(వి శంకరయ్య)
రాష్ట్రంలో పదవ తరగతి ఇంటర్ విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహించుతామని విద్యా శాఖ మంత్రి చేత చెప్పి స్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాస్తవంలో తనకు తాను పరీక్షలు పెట్టుకోబోతున్నారా?రాజకీయ పంతానికి బోయి తత్ఫలితంగా జరగ బోయే నష్ట కష్టాలు అపవాదులు ఎదుర్కొనేందుకు సిద్ధ పడుతున్నారా? అనే చర్చ రాష్ట్రంలో సాగుతోంది.
టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నందున క్షేత్రస్థాయి పరిస్థితులు వాయిదా వేసేందుకు అనువుగా వున్నా రాజకీయ ప్రతిష్టకు పోయి అందుకు సిద్ధం కావడం లేదనే చర్చ కూడా సాగుతోంది. ఆఖరుగా ఈ అంశం న్యాయ స్థానం మెట్లెక్కినా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరీక్షలు తాత్కాలికంగా వాయిదా వేసుకుంటూ పోతోంది. తరచుగా విద్యాశాఖ మంత్రి జూలై నెలలో పరీక్షలు నిర్వహించుతామని చెబుతున్నారు .
ఇతర రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం పరీక్షలు రద్దు చేస్తున్నా వారు చేశారని తామెందుకు రద్దు చేయాలని కూడా సవాలు చేస్తున్నారు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షలకు సిద్ధంగా వున్నారని కూడా మంత్రి చెప్పడంపై ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నారు. పరీక్షల అంశం రాజకీయ సుడిగుండంలో చేర్చి తమను ఇందులోనికి ఎందుకు లాగుతున్నారని వాపోతున్నారు. విపత్కర పరిస్థితిలో పరీక్షలు జరిగితే పసి పిల్లలతో పాటు ఉపాధ్యాయులు కరోనా రక్కసి కోరల్లో చిక్కుకోక తప్పదు. ఇందులో మరి కొన్ని చిక్కులున్నాయి. కరోనా నిబంధనలు ప్రధానంగా భౌతిక దూరం విద్యార్థులు పాటించుతారని కూడా ఊహించ లేము. ఈ పాటికే పలు పాఠశాలు కోవిడ్ కేంద్రాలుగా ఉపయోగించి వున్నారు. ఇవన్నీ విస్మరించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ తన ప్రసంగాల్లో తరచూ టిడిపి నేత లోకేష్ ప్రస్తావన తేవడం తుదకు తన వాదనను సమర్థించుకొనేందు తాము పరీక్షలకు అనుకూలంగా వున్నట్లు చెప్పడం అసంగతంగా వుందని విద్యార్థుల తలిదండ్రులు వాపోతున్నారు. టిడిపి నేత లోకేష్ డిమాండ్ చేశారు కాబట్టి పరీక్షలు రద్దు చేస్తే వారికి రాజకీయంగా మైలేజి వస్తుందని అంతిమంగా తమను తమ పిల్లలను బలి పశువులు చేయడం ఎంతవరకు సమంజసమని మథన పడుతున్నారు.
విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు ఆవేదనకు ప్రాతిపదిక లేక పోలేదు. ఆంధ్ర ప్రదేశ్ చుట్టు పక్కల వుండే అన్ని రాష్ట్రాలు పరీక్షలను వాయిదా కాకుండా రద్దు చేశాయి. తెలంగాణ అయితే పదవ తరగతి విద్యార్థులకు గ్రేడ్ లు కూడా ఇచ్చింది. ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థుల పరీక్షలు కూడా రద్దు చేసింది. ఫలితంగా విద్యార్థులు ఆన్ లైన్ లో క్లాస్ లకు హాజరు అవుతున్నారు. నైపుణ్యం పోతుందనే పేరుతో ఎపి విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం త్రిశంఖు స్వర్గంలో వుంచుతోంది.
తాజాగా తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఇంటర్ పరీక్షలను కూడా రద్దు చేశాయి. కేంద్ర ప్రభుత్వం సిబియస్ఇ పరీక్షలను ఎప్పుడో రద్దు చేసింది. ఊరందరిదీ ఒక దారి అయితే ఎపిది మరొక దారిగా వుంది. ఇదంతా పరిశీలిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర మనథం భవిష్యత్తులో వైకాపాకు మైనస్ తప్ప ప్లస్ చేకూర్చదు.
ఇదిలా వుండగా కరోనా మూడవ వేవ్ వస్తుందని ఈ దశలో పిల్లలు హై రిస్క్ లో వుంటారని ఇందుకు ఏర్పాటు చేయబడిన టాస్క్ ఫోర్స్ కమిటీ నివేదిక ఇవ్వడం తలిదండ్రులను మరీ నిద్ర లేని రాత్రులకు గురి చేస్తోంది.
ప్రస్తుతం క్షేత్ర స్థాయి పరిస్థితి చూస్తే భయంకరంగా వుంది. రాష్ట్రంలో నమోదు అవుతున్న కేసుల్లో 50 శాతానికి పైగా నాలుగు జిల్లాల్లో వుంటున్నాయి. రాష్ట్రంలో కేసులు తగ్గినా మరణాలు తగ్గ లేదు. కరోనా తొలి వేవ్ తర్వాత రెండవ వేవ్ వస్తుందని నిపుణుల నివేదికలు వచ్చినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా వైరస్ ను ఎదుర్కొనేందుకు అనువైన చర్యలు చేపట్టలేదనే విమర్శల మధ్యనే దేశంలో లక్షలాది మంది కరోనా వైరస్ బారిన పడి కడ తేరారు. ఆఖరికి శ్మశానాల వద్ద క్యూ ఏర్పడింది.
ఈ నేపథ్యంలో మూడవ వేవ్ రాబోతోందని చిన్న పిల్లలు టార్గెట్ కాబోతారని శాస్త్రవేత్తలతో పాటు ఆయా రాష్ట్రాల అధికారుల ప్రకటనలు అందర్నీ ఆందోళనకు గురి చేస్తున్నవి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్ మూడవ వేవ్ వస్తే ప్రధానంగా చిన్న పిల్లలే హైరిస్క్ గ్రూపులో వుంటారని టాస్క్ ఫోర్స్ కమిటీ నివేదికను వివరించారు. అందుకు అనుగుణంగా ఆసుపత్రుల్లో పడకలు ఆక్సిజన్ ఐసియు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
దురదృష్ట మేమంటే అదే రోజున విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ జూలై నెలలో కరోనా తగ్గుముఖం చూచుకొని ఇంటర్ పదవ తరగతి పరీక్షలు నిర్వహించుతామని ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి తను ప్రకటన చేసే ముందు వైద్య ఆరోగ్య శాఖ తో సంప్రదింపులు చేసినట్లులేదు. విద్యాశాఖ మంత్రికి టీడీపీ నేత డిమాండ్ ఒక్కటే గుర్తు వున్నట్లుంది. టిడిపి నేత డిమాండ్ కు వ్యతిరేకంగా మాట్లాడి ముఖ్యమంత్రి వద్ద మార్కులు కొట్టేయాలనే ధ్యాస తప్ప మరొకటి లేదనిపిస్తోంది. అందుకే ఒకే రోజు భిన్న స్వరాలు వినిపించాయి.
రాబోయేది మరీ గడ్డు కాలం. పసి పిల్లల వ్యవహారం. ఈ అంశంలో తప్పటడుగులు వేస్తే జాతి కోల్పోయే మూల్యం అటుంచి ముఖ్యమంత్రి అపకీర్తి మూట గట్టుకోవలసి వుంటుంది
(వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013)