వరి నాట్ల రూపంలో విత్తనాలు వెదజల్లే పద్దతిలో వరి సేద్యం చేస్తే అధిక దిగుబడి ఉంటుందనే విషయాన్ని తెలంగాణప్రభుత్వం ఈ మధ్య ప్రచారం చేస్తూ ఉంది. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు ఆదివారం జగదేవ్ పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో పొలంలో స్వయంగా దిగి విత్తనాలు వెద జల్లే పధ్ధతి వరి సాగు పై రైతులకు అవగాహన కల్పించారు.
అనంతరం పొలం వద్దే రైతులను ఉద్దేశించి మాట్లాడారు. విత్తనాలు వెదజల్లే పద్దతిలో వరి పంట సాగు చేస్తే ఎకరానికి 2-3 బస్తాలు (1-2 క్వింటాళ్లు) దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.
ఈ వరి ధాన్యం విత్తనాలను వెదజల్లే పద్ధతి ద్వారా బురదలో కాలు పెట్టకుండానే వరి పండించుకోవచ్చని అన్నారు .
నారు పోసే పని లేదు. నాట్లు నాటే పని లేదు. కూలీల కోసం ఎదురుచూసే గొడవ లేదు. కలుపు కూలీల ఇబ్బంది లేదు. నీటి వినియోగం 30- 35 శాతం తగ్గుతుంది. 10-15 రోజుల ముందు క్రాప్ వస్తుంది. మామూలు పద్ధతిలో అయితే ఎకరానికి 25 కిలోల విత్తనాలు కావాలి. ఈ వెదజల్లే పద్ధతి అయితే 8 కిలోల విత్తనపొడ్లు సరిపోతయి. వడ్లు సల్లినంక ఎన్ని రోజులకైనా నీళ్లు కట్టుకోవచ్చునని అన్నారు. విత్తనపొడ్లు వెదజల్లినంక వర్షం పడే దాక కొన్నిరోజులు ఎదురు చూస్తే ఇంకా మంచిది. కాళేశ్వరం సహా అన్ని సాగు నీటి ప్రాజెక్టులు, సిద్దిపేట జిల్లాలో వరి సాగు చేసే రైతులందరూ ఈ వెదజల్లే పద్దతిని అనుసరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి,’ అని అన్నారు.
వెదజల్లే పద్దతిలో వరి సాగు చేసే అంశంపై సిద్దిపేట జిల్లా రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు ఆదేశిచారు.