(వడ్డేపల్లి మల్లేశము)
అనాదిగా అణచివేత, వివక్షత, అస్పృశ్యత, వెలివేతకు, దోపిడీ, పీడన ,వంచనకు గురైన వర్గాలు దళితవర్గాలు
కావడం మనందరికీ తెలిసిందే.
ఆ నేపథ్యాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ రచనా కాలం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు దళిత వర్గాలకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలను, రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించిన విషయంగమనించుకోవాలి.
రాజ్యాంగంలో పొందుపరచిన అవకాశాల మేరకు పాలకులు ఆయా వర్గాల ప్రయోజనం కోసం కృషి చేయాలని అంబేద్కర్ పాలకులకు ఆనాడే సూచనలు చేశారు.
దళిత సాధికారత
దళితులు ఆత్మగౌరవంతో బతికే విధంగా మిగతా సమాజము తోని కలిసి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఉపాధికల్పన, ఉద్యోగ అవకాశాలతో పాటు మానవ అభివృద్ధి లో చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ను జీవించగలిగే పరిస్థితిని, అవకాశాలను దళిత సాధికారత అంటారు.
2003వ సంవత్సరం లోనే టిఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ అధినేత ఆధ్వర్యంలో దాదాపుగా 100 మందికి పైగా మేధావులతో దళితుల సాధికారత పైన అనేక తీర్మానాలు చేయడం జరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లోనే ప్రభుత్వం రాబోయే 5 ఏళ్ళలో 50 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది కానీ అది నేటికీ అమలు కాలేదు.
ఇక టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని సగర్వంగా ప్రకటించిన కెసిఆర్ గారు ఆ హామీని తుంగలో తొక్కి తానే అధికార పగ్గాలు చేపట్టారు. ఆనాడే దళితుల సాధికారతకు గండి పడిందనే విషయాన్ని దళితులు, మేధావులు, బుద్ధిజీవులు, సమాజంలోని అన్ని వర్గాలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
ఇక దళితులకు సంబంధించి భూమి లేనటువంటి వారికి మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వడానికి ప్రభుత్వం వాగ్దానం చేసినప్పటికీ అది పూర్తిగా నామమాత్రంగానే మిగిలిపోయింది. ఆ వైపుగా ప్రభుత్వం గత ఏడు సంవత్సరాలుగా ఎలాంటి కృషి చేయకపోగా భూమి లేని కారణంగానే భూమి ఇవ్వడం లేదని సమర్థించుకుంటూ ఉన్న విషయం మనందరికీ తెలిసినదే.
దళితులపైన హత్యలు, లాక్ అప్డెత్, దోపిడీ పీడన, అవమానాలు, వంచన అనేక రకాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. అనేక సందర్భాలలో కూడా ప్రభుత్వం దళితులకు భూమి ఇవ్వకపోగా గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి రైతుల భూములను ప్రభుత్వాలు అనేక కారణాలు అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, హరితహారం పేరుతో ని ప్రభుత్వ ఆధీనంలో చేసుకున్న సందర్భాలు కూడా అనేకం .ఇదేనా దళిత సాధికారత?
ఇన్ని రకాలుగా దళితులకు సంబంధించిన సమస్యలపైన ఏనాడు పెదవి విప్పని ప్రభుత్వం ఒక్కసారిగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించగానే సంతోషపడి వెళ్లడం, ఆ తర్వాత మేధావులు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, దళిత సాధికారతకు వెయ్యి కోట్లు ప్రకటించగానే క్రింది స్థాయిలో పాలాభిషేకాలు పాల్పడడం చకచకా సాగిపోయింది.
ఇక్కడ దళితులు, దళిత సంఘాలు, రాజకీయ పక్షాలు, మేధావులు ,విద్యార్థి సంఘాలు ,సమాజంలోని ఇతర ప్రజా సంఘాలు కూడా దళిత సాధికారతను మౌలికంగా ఆలోచించకపోవడం చాలా బాధాకరం.
అఖిలపక్ష సమావేశాల ఏర్పాటు
కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రధానమైన కీలక సమస్యల పరిష్కారంలో ప్రతిపక్షాల యొక్క సూచనలు, సలహాలు తీసుకునే సాంప్రదాయం అరుదుగా కనబడడం ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధంగా ఉంది. అలాగే రాష్ట్రంలోన యితే గత ఏడు సంవత్సరాలుగా అఖిలపక్ష సమావేశం జరిగినటువంటి దాఖలాలు లేవనే చెప్పవచ్చు. కరోనా వంటి భయంకరమైన సమస్యల పరిష్కారం సమయంలో ,ఇతర అత్యవసర సమయంలో కూడా ఏనాడు రాష్ట్రప్రభుత్వం రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పరిచిన దాఖలాలు ఏమీ లేవు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే క్రమంలో పల పనిచేయని కారణంగా ప్రతిపక్షాలకు ఈ రాష్ట్రంలో స్థానం లేకుండా పోయింది. ఆ విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది.
ఇక టిఆర్ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చే సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించి పాలనలో అఖిల పక్షాలతో పాటు ప్రజా సంఘాల యొక్క సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు స్వీకరించడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది .కానీ బహుశా ఆ మొదటి సమావేశం దళితుల సాధికారత కోసం సంబంధించినదే అనడంలో అతిశయోక్తి లేదు.
రెండు అంశాలు ప్రభుత్వ వాగ్దానానికి సంబంధించినవే
దళితులకు ముఖ్యమంత్రి తో పాటు మూడు ఎకరాల భూమి మిగతా వారి అభివృద్ధికి సంబంధించి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్న హామీ కలగానే మిగిలి పోగా, ఏనాడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకపోవడం కూడా ఈ సందర్భంగా రాజకీయ పక్షాలు మేధావులు బుద్ధిజీవులు దళిత సంఘాలు గమనించవలసిన అవసరం ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దళితులపైన అకృత్యాలు జరిగినప్పటికీ నామమాత్రపు విచారణతో వాటిని మరిపించడమే కానీ చిత్తశుద్ధిగా చర్యలు తీసుకోవడం లేదు. అందులో భాగంగానే ఇటీవల అడ్డ గూడూరు పోలీస్ స్టేషన్ లో దళిత మహిళ మరియమ్మ లాక్ అప్ డెత్ పైన కొన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ,దళిత సంఘాలు పోరాటం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం స్వయంగా ఆ కేసు విషయంలో చొరవ తీసుకొని మరియమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని లక్షలాది రూపాయలు పరిహారంగా అందజేస్తామని ఇకముందు దళితులకు అన్యాయం జరగకుండా చూస్తామని మాట ఇవ్వడం జరిగింది.
ఇదే సందర్భంలో కాంగ్రెస్ శాసన సభ్యుల బృందం ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ సమస్యను వారి దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పినప్పటికీ ఆ తరువాత జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ అంశంపై నా సుదీర్ఘంగా చర్చ జరిపిన సమయంలో దళిత సాధికారత పైన కూడా విస్తృతంగా ఆలోచన జరిగి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు వెయ్యి కోట్ల రూపాయలను దళితుల అభివృద్ధికి ఖర్చు చేయనున్నట్లు అవసరమైతే మరింత పెంచనున్నట్లు గా ప్రకటించడం చాలా సంతోషకరమే. కానీ అఖిల పక్షాలు గాని, ప్రజాసంఘాలు మిగతా సంఘాలు కూడా ప్రభుత్వాన్ని మౌలికమైన సమస్యలపైన ఎందుకు ప్రశ్నించలేదని ఇక్కడ ఆలోచించవలసిన అవసరం ఉంది.
ఇంకా విడ్డూరమైన విషయం ఏమిటంటే ఆ మరుసటి రోజే రాష్ట్రంలోని దళిత మేధావులు ముఖ్యమంత్రి గారిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి సంతోషాన్ని ప్రకటించడం దేనికోసమో అర్థం కాలేదు. వెంట వెంటనే రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల దళిత సంఘాలు మిగతా సంఘాలు కార్యకర్తల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేయడం కూడా ఈ దళితుల సమస్యను పక్కదారి పట్టించడం మే అవుతుంది.
గత హామీల పైన డిమాండ్ ఎందుకు చేయలేదు
శాసన సభ్యుల బృందం ,అఖిలపక్ష సమావేశం మేధావుల సందర్శనలో దళితులకు సంబంధించిన మౌలికమైన అంశాలను ఎందుకు ప్రశ్నించలేదు అనేదే ఇక్కడ ఆలోచించవలసిన సమస్య. దళిత సంఘాలు దళిత మేధావులు ప్రభుత్వాన్ని సమర్థించి పాలాభిషేకాలు చేసినప్పుడు ఇక మిగతా సమాజం ఎలా మద్దతిస్తుంది?
ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారంగానే గత ఏడు సంవత్సరాలలో 70 వేల కోట్ల నిధులను దళితుల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది .మరి ఎంత వరకు ఖర్చు జరిగినది? ఎంత అభివృద్ధి జరిగింది ?ప్రతి పక్షాలు ప్రజా సంఘాలు మేధావులు ప్రభుత్వాన్ని ప్రశ్నించ వలసిన అవసరం లేదా?
దళితులను రెండు సార్లు ఉప ముఖ్యమంత్రి పదవిలో నియామకం చేసి వెంటనే తొలగించడం ఆపైన ఆ పోస్ట్ ఖాళీగానే ఉండటం మన అందరికీ తెలిసిందే. ఇక ముఖ్యమంత్రి పదవిని దళితులకు అప్పగిస్తాం అన్న మాట ఎందుకు ప్రక్కనపెట్టారు ఈ నాటికి ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు .ప్రతిపక్షాలు దళితులు డిమాండ్ చేసి అడగలేదు.
భవిష్యత్ కార్యాచరణ
దళిత సంఘాలు దళిత మేధావులు విభిన్న రాజకీయ పార్టీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మౌలికమైన సమస్యల పైన ఒక ఆలోచనకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేర్చుకోవాలి .కానీ పాలాభిషేకాలతో, పుష్పగుచ్చా లతో ప్రభుత్వాన్ని సంతోష పెట్టడం విడ్డూరం. విచారకరం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఇచ్చిన హామీలను అమలు చేయనటువంటి సందర్భాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళ వలసిన అవసరం చాలా ఉన్నది.
మరొకవైపు విద్యార్థి సంఘాలు దళిత సంఘాలు అనేక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంపై నా నిరుద్యోగ భృతి మంజూరు చేయకపోవడం పైన అనేక ఉద్యమాలు మరొకవైపు కొనసాగుతున్నవి.
ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు సంబంధించినటువంటి యువకులే ఈనాడు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు అనేది నగ్నసత్యం. కావున ఆయా వర్గాల ప్రయోజనం కోసం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే క్రమంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా మాత్రమే పరిష్కారం దొరుకుతుంది. కానీ మెప్పు కోసం మర్యాద కోసం కలిస్తే ప్రతిపక్షాల పలుకుబడి పలుచబడి పోతుంది.
ప్రభుత్వం కూడా ఇంత బహిరంగంగా మరియమ్మ లాకప్ డెత్ పైన స్పందించిన సందర్భంలో చర్చకు వచ్చినటువంటి దళిత సాధికారత పైన దృష్టి సారించి ఇచ్చిన మాటను చిత్తశుద్ధిగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.
ఇక ప్రజాసంఘాలు, అఖిల పక్షాలూ, దళిత సంఘాలు మరియమ్మను లాకప్ డెత్ కు గురి చేసినటువంటి పోలీసులపైనా తగు చర్య ఎందుకు తీసుకోలేదు? అని డిమాండ్ చేయకపోవడం చాలా బాధాకరం. సాధారణ పౌరులు లేదా ప్రజలు నేరం చేసినప్పుడు చట్టం ఎలా శిక్షిస్తుo దో నేరం రుజువైతే జైలు శిక్ష ఉరిశిక్ష అమలు చేసినట్లే పోలీసుల పైన కూడా ప్రభుత్వం కేసు పెట్టవలసిన అవసరం ఉంది .అప్పుడే చట్టం ముందు అందరూ సమానులే అనే భావన ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. చట్టాన్ని అమలు చేసే ప్రభుత్వము పోలీసు యంత్రాంగం ఈ విషయంలో మౌనంగా ఉండటం దేనికి సంకేతం?
ఒకవైపు తెలంగాణా లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పుకుంటూనే అనేక సందర్భాలలో పేదలు అనగారిన వర్గాలు సంచార జాతులు అట్టడుగు వర్గాలు ఎస్సీ ఎస్టీల పైన అనేక సందర్భాలలో అణచివేత నిర్బంధాలకు గురిచేసి శిక్షించిన సందర్భాలు అనేకం. వారికి ఎవరు వెనుక ఆసరా,భ రోసా లేకపోవడం వలన, కొంతమంది దెబ్బలు తాళలేక చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి .ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని నా యొక్క విజ్ఞప్తి.
( ఈ వ్యాసకర్త కవి రచయిత సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)