– రాఘవ శర్మ
‘అర్బన్ నక్సలైట్లు’ అన్న పదం వింటున్నాం. ఇప్పడు మళ్ళీ కొత్తగా ‘సాహిత్య నక్సలైట్లు’ అన్న పదం వినిపిస్తూ ఉంది.
గుజరాత్ సాహిత్య అకాడమీ చైర్మన్ విష్ణుపాండ్యన్ ఈ పదాన్ని ఇప్పుడు లోకం పైకి వదిలారు.
కరోనాతో మృతి చెందిన వారి శవాలకు దహన సంస్కారాలు చేసే దిక్కులేక, గంగానదిలో తెప్పలుగా తేలాడుతూ కొట్టుకు పోతున్నాయి. ఈ విషాదాన్ని చూసి చలించిపోయిన గుజరాతీ కవయిత్రి పారుల్ ఖఖ్కర్ మే 11 న ‘శవగంగా వాహిని’ అన్న కవితను రాసి ఫేస్ బుక్ లో పెట్టారు. (ఇపుడు ఆమె ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్టులేవీ కనిపించడం లేదు.)
అది వైరల్ అయ్యింది. అంతేకాదు, భూకంపం సృష్టించింది.
మోడీ పాలనను రామరాజ్యం అని ఈ కవిత లో సంబోధించారు.ఆయనను నగ్నచక్రవర్తిగా అభివర్ణించారు. మోడీపైన ఇదొక బలమైన వ్యంగ్యాస్త్రం.ఈ వ్యంగ్యాన్ని కొందరు భరించలేకపోయారు.సోషల్ మీడియాలో ఆమె మీద దాడి ప్రారభించారు. ఈ కవిత అచ్చయిన 48 గంటల్లో ఆమెని దూషిస్తూ, శాపనార్థాలు పెడుతూ 28 వేల కామెంట్లు వచ్చాయి.
ఈ కవిత అనేక భారతీయ భాషల్లోకి అనువాదమై, దేశమంతా మారుమోగి, ప్రజలను ఆలోచింప చేసింది. తెలుగులో కూడా అనువాదమై, టీవీల్లో, సామాజికి మాధ్యమాల్లో దృశ్యరూపంలో దర్శనమిచ్చింది. ఈ మధ్యకాలంలో ప్రజలను ఇంతగా ఆలోచింప చేసిన మరొక కవిత లేదు.
గుజరాతీ భాషలో పారుల్ ఖఖ్కర్ ప్రసిద్ధ కవయిత్రి. సాధారణ గృహిణి. తీరికసమయంలో కవితలల్లడం అలవాటు. రాధాకృష్ణుల ప్రణయాన్ని కవితా మయం చేసిన సంప్రదాయ కవయిత్రి ఆమె .మొన్నీ మధ్యవరకు బీజేపీని, మోడీని ఆమె సమర్థించారు.2014లో బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చినపుడు ఆమె హర్షం వ్యక్తం చేశారు.
అలాంటి పారుల్ ఖఖ్కర్ కూడా కోవిడ్ మరణాలను, గంగానదిలో శవాలు కొట్టుకుపోవడం చూసి చలించిపోయి ఈ కవిత రాశారు.
గంగలో కొట్టుకు పోతున్న శవాల తోపాటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ పరువు కూడా గంగలో కొట్టుకు పోయేలా చేసింది ఆమె గుజరాతీ కవిత.
ఈ నష్ట నివారణ కోసం గుజరాత్ సాహిత్య అకాడమీ చైర్మన్ విష్ణుపాండ్యన్ నడుం బిగిం చారు. పనిలో పనిగా ఎదురు దాడికి కూడా దిగారు.
గుజరాత్ సాహిత్య అకాడమీ అధికార పత్రిక ‘శబ్ద సృష్టి’ జాన్ నెల సంపాదకీయంలో దీనిపై రాశారు. పారుల్ ఖఖ్కడ్ రాసిన కవితను ఉటంకించకుండానే, ఈ కవితను ప్రచారం చేసే వారు, దీని గురించి చర్చించే వారు సాహిత్య నక్సలైట్లు అని, అరాచకవాదులని దుమ్మెత్తి పోశారు. ఈ కవిత అర్థంలేని ఆత్రుత అని వ్యాఖ్యానించారు.
కేంద్రప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వ జాతీయవాదాన్ని వ్యతిరేకించే శక్తులు ఈ కవితను దుర్వినియోగం చేస్తున్నాయని ఆ సంపాదకీయంలో దుయ్యబట్టారు. అలాంటి శక్తులు ఆ కవిత భుజంపైన తుపాకీ పెట్టి పేల్చాలని కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
వీరు భారత దేశానికి బద్దులైన వారు కాదన్నారు. వీరంతా వామపక్షవాదులు, ఉదారవాదులు అని ఆరోపించారు. ఇలాంటి నినాదాలు దేశం నలుమూలలా ప్రచారంచేసి, అరాచకాన్ని సృష్టించాలనుకుంటున్నారని పేర్కొన్నారు.
వీరు అన్ని రంగాలలోకి చొచ్చుకుపోయారని, అలాగే దురుద్దేశ్యంతో సాహిత్య రంగంలోకి కూడా చొరబడ్డారని వ్యాఖ్యానించారు. తమ సంతోష విషాదాలను ఈ కవితలో చూసుకునే ప్రజలను ఈ ‘సాహిత్య నక్సలైట్లు’ ప్రభావితం చేయచూస్తున్నారని ఆరోపించారు.
మోడీ ప్రభుత్వం గురించి విమర్శనాత్మకంగా ఆలోచించేవారిని ‘అర్భన్ నక్సల్స్’ అని సంఘపరివార శక్తులు సంభోదించడం చూస్తున్నాము.
‘అర్బన్ నక్సలైట్లు’ అన్న పదం నుంచే ఇప్పుడు ‘సాహిత్య నక్సలైట్లు’ అన్న పదాన్ని కూడా వీరు ఉపయోగి స్తున్నారు.
‘సాహిత్య నక్సలైట్లు ‘ అన్న పదం ఇప్పుడు కొత్తగా అనిపిస్తున్నా, అర్ధ శతాబ్దం క్రితమే దీన్ని వాడారు .
విప్లవ రచయితల సంఘం 1970 లో ఏర్పడినప్పుడు నోరి నరసింహ శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ ఈ పదాన్ని ఉపయోగించారు.
‘గుజరాత్ కవిత్వానికి కాబోయే అతి పెద్ద చిహ్నం పారుల్ ఖక్కర్ ‘ అని గతం లో అభినందించిన సాహిత్య అకాడమీ చైర్మన్ విష్ణుపాండ్యన్‌కు ఇప్పడు ఆమె రాసిన కవిత మింగుడు పడడం లేదు.
విష్ణుపాండ్యన్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రతినిధితో మాట్లాడుతూ “శవగంగా వాహిని లో కవిత్వ సారాంశం ఏమీ లేదు. కవిత్వాన్ని దిగజార్చడమే. ఒకరి ఆగ్రహాన్ని, నిరాశను పునర్లిఖించడమే. మోడీ వ్యతిరేకులు, బీజేపీ వ్యతిరేకులు, ఆర్ ఎస్ ఎస్ వ్యతిరేకులు ఈ కవితను దుర్వనియోగం చేస్తున్నారు. ఖక్కర్‌పైన నాకు వ్యక్తిగత కోపం ఏమీ లేదు. ఇదసలు కవితే కాదు. సమాజాన్ని విచ్చిన్నం చేయడానికి కొన్ని శక్తులు ఈ కవితను ఒక ఆయుధంగా ఉపయోగించుకుటున్నాయి ” అని వాపోయారు.
విష్ణుపాండ్యన్ ఆర్ ఎస్ ఎస్‌తో, దాని అధికార పత్రిక సాధనతోను కలిసి ప్రయాణం చేస్తున్నారు. నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక విష్ణుపాండ్యన్‌కు పద్మశ్రీ అవార్డు కూడా దక్కింది.