ముఖ్యమంత్రి కెసిఆర్ ని, ఐటి మంత్రి కెటిఆర్ ని రాజకీయంగా అన్ పాపులర్ చేయడమే వ్యూహంగా తెలంగాణ పిసిసి కొత్త అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ చేపట్టబోతున్నారు
“కెసిఆర్ కుటుంబ సభ్యులను అపకీర్తి పాలు చేయకుండా కాంగ్రెస్ ను బలీయం చేయడం సాధ్యం కాదని రేవంత్ నమ్మకం. అందువల్ల ఆయన జూలై 7 న బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుంచి కెసిఆర్, కెటిఆర్ లను అన్ పాపులర్ చేసే విషయం మీద దృష్టిపెడతాడు,” ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
రేవంత్ వచ్చీరావడంతోనే కెసిఆర్ మీద యుద్ధ భేరీ మోగించాడు.
కెపిఆర్, కెటిఆర్ అక్రమాలేమిటి? ఆస్తుల వివరాలు ఏమిటి? ఆంధ్రా కాంట్రాక్టర్లను కెసిఆర్ ఎందుకు అంతగా ప్రేమిస్తున్నారు, కెసిఆర్ జలవివాదం వెనక ఆర్థిక రహస్యాలున్నాయా,కెసిఆర్ ఢిల్లీ బిజెపితో ఎలా కుమ్మక్కవుతున్నారు, జగన్, కెసిఆర్ స్నేహబంధమేమిటి? వంటి విషయాలను ప్రధానంగా వెల్లడించి, పాదయాత్ర చేసి, తండ్రీ కొడుకులిద్దరిని అపకీర్తి పాలు చేసేందుకు వ్యూహం సిద్ధమయిందని వారు చెబుతున్నారు.
నీళ్లు నిధులు, ఉద్యోగాల పేరుతో తెలంగాణ కోసం పోరాటం చేస్తే, నీళ్లని నిధులుగా కెసిఆర్ మార్చుకున్నారని, ఆయన నీళ్లని ఎటిఎం లాగా మార్చుకున్నాడని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించారు.
దీనికి సంబంధించిన వివరాలన్నింటిని త్వరలో ప్రజల ముందుంచుతానని, పాదయాత్రలో జనంలోకి తీసుకు వెళతానని కూడా రేవంత్ ప్రకటించాడు.
కెసిఆర్ మీద బాగా ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ హై కమాండ్ ముఖ్యమంత్రి మీద ఎలాంటి పోరాటం చేసేందుకైనా రేవంత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు.
దీనికి తగ్గట్టుగా వ్యూహాలను తయారు చేసుకుంటున్నాడని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార నిపుణుడు ప్రశాంత్ కిశోర్ సాయం తీసుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు.
రేవంత్ రాకతో మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరెడ్డి కూడా పార్టీలోకి మళ్లీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
రివర్స్ ఫిరాయింపులుంటాయా?
ఇంతవరకు తెలంగాణాలో ఫిరాయింపులన్నీ రూలింగ్ పార్టీలోకి జరిగాయి. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీలో బలపడే ప్రయత్నం చేస్తూ వస్తున్నది. ఎందుకంటే, తెలంగాణ ఉద్యమాన్ని నడిపి, ప్రత్యేక రాష్ట్రం సాధించినా, ప్రజలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు 100 శాతం ఓటేయలేదు. కాంగ్రెస్ కు సీట్లిచ్చారు. తెలుగుదేశం పార్టీకి సీట్లిచ్చారు. ప్రజాతీర్పు పూర్తిగా అనుకూలంగా రాలేదు కాబట్టి ఆయన కనీసం అసెంబ్లీలో నయినా ఈ రెండు పార్టీలు కనబడకుండా చేయాలనుకున్నారు. టిఆర్ ఎస్ లో కలుపుకోవాలనుకున్నారు. అంతే, ఫిరాయింపులు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమ్ముడవోయేందుకు సిద్ధమయ్యారు. అప్పటి నుంచి ఇటీవలి దాకా ఎమ్మెల్యేలు టిడిపి, కాంగ్రెస్ ను వదిలి ‘కెసిఆర్ బంగారు తెలంగాణ తెస్తున్నారు. నియోజకవర్గం అభివృద్ధికోసం’ అంటూ పార్టీ నుంచి బయటకు వచ్చి, తమదే అసలయిన అసెంబ్లీ సభా పక్షం అని తీర్మానం చేసి, స్పీకర్ తో గుర్తింపు సంపాదించి తర్వాత టిఆర్ ఎస్ లో విలీనం కావడం మొదలయింది. ఈ తరహా ఫిరాయింపు అనేది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర రాజకీయ సంప్రదాయమయింది. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకత ఏదీ లేదని, అంతా పాత పద్ధతిలోనే నడుస్తూ ఉందని అర్థమయింది.
ఇపుడు రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక ‘రివర్స్ ఫిరాయింపులు’ ఉంటాయని చెబుతున్నారు.
ఇంతవరకు వార్తలన్నీ టిఆర్ ఎస్ లోకి ఫిరాయింపు అనే వచ్చాయి. ‘టిఆర్ ఎస్ నుంచి ఫిరాయింపులు’ అనే వార్తలు ఎపుడూ చదవలేదు. ఇక ముందు ఇలాంటి వార్తలే వస్తాయని రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు.
దీనికోసం రేవంత్ రెడ్డి అపుడే కొందరు టిఆర్ ఎస్ అసంతృప్తి వాదులతో మంతనాలు మొదలు పెట్టారని, ఏదో బావుకుందామని టిఆర్ ఎస్ లోకి పోయిన కాంగ్రెస్ వాళ్లతో చర్చలు మొదలయ్యాయని చెబుతున్నారు.
ఏదో గుర్తింపు వస్తుందనో, రూలింగ్ పార్టీతో సతాయింపులుంటాయనో టిఆర్ ఎస్ లోకి దూకిన వాళ్ల మీద రేవంత్ వల విసిరాడని చెబుతున్నారు. ఎవరొచ్చినా రాకపోయినా,కొత్త జనరేషన్ యువకులను సమీకిరంచాలని ఆయన భావిస్తున్నాడని ఒక నాయకుడు చెప్పారు.
ఇదే విధంగా బిజెపిలోకి వెళ్లిన రెడ్లను కూడా ఆయన వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని ఇందులో భాగంగా సబితా ఇంద్రారెడ్డి తో చర్చలు మొదలయ్యాయని చెబుతున్నారు.
పి.జనార్దన్ రెడ్డి కుటుంబాన్ని కూడా పార్టీ లో కి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని చెబుతున్నారు. ఇపుడు పార్టీలో ప్రయోజనం లేకుండా పాతుకుపోయిన పెద్దలను సంతృప్తిపరచడంలో టైం వృధా చేయడం కేంటే కొత్త వాళ్లని, పార్టీ కి దూరయినపాతవాళ్లని, కాంగ్రెస్ రాజకీయాలకు దూరంగా వున్న వాళ్లని చేరదీసేందుకు రేవంత్ వ్యూహం రచిస్తున్నారని తెలిసింది.
రేవంత్ రాకతో, పార్టీ లోని సీనియర్లు గుర్రుగా ఉన్నా రేవంత్ పార్టీ కి పునర్జీవం అందిస్తారని, కెసిఆర్ కు ధీటైన పిసిసి అధ్యక్షుడునే టాక్ నలుమూలలకు వెళ్లిపోయింది. ముఖ్యంగా యువకుల్లో, కాంగ్రెస్ కార్యరకర్తల్లో బాగా ప్రచారమయింది.
ఇంతవరకు కాంగ్రెస్ వాళ్లు కెసిఆర్ ను కసి తీరా తిట్టారు తప్ప, కెసిఆర్, కెటిఆర్ వ్యతిరక క్యాంపెయిన్ చేపట్టలేకపోయారు.
కెసిఆర్ కు వ్యతిరేక ధర్నాలు, దీక్షలు చేశారు. అయితే, కాంగ్రెస్ దీక్షా శిబిరం ఎత్తేస్తూనే వాటన్నింటిని ప్రజలు మర్చిపోయారు. కాంగ్రెస్ నేత ల కసి వల్ల కెసిఆర్ కు చీమకుట్టినట్లు కూడా లేదు. కెసిఆర్ గాని, కెసిఆర్ ప్రభుత్వంగా ప్రతిష్ట కోల్పోలేదు.
అంందుకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ని అన్ పాపులర్ చేసే క్యాంపెయిన్ మొదలుపెడుతున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.