(సలీమ్ బాషా)
ఒలింపిక్స్. ఈ పదం వినని వాళ్లు అసలు ఉండరు. 1896 లో ప్రారంభమైన ఈ మెగా ఈవెంట్, ప్రపంచం మొత్తం పాల్గొనే ఒక ముఖ్యమైన క్రీడా పండగ.
ఇందులో ఎన్నో వింతలు విశేషాలు, వివాదాలు ఉన్నాయి..
ఇప్పుడు జపాన్ లో ప్రారంభమవుతున్న క్రీడా కార్యక్రమం పేరు ఒలింపిక్స్-2020! జరుగుతున్నది మాత్రం 2021 లో!! ఇదే ఒక విశేషం!
ఇంతవరకు జరిగిన ఒలింపిక్స్ పోటీల మొత్తంలో 1972 లో పశ్చిమ జర్మనీ దేశంలోని మ్యూనిక్(Munich)సమ్మర్ ఒలింపిక్స్ లో జరిగిన సంఘటన అత్యంత దారుణమైనది, విషాదకరమైనది.
సెప్టెంబర్ 5 తెల్లవారుజామున పాలస్తీనియన్ తీవ్రవాద సంస్థ “బ్లాక్ సెప్టెంబర్ (Black September) కు చెందిన ఎనిమిది మంది తీవ్రవాదులు, ఒలింపిక్ గ్రామంలో ప్రవేశించి 11 మంది ఇజ్రాయిల్ క్రీడాకారులను బంధించారు. ప్రతిఘటించిన ఇద్దరు క్రీడాకారులను అక్కడే చంపేశారు. మిగతా వారిని హెలికాప్టర్ లో తీసుకెళ్తుండగా జర్మన్ పోలీసులు, అధికారులు వారిని చుట్టుముట్టారు. అయితే టెర్రరిస్టులు హెలికాప్టర్ ను బాంబుతో పేల్చేసి మిగతా ఇజ్రాయిల్ క్రీడాకారులను చంపేశారు.
ఇజ్రేల్ జైళ్లలో మగ్గుతున్నపాలస్తీనియన్ ఖైదీలను విడుదలచేయాలనే డిమాండ్ బ్లాక్ సెప్టెంబర్ ఈ దాడికి పూనుకుంది. దీని కోడ్ నేమ్ ఇక్రిత్ అండ్ బీరమ్ (Iqrit and Biram). ఇక్రిత్ ,బీరమ్ అనేది ఇజ్రేల్ లోని రెండు పాలస్తీనియన్ క్రైస్తవ గ్రామాలు. 1948 అరబ్, ఇజ్రేల్ యుద్ధం తర్వాత, ఇజ్రేల్ ప్రభుత్వం ఈ గ్రామాల ప్రజలను దేశం నుంచి బహిష్కరించింది. దీనికి గుర్తింపు ఈ ఉచకోతకు ఈ పేర్లు పెట్టారు.
ఈ సంఘటన తర్వాత ఒలింపిక్స్ పోటీలను రద్దు చేయాలని అనుకున్నప్పటికీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు Avery Brundage పోటీలు జరుగుతాయని ప్రకటించాడు. ముప్పై నాలుగు గంటల తర్వాత పోటీలు జరిగాయి. అంతకుముందు. ఒలింపిక్ స్టేడియం లో ఇజ్రాయిల్ క్రీడాకారులకు నివాళులర్పించడం జరిగింది. ఈ సంఘటన మ్యూనిక్ ఊచకోత (Munich massacre) గా చరిత్రలో నిలిచిపోయింది.
(సలీమ్ బాష స్పోర్ట్ జర్నలిస్టు, లాఫ్ ధెరపిస్టు ఫోన్ నెం. 9393737937)