడానికి నిరాకరించారు. ఇంత మామూలు విషయానికి కూడ ఆయన న్యాయస్థానం తలుపులు తట్టవలసి వచ్చింది. ఆ న్యాయస్థానం అతి నింపాదిగా తక్కుతూ తారుతూ స్పందించింది. జైలులో ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణిస్తుండగా, ఆరోగ్య కారణాల మీద బెయిల్ ఇవ్వాలని పెట్టుకున్న దరఖాస్తును అదే గుడ్డి, నిర్దాక్షిణ్యపు, మొరటు ఎన్ఐఎ న్యాయస్థానం యాంత్రికంగా తిరస్కరించింది. ఆయనకు కొవిడ్ సోకిందని కూడ జైలులో గుర్తించలేదు. హైకోర్టు ఆదేశాల మీద ఆయనను ఆస్పత్రికి తరలించిన తర్వాతనే అది బైటపడింది.

ఆ ఆరోగ్య బెయిల్ దరఖాస్తుపై వాదనల సందర్భంగా హైకోర్టు ముందు ఫాదర్ స్టాన్ చేసిన హృదయ విదారకమైన ఉపన్యాసాన్ని మేము ఎప్పటికీ మరచిపోలేము.

తన క్షీణిస్తున్న ఆరోగ్యం గురించి ఆయన కదిలించే మాటలు చెప్పారు. తాను ఇంకా ఎక్కువ కాలం జీవించి ఉండాలని అనుకోవడం లేదనీ, రాంచి లోని బగేచాలో తన ప్రజల మధ్య చనిపోవాలని కోరుకుంటున్నాననీ ఆయన హైకోర్టుకు నిర్ద్వంద్వంగా చెప్పారు.

అటువంటి అతి సాధారణమైన కోరికను కూడ మన న్యాయవ్యవస్థ వినలేదంటే ఎంత దిగ్భ్రాంతికరమో ఆలోచించండి.

ఫాదర్ స్టాన్ స్వామి మరణం పట్ల తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేస్తూనే, దురదృష్టకరమైన ఈ మరణానికి నిర్లక్ష్యపూరితమైన జైళ్లు, అలసత్వం నిండిన న్యాయస్థానాలు, దురుద్దేశపూరితమైన దర్యాప్తు సంస్థలు పూర్తి బాధ్యత వహించాలని మేం భావిస్తున్నాము.

అవే జైళ్లలో, అదే జవాబుదారీ తనం లేని వ్యవస్థలో అటువంటి అన్యాయాలకే గురవుతున్న మా కుటుంబ సభ్యుల, సహచరుల ఆరోగ్యం పట్ల, ప్రాణాల పట్ల మేం ఆందోళన చెందుతున్నాము. ప్రతి ఒక్కరి భద్రత కోసం, రక్షణ కోసం మేం ఎల్లవేళలా జాగరూకతతో ఉంటాము. ఫాదర్ స్టాన్ అన్నట్టుగా ʹమేం మౌన సాక్షులుగా ఉండడానికి నిరాకరిస్తాం. ఎంత మూల్యమైనా చెల్లిస్తాంʹ.

ప్రకటన మీద సంతకాలు చేసిన వారు:

మినాల్ గడ్లింగ్
రాయ్ విల్సన్
మోనాలి రౌత్
కోయల్ సేన్
హర్షాలి పోట్దార్
శరద్ గైక్వాడ్
మాయ్షా సింగ్
వై ఫెరీరా
సూసన్ ఎబ్రహాం
పి హేమలత
సెహబా హుసేన్
రమా తేల్తుంబ్డే
జెన్నీ రోవెనా
సురేఖ గోర్ఖే
ప్రణాలి పరబ్
రూపాలి జాధవ్
ఫాదర్ జో గ్జేవియర్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *