కృష్ణాజలాల వివాదం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి వైయస్.జగన్ లేఖ రాశారు. రాష్ట్రాలు తమ పోకుసులను కాపలా పెడుతున్నందున సమస్యలు వస్తున్నాయని, అసలు, కృష్ణా ప్రాజెక్టులను ‘Krishna River Management Board’ పరిధిలోకి తీసుకు రావాలని జగన్ కోరారు.
ముఖ్యాంశాలు
– కృష్ణానదిపై శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు తెలంగాణ, ఏపీలకు ఉమ్మడిగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు కుడివైపున ఏపీ ఉండగా, ఎడమవైపున తెలంగాణఉంది.
– వీటికి ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు తెలంగాణ భూభాగంలో ఉండగా, దిగువన ఉన్న పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు ఏపీ భూభాగంలో ఉన్నాయి. రెండు రాష్ట్రాల అవసరాలను ఈప్రాజెక్టులు తీరుస్తున్నాయి.
– ఆంధ్రప్రదేశ్పునర్ విభజన చట్టం 2014లోని సెక్షన్ 85ను అనుసరించిన విధంగా,∙కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నోటిఫై చేసిన విధంగా ఈ ప్రాజెక్టుల పరిపాలన, నిర్వహణ, నియంత్రణ, ఆపరేషన్ల బాధ్యత కేఆర్ఎంబీదే.
– అయితే కేఆర్ఎంబీ బాధ్యతల ప్రక్రియను కేంద్రం ఇంకా పూర్తిచేయలేదు, ఖరారు చేయలేదు. అంతవరకూ ప్రాజెక్టుల నిర్వహణ, ఆపరేషన్స్కోసం తాత్కాలికంగా ఏర్పాట్లు చేశారు. దీని ప్రకారం శ్రీశైలం, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల నిర్వహణ, ఆపరేషన్ బాధ్యతలను ఏపీకి అప్పగించారు. జూరాల, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల బాధ్యతలను తెలంగాణకు అప్పగించారు. అయితే విద్యుత్ కేంద్రాలు రెండు రాష్ట్రాల భూభాగాల్లో ఉన్నందున.. ఏరాష్ట్రంలో ఉన్నవి ఆ రాష్ట్రమే నిర్వహిస్తున్నాయి.
– కేంద్ర ప్రభుత్వానికి చెందిన జలవనరులశాఖ అడిషనల్ సెక్రటరీ అధ్యక్షతన 2015, జూన్ 18,19 తేదీల్లో సమావేశం జరిగింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలోరెండు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల పంపకాలపై ఒప్పందం కుదిరింది.
– ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల నీటిని ఇరురాష్ట్రాలూ పంచుకున్నాయి. కేడబ్ల్యూడీటీ–1 ప్రకారం 75శాతం నీరు అందుబాటులో ఉంటుందనే ప్రాతిపదికిన ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీటిని కేటాయించారు. మైనర్ ఇరిగేషన్ అవసరాలు, ఆవిరయ్యే నీరు, గోదావరి మళ్లింపులు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని తాత్కాలిక ప్రాతిపదికన 66:34 నిష్పత్తిలో ఇరురాష్ట్రాలకూ పంపకాలు చేశారు.
– ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఇంజినీర్ ఇన్ చీఫ్‌లతోపాటు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీకి కమిటీలో స్థానంకల్పించారు. అందుబాటులో ఉన్న జలాలు, ఇరు రాష్ట్రాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేఆర్ఎంబీ సిఫార్సులు చేస్తోంది. కేఆర్ఎంబీ తీసుకునే నిర్ణయాలను రెండు రాష్ట్రాలు తప్పకుండా అమలు చేయాలి. రిజర్వాయర్లలో ఉండే నిల్వలు, వచ్చే ఇన్‌ఫ్లోలను దృష్టిలో ఉంచుకుని నీటివిడుదల విషయంలో కేఆర్ఎంబీ ఆదేశాలను అమలు చేయడం తప్పనిసరి.
– ఈ నేపథ్యంలో అనుమతిలేకుండా, అక్రమ చర్యలతో తెలంగాణ రాష్ట్రం ఏపీని ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది.
– శ్రీశైలం ప్రాజెక్టును తొలుత విద్యుత్ ఉత్పాదనకోసం నిర్మించారు. కాని కాలం గడిచేకొద్దీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బహుళ అవసరాలను తీర్చిదిద్దే భారీ ప్రాజెక్టుగా మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలు, సాగునీటి అవసరాలను తీర్చేలా ఈ ప్రాజెక్టును మార్చారు.
– శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా, నీటి నిల్వ 215.8 టీఎంసీలు. విద్యుత్ ఉత్పాదనకు కనీస నీటిమట్టం స్థాయి 834 అడుగులు కాగా, సాగునీటి అవసరాలకోసం నీటి విడుదలకు కనీస నీటిమట్టం స్థాయి 854 అడుగులు.
– జూన్ 1 నాటికి శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వ స్థాయి 808.4 అడుగులు. అప్పుడు నీటినిల్వ 33.39 టీఎంసీలు. విద్యుత్ ఉత్పాదన ప్రారంభించడానికి పాటించాల్సిన కనీస నీటిమట్టం స్థాయి కన్నా అప్పటికి చాలా తక్కువ స్థాయిలో శ్రీశైలంలో నీళ్లు ఉన్నాయి. ఈ స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడు విద్యుత్‌ను ఉత్పత్తి చేయకూడదు. సాగునీటికోసం నీటిని విడుదలచేసినప్పుడే, విద్యుత్ ఉత్పత్తి జరగాలి.
– కాని తెలంగాణరాష్ట్రం ఏకపక్షంగా ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. కేఆర్ఎంబీకి తన అవసరాలపై ఎలాంటి ఇండెంట్ పెట్టకుండానే విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటినికి కిందికి వదిలేస్తోంది. నాగార్జున సాగర్‌లో అప్పటికే 532.9 అడుగుల స్థాయిలో 173.86 టీఎంసీల నీరు ఉంది. ఖరీఫ్ ముందస్తు అవసరాలకోసం ఈ నీటిని వాడుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో, నాగార్జున సాగర్ దిగువనకూడా సాగునీటి అవసరాలు లేకుండానే శ్రీశైలం నుంచి విద్యుత్తుఉత్పత్తి రూపేణా నీటిని కిందకు విడుదలచేస్తున్నారు.
– జూన్ 30 నాటికి శ్రీశైలంలోకి 17.36 టీఎంసీల ఇన్‌ఫ్లో వస్తే ఇందులో 40శాతం అంటే 6.9 టీఎంసీల నీటని విద్యుత్ ఉత్పత్తి రూపేణా అనుమతిలేకుండా తెలంగాణ రాష్ట్రం కిందకు విడిచిపెట్టింది. శ్రీశైలంలో నీటిమట్టం పెరగనీయకుండా నియంత్రిస్తోంది. ప్రతిరోజూ 2 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తికోసం వాడేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోకి నెడుతోంది.
– శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరుకుంటేగాని సాగునీరు, తాగునీటి అవసరాలకోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని తీసుకునే అవకాశం ఉండదు. చెన్నైకు తాగునీటి సరఫరాతోపాటు తీవ్ర∙దుర్భిక్షప్రాంతమైన రాయలసీమలోని నాలుగు జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వెళ్లే నీళ్లే ఆధారం.
– తెలంగాణ రాష్ట్రం అక్రమంగా నీటి విడుదలను కేఆర్ఎంబీకి దృష్టికి తీసుకెళ్తూ జూన్ 10, 2021న ఏపీ లేఖరాసింది. జూన్ 17న కేఆర్ఎంబీ తిరుగు లేఖ రాస్తూ శ్రీశైలం ఎడమగట్టులో విద్యుత్ ఉత్పత్తిని నిలిపేయాలని, నీటివిడుదలను ఆపేయాలంటూ తెలంగాణ జెన్కోకు రిక్వెస్ట్చేసింది. కేవలం గ్రిడ్ సంబంధిత సమస్యలు తలెత్తితే తప్ప వెంటనే విద్యుత్ ఉత్పత్తిని నిలిపేయాలని కోరింది.
– కాని తెలంగాణ ప్రభుత్వం నిరంతరంగా నీటిని విద్యుత్‌ఉత్పత్తి కోసం విడుదలచేస్తూనే ఉంది. ఈ అంశాన్ని మరోసారి కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్తూ జూన్ 23, జూన్ 29, 2021 తేదీల్లో న కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్తూ ఏపీ లేఖలు రాసింది.
– నాగార్జునసాగర్ రెండు రాష్ట్రాల మధ్యనున్న మరో ప్రాజెక్టు. దీని పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. పూర్తిస్థాయి నీటినిల్వ 312 టీఎంసీలు. నీటిని విడుదల చేయడానికి కనీస నీటిమట్టం స్థాయి (ఎండీడీఎల్) 510 అడుగులు కాగా జూన్ 30, 2021 నాటికి 534.20 అడుగులమేర నీరు నిల్వ ఉంది. 176.46 టీఎంసీల నీళ్లు నాగార్జున సాగర్‌లో నిల్వ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏక పక్షంగా 30,400 క్యూసెక్కుల నీటిని విడుదలచేస్తూ విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తోంది. నీటివిడుదలపై ఉన్న ప్రోటోకాల్స్‌ను పూర్తిగా ఉల్తంఘిస్తూ, కేఆర్ఎంబీకి తన అసరాలేంటో ఇండెంట్ పెట్టకుండానే అక్రమంగా నీటిని విడుదలచేస్తోంది.
– కేవలం సాగునీటి అవసరాలకోసం నీటిని విడుదలచేస్తున్న సమయంలోనే విద్యుత్ ఉత్పత్తిచేసుకోవాల్సి ఉన్నప్పటికీ తెలంగాణరాష్ట్రం దాన్ని పట్టించుకోలేదు. సాగర్ దిగువన ప్రస్తుతం ఎలాంటి సాగునీటి అవసరాలు లేకపోయినా ఏకపక్షంగా విద్యుత్ఉత్పత్తికోసం నీటిని విడుదల చేయడం, తెలంగాణ రాష్ట్రం ఉద్దేశపూర్వక, అక్రమ చర్య.
– డాక్టర్ కె.ఎల్.రావు పులిచింతల ప్రాజెక్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. దీని పూర్తిస్తాయి నీటిమట్టం 175 అడుగులుకాగా, నిల్వ 45.77 టీఎంసీలు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాడెల్టా స్థిరీకరణకోసం ఈ ప్రాజెక్టును ఉద్దేశించారు. కాని జూన్ 29, ,2021 రాత్రి 8:30 గంటలనుంచి విద్యుత్ ఉత్పత్తికోసం తెలంగాణ రాష్ట్రం ఏకపక్షంగా నీటిని విడుదలచేస్తోంది. విజయవాడలోని ఇరిగేషన్ ఇంజినీర్ ఆధీకృత అధికారి అయినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం ఎలాంటి ఇండెంట్ పెట్టలేదు. నీటి విడుదలకోసం కేఆర్ఎంబీ నుంచి ఎలాంటి ఆదేశాలు తీసుకోలేదు. ఇదే అంశాన్ని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్తూ జూన్ 30న,2021న ఏపీ లేఖరాసింది. ప్రకాశం బ్యారేజీలో ప్రస్తుతం గరిష్ట నీటిమట్టం అంటే 3.07 టీఎంసీల నీరు ఉందని, తెలంగాణ రాష్ట్రం అనుమతి లేకుండా విడుదలచేస్తున్న నీటివల్ల, అమూల్యమైన నీళ్లు కిందకు సముద్రంలోకి వృథాగాపోయే పరిస్థితి తలెత్తిందని, వెంటనే నీటి విడుదలను నిలిపేయాలని కోరుతూ ఈ లేఖ రాసింది.
– ఇదే సమయంలో తెలంగాణలో ఉన్న అన్ని జలవిద్యుత్ కేంద్రాల్లో పూర్తిస్థాయి విద్యుత్తును ఉత్పత్తిచేయాలంటూ ఆరాష్ట్రం జూన్ 28న ఒక జీవో జారీచేసింది. దీని అర్థం శ్రీశైలం నుంచి రోజుకు 4 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి రోజుకు 3 టీఎంసీలు, పులిచింతల నుంచి రోజుకు 1.8 టీఎంసీల నీటిని జలవిద్యుత్కోసం విడుదలచేస్తున్నట్టే. విద్యుత్ ఉత్పత్తి నిలిపేయాలంటూ కేఆర్ఎంబీ ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ రాష్ట్రం ఏమాత్రం పట్టించుకోవడంలేదు.
– విద్యుత్ఉత్పత్తికోసం నీటిని విడుదలచేయవద్దని కేఆర్ఎంబీ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ స్టాండర్ట్ ఆపరేషన్ ప్రోటోకాల్‌ను, ఒప్పందాలను ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా తెలంగాణ నీటిని విడుదలచేస్తోంది.
– తెలంగాణరాష్ట్రం చర్యలు రెండురాష్ట్రాల మధ్య సంబంధాలకు మంచివి కావు. దిగువ రాష్ట్రమైన ఏపీ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతీస్తాయి. రాయలసీమ తోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల తాగు, సాగునీటి సమస్యలు తీవ్రమవుతాయి. చెన్నై నగరానికి నీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు వస్తాయి.
– నీటి విడుదలపై కేఆర్ఎంబీ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా, విద్యుత్ ఉత్పత్తిపేరిట తెలంగాణ రాష్ట్రం అక్రమంగా నీటిని విడుదలచేయకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని, ప్రధాన మంత్రిగా మీరు జోక్యంచేసుకోవాలని కోరుతున్నాను.
– అలాగే అక్రమంగా విడుదలచేసిన నీటిని పరిగణలోకి తీసుకుని గతంలో కుదిరిన ఒప్పందం మేరకు తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీల జలాల్లో ఆ మేరకు కోత విధించాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
– కేఆర్ఎంబీ అధికారపరిధిని వెంటనే నోటిఫై చేస్తూ కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. రెండు రాష్ట్రాలకూ ఉమ్మడిగా ఉన్న రిజర్వాయర్లను పూర్తిగా కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని, ఉమ్మడి రిజర్వాయర్ల వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తిచేస్తున్నాను.