*జగన్ దెబ్బకి రిలయన్స్ వెనక్కి.. ట్రైటాన్ జంప్-టిడిపి *కంపెనీలను జగన్ తరిమేశారు
* కంపెనీలు రావు.. ఉన్నవీ వెళ్లిపోతున్నాయి.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు మూర్ఖ వైఖరితో రిలయన్స్ ఏపీలో ప్లాంటుని ఏర్పాటుని విరమించుకుందని, ట్రైటాన్ తెలంగాణ తరలిపోయిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
రిలయన్స్, ట్రైటాన్లు వల్ల ఏపీ 17 వేల కోట్లకు పైగా పెట్టుబడులను కోల్పోయిందని, వేలాది ఉద్యోగాలు రాకుండా పోతున్నాయన్నారు. జగన్రెడ్డి ప్రభుత్వం దెబ్బకి ప్రాంక్లిన్ టెంపుల్టన్, లులూ వంటి ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలు ఏపీకి బైబై చెప్పేశాయన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2018, ఫిబ్రవరి 25న విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో వివిధ దశల్లో 52 వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ లో పెట్టేందుకు రిలయన్స్ గ్రూప్ తో ఎంవోయూ కుదుర్చుకున్నామని లోకేష్ గుర్తు చేశారు.
ఐటీ ఎలక్ర్ట్రానిక్స్ మంత్రిగా తాను, శాఖాధికారులు రిలయన్స్ని ఒప్పించి తిరుపతి విమానాశ్రయం సమీపంలో 150 ఎకరాల్లో 17 వేల కోట్లతో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలు స్థాపించేలా అంబానీని ఒప్పించామని తెలిపారు. జియో ఫోన్లు,సెట్ టాప్ బాక్సులు, ఇతర ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ ద్వారా ఒకే చోట 25 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందం చేసుకున్నామన్నారు.
ఎంతో కష్టపడి టిడిపి ప్రభుత్వం తెచ్చిన రిలయన్స్ పరిశ్రమ భూములు వెనక్కిచ్చి మరీ వెళ్లిపోతుంటే, ఏపీ సర్కారు ఏం చేస్తోందని లోకేష్ ప్రశ్నించారు. అమెరికాకి చెందిన ట్రైటాన్ కంపెనీ వేల కోట్లతో ఏపీలో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు ఎంవోయూ చేసుకుందని తెలిపారు.
ఇప్పుడు అదే ట్రైటాన్ తెలంగాణకి తరలిపోవడంపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని లోకేష్ నిలదీశారు.
ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన జగన్రెడ్డి, సీఎం అయ్యాక రెండేళ్లపాటు ఆ మాటే మరిచిపోయి, తాజాగా గ్రూప్ 1కింద 36 ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు 400 వేసి నిరుద్యోగుల్ని నిండా ముంచేశారని ఆరోపించారు.
ఇప్పుడు పెద్దపెద్ద కంపెనీలను తరిమేస్తూ ఏపీ యువతకు ప్రైవేటు ఉద్యోగాలు కూడా దక్కకుండా ఉపాధిని దూరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ రంగంలో కూడా 75 శాతం మంది స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పిస్తామని జీవో కూడా తెచ్చిన సీఎం జగన్రెడ్డి, లక్షలాది మంది నిరుద్యోగులకు జగన్ సొంత బ్రాండ్ ప్రెసిడెంట్ మెడల్ విస్కీ అమ్మే సేల్స్ మేన్ ఉద్యోగాలిస్తారా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయక, వేలాది ఉద్యోగాలు కల్పించే ప్రైవేట్ పరిశ్రమల్ని తరిమేస్తోన్న జగన్రెడ్డి ప్రభుత్వం ఏపీ యువతకి ఉపాధి అవకాశాలన్నీ దూరం చేస్తోందన్నారు.