అన్నా, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులేంది? రూ.2,600 కోట్లు ఖర్చేంది?

(ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి లేఖ)

ముఖ్యమంత్రి గారూ,

మీకున్న అపారమైన శక్తియుక్తులు ఎందుకో వృధా అయిపోతున్నాయి. గ్రామ పంచాయితీ భవనాలతో సహా అన్ని ప్రభుత్వ భవనాలకు మన పార్టీ జెండా రంగులను పోలిన రంగులను వేయాలన్న మీ నిర్ణయాన్ని రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. దానిపై మీరు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసింది.

నాలుగు వారాల లోగా రంగులు మార్చాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మనకు భారీ షాక్ తగిలినట్లయింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకపోతే అది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందనే విషయం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రభుత్వ భవనాలకు వేసిన రంగులు మన పార్టీ జెండా రంగులతో పోలి లేవు అని మనం చేసిన వాదనలు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇలా చేయడం ఇది మొదటి సారి కాదు. ఈ విధంగా మన వాదనలను కోర్టులు తిరస్కరించడం చాలా సార్లు జరిగింది. మన వద్ద ఎంతో సమర్ధవంతమైన అడ్వకేట్ జనరల్, సమర్ధులైన ఆయన బృందం ఉన్నా కూడా మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని సుప్రసిద్ధ న్యాయవాదులను మన కేసులు వాదించడానికి నియమించుకుంటున్నాము. కొన్ని సందర్భాలలో సుప్రీంకోర్టు లో ప్రాక్టీస్ చేసే ప్రముఖ న్యాయవాదులను కూడా వినియోగించుకుంటున్నాము. దీని కోసం మనం పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నాము. ఈ విధంగా సీనియర్ న్యాయవాదుల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేయడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.

మనం ప్రజాధనానికి సంరక్షకులమే అయినా మనల్ని మనం ప్రజాధనానికి యజమానులుగా భావిస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు.
దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం నుంచి ఇలా మనకు ఈ రంగుల విషయంలో ప్రతికూల ఆదేశాలు రావడం ఇది రెండో సారి.

మన పార్టీ రంగులైన తెలుపు, నీలం, ఆకుపచ్చలను ప్రభుత్వ భవనాలపై వేయడానికి మనం రూ.2,600 కోట్ల కన్నా ఎక్కువే ఖర్చు చేశామని ప్రజలు అంటున్నారు.

రంగుల వ్యవహారంలో మనం భారీ ఎత్తున ప్రజాధనాన్ని ఖర్చు చేయడమే కాకుండా ఈ కేసులపై పోరాడటానికి న్యాయవాదులకు కూడా మనం ఇప్పటి వరకూ భారీ ఎత్తున ప్రజాధనాన్ని ఫీజుల కింద ఖర్చు చేయడంపై విమర్శకులు తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు. ఇది మన మొహానికి తగిలిన పెద్ద దెబ్బ అనే స్థాయిలో వారు వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలకు మన పార్టీ రంగులు వేసుకున్న అంశంలో దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం లో రాష్ట్ర హైకోర్టు 2020 మార్చి 9 న పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలిస్తూ పది రోజుల్లో ఆ రంగులు తొలగించాలని సూచించింది.

అదే విధంగా పార్టీ జెండాను పోలినవి కాకుండా కొత్త రంగులు ఏ విధంగా ఉండాలో కూడా నిర్దేశించమని విస్పష్టంగా చెప్పింది. మన ప్రభుత్వం ఆ ఆదేశాలను పాటించలేదు సరికదా ఎక్కడా కనిపించకుండా నాలుగో రంగుగా మట్టి రంగును జత చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా మరొక రంగును కనీకనిపించకుండా జత చేసి మన పార్టీ జెండాకు ఈ రంగులకు తేడా ఉందని మన ప్రభుత్వం వాదించింది. ఈ సందర్భంగా నాకు ఒక తెలుగు సామెత గుర్తుకు వస్తున్నది.

‘‘ అన్నీ తెలిసిన అమ్మ అమావాశ్యనాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశినాడు చచ్చిందట’’ మన సలహాదారులు ఎలా ఉన్నారూ అంటే ‘‘ అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటుంది’’ అనే రకం. పార్టీకీ ప్రభుత్వానికి తేడా తెలియని సలహాదారులు మీకు ఈ విధమైన సలహాలు ఇస్తుంటారని ప్రజలు భావిస్తున్నారు.

స్వతంత్ర భారత దేశంలో ఎప్పుడూ ఎక్కడా కూడా ప్రజా ధనాన్ని ఇంతగా పార్టీ రంగుల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నవారు లేరనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఈ సందర్భంగానే పైన చెప్పిన సామెత మళ్లీ చెప్పాల్సి వస్తున్నది ‘‘పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిపెట్టిందంట’’.

ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయరాదని తాము గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదో చెప్పాలని రాష్ట్ర హైకోర్టు మనకు తాకీదులు పంపిన విషయం కూడా తెలిసిందే. ఇలా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే కోర్టు ధిక్కరణ కేసు చేపడతామని కూడా ఘాటుగా చెప్పారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని జారీ చేసిన జీవో నెం.623ను హైకోర్టు కొట్టేసి ప్రభుత్వాన్ని సంజాయిషీ అడిగింది. అయితే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా దాన్ని కూడా కొట్టేశారు. ఈ సందర్భంగా ప్రజలు అడుగుతున్నది ఏమిటంటే అనవసరమైన ఈ ఖర్చును ఎవరు భరించాలి? అని. ప్రజాధనాన్ని ఈ విధంగా వృధా చేసిన బాధ్యుల నుంచి దీన్ని తిరిగి రాబట్టాలని సాధారణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇలా చేయడం అంటే కేవలం మన పార్టీ ప్రచారం కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమేనని సమాజంలోని అన్ని వర్గాల వారూ భావిస్తున్నారు.

తాజాగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలతో సహా ఇలా ప్రభుత్వ భవనాలకు రంగులు మార్చి మన పార్టీ రంగులు వేసుకోవడానికి మన ప్రభుత్వం వందల, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. అంత పెద్ద మొత్తంలో మనం రంగులకు ఖర్చు చేసి ఉండమేమో అని నేను కూడా అనుకుంటున్నాను. ఏది ఏమైతేనేం, మన ప్రభుత్వం ఇలా ‘‘రంగులు మార్చడానికి’’ ఎంత ఖర్చు చేసిందో మనమే ప్రకటిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇలా రంగులు మార్చేందుకు మనం పెట్టిన ఖర్చును వెల్లడించడం ద్వారా మనల్ని విమర్శించేవారి నోరు మూయించవచ్చునని నేను మీకు సలహా ఇస్తున్నాను. ఈ విధంగా మనం రంగుల కోసం ఎంత ఖర్చు పెట్టామో మనమే ప్రజలకు చెప్పడం ద్వారా మనం ఆర్ధిక క్రమశిక్షణను పాటిస్తున్నామని, దుబారా ఖర్చులు చేయడం లేదని ప్రజలకు చెప్పవచ్చు. తద్వారా జరుగుతున్న నష్టాన్ని కొంత వరకు పూడ్చుకోవచ్చు. మనం రంగులు మార్చిన ప్రభుత్వ భవనాలను ఇప్పటి వరకూ తిరిగి పాత రంగుల్లోకి తీసుకురాలేదని అంటున్నారు. ఇదే నిజమైతే మీరు తక్షణమే దాన్ని సరి చేసి దేశంలో అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పు పట్ల మీ గౌరవాన్ని వెల్లడించుకోవాలని కోరుతున్నాను.

భవదీయుడు

Kanumuru Raghu Rama krishnamraju ycp mp (Facebook picture)

(కె.రఘురామకృష్ణంరాజు, వైసిపి లోక్ సభ సభ్యుడు,నర్సాపూర్ నియోజకవర్గం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *