(బివి మూర్తి)
ఉదయం తెలుగు దినపత్రిక మొదటి బ్యాచ్ లోని జర్నలిస్టుగా చెప్పుడాకోనికి నేనెప్పుడూ గర్వపడుతుంటాను. తెలుగు పత్రికారంగ చరిత్రలోని ఒకానొక కీలక ఘట్టంలో తాను ఆవిష్కరించబోయే పెనుమార్పుల సరికొత్త పంథా కోసం ఏబికె ప్రసాద్ స్వయంగా తీర్చిదిద్దుకున్న కలం యోధుల గణం, ఉదయం మొదటి బ్యాచ్.
యాజమాన్యాలకు వంగి వంగి సలాములు చేసే గులాముగా ఇరుకిరుకు బతుకు ఇష్టం లేక అప్పటికే ఎడిటర్ పోస్టును కనీసం రెండు సార్లు ఎడం కాలితో తన్నేసిన రాజీ ఎరుగని పోరాటశీలి ఏబికె.
ఏబికె అంటే మొబైల్ ఎన్ సైక్లోపీడియా. అడిగినదే తడవుగా అరచేతిలో సమాచారంతో ప్రత్యక్షమైపోయే గూగుల్ తల్లి అజాపజా కూడా ఇంకా ఎరుగని ఆ కాలంలోనే ఎన్ సైక్లోపీడియాలో ఉండని అంశాలు కూడా ఆయన బుర్రలో నిక్షిప్తమై ఉండేవి. ఎన్ సైక్లోపీడియాకు అభిప్రాయాలుండవు. ఏబికెకు సమాజంలోని అన్ని అంశాలపైన స్పష్టమైన అవగాహన, కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. అన్నమయ్య కీర్తనల్లోని మారు మూల అచ్చతెనుగు పదాల అందాలతో మొదలుకొని అన్నాకెరినీనాలోని సామాజికాంశాల దాకా ఏ విషయంపై అయినా అనర్గళంగా పేజీలకు పేజీలు రాసెయ్యగలరాయన. మౌలికంగా ఆయన కమ్యూనిస్టు కావచ్చునేమో గానీ వాళ్లలోని మూర్ఖత్వం మాత్రం ఈయనలో మచ్చుకైనా కనిపించదు. కొత్తదయినా పాతదయినా ఏ పత్రిక పగ్గాలు చేతికొచ్చినా అప్పటికప్పుడు తనదైన శైలిలో అటూఇటూ మార్పులూ చేర్పులూ చేసేసి, అనితరసాధ్యమైన తన ముద్ర కొట్టొచ్చినట్టు కనిపించేలా చేసి, ఇప్పుడీ పత్రిక ఏంటో బాగున్నట్టుందే అని పాఠకులకు అనిపించడం ఆరంభించి, వారం పదిరోజుల్లో డిమాండు తారాస్థాయికి చేరేట్టు చేసెయ్యగల జర్నలిస్టు మహామాంత్రికుడు ఏబికె.
1984 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో డిసెంబర్ 31న ఉదయం తొలిసంచిక వెలువడింది. `ఎర్రకోటలో రాజీవ్ పాగా, వన్నె తగ్గని తెలుగు దేశాధినేత’ ఇదీ ఉదయం తొలిసంచిక బ్యానర్ హెడింగ్. ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పై సానుభూతి ప్రభంజనంలో ప్రతిపక్షాలన్నీ దూదిపింజల్లా కొట్టుకుపోయాయి. మొత్తం 514 స్థానాల్లో కాంగ్రెస్ కు 414 సీట్లు. అంతటి ప్రభంజనంలోనూ కాంగ్రెస్ కు ఎదురొడ్డి నిలబడగలిగింది ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. 30 సీట్లతో తెలుగుదేశం దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతిపక్షం అర్హత సాధించిన ప్రాంతీయ పార్టీగా ఘనత పొందింది.
ఆ రోజు డెస్కులో హడావుడి అంతా ఇంతా కాదు. అంతక్రితం దాదాపు ఏడాది నుంచి జర్నలిజం ట్రెయినింగ్ కాలేజ్ లో కాపీల మీద కాపీలు ట్రాన్స్ లేట్ చెయ్యడమూ, మఫుజుల్ కాపీలు సరిచెయ్యడమూ, తిరగరాయడమూ రోజూ జరుగుతున్న తతంగమే కానీ ఈ రోజు కథ వేరు. తపము ఫలించిన శుభవేళ. మనం రాసిన కాపీలు పేజీల్లో స్థలం కోసం పోటీ పడి, పేజీల్లో కెక్కి, పేపర్ గా ప్రింటయి, జనం లోకి వెళ్లే వేళ. మన కాపీలను, రాత పైత్యాలను వేలాది మంది మన ఉదయం పాఠకులు చదివి మెచ్చుకునే శుభవేళ. ఆ రోజున మా ఉత్సాహం, ఉత్కంఠకు ఆకాశమే హద్దు. సాయంత్రంలోగా ఎన్నెన్ని సముద్రాల టీలు తాగేమో, ఎన్నెన్ని ఛామ్స్ కింగ్ సైజ్ సిగరెట్ డబుల్ ప్యాక్ కట్టల్ని పీల్చి పిప్పి చేసి ఎంతెంత విస్తృతమైన పొగమేఘాలు సృష్టించామో మాకే తెలీదు. హైదరాబాద్ డెస్కులో నేనూ, అయోధ్యారెడ్డి, గుడిహాళం రఘునాథం, శ్రీనివాస్ (ఊరువాడ?), సరిగొండ రవీంద్ర నాథ్, టిఎన్ వి రమణ, స్పోర్ట్స్ ఆంజనేయులు వగైరాలు సబ్బెడిటర్లం. మాగంటి కోటేశ్వర రావు, సత్యనారాయణ చీఫ్ సబ్ లు. (వసంతలక్ష్మి, జగన్ (అన్నట్టు ఈ జగన్ పూర్తి పేరు జగన్నాథ బాబు అనుకుంటా. సోడాబుడ్డి కళ్లజోడు. బహుశ తెలంగాణా ప్రాంతం కావచ్చు.) తర్వాత వచ్చి చేరినట్టు గుర్తు.). పతంజలి న్యూసెడిటరు.
సినీ దిగ్గజం దాసరి నారాయణరావు చిరకాల స్వప్నం ఉదయం తెలుగు దినపత్రిక ఆరంభమయ్యేసరికే `ఖాకీ వనం’ నవలా రచయితగా తెలుగు సాహిత్యరంగంలో పతంజలి సుప్రసిద్ధుడు.
తెలుగు పత్రికారంగ చరిత్రలో ఉదయం దినపత్రికకు ఓ ప్రత్యేక అధ్యాయం కేటాయించక తప్పదు. అప్పట్లో కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ తానే అయి అలవోకగా ఏడాదికి ఏడెనిమిది సినిమాలు తీసేస్తూ, సినిమాల ఫ్యాక్టరీగా పేరు పొందిన దాసరి నారాయణరావు ఆరంభించిన ఉదయం పత్రికకు చాలా ప్రత్యేకతలున్నాయి. తెలుగు పత్రికల్లో అప్పుడదో సాంకేతిక విప్లవం. దానికి మూలకారణం ఎడిటర్ ఏబికె ప్రసాద్. ఉదయం కోసం జర్మనీ నుంచి హారిస్ గ్రాఫిక్స్ ప్రింటింగ్ మెషిన్ లను దిగుమతి చేసుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని ఉదయం ఆఫీస్ లో 1984 డిసెంబర్ లో హైదారాబాద్ ఎడిషన్ ట్రయల్ రన్ జరుగుతున్నప్పుడు ఓ రోజు ఏబికె మమ్మల్నందరినీ ప్రింటింగ్ మెషీన్ దగ్గరకు తీసుకెళ్లి పార్టు పార్టు చూపించి దాని గొప్పతనం గురించీ సామర్థ్యం గురించీ ఉత్సాహంగా వివరించి చెప్పారు. ఒకే దెబ్బతో ఫోటో కంపోజింగ్, నెగటివ్/పాజిటివ్ ప్లేట్ మేకింగ్ తెచ్చేసుకుని, అత్యద్భుతమైన ప్రింటింగ్ క్వాలిటీతో ‘ఈనాడు`కు దిమ్మ తిరిగేలా హైదరాబాద్, విజయవాడ ఎడిషన్లతో ఒకేసారి భళ్లున విస్ఫోటించింది ఉదయం. చూడగానే ఆకర్షించే ప్రింటింగ్ అందచందాలు అటుంచితే మాస్ట్ హెడ్ మొదలుకుని పేజీపేజీలోనూ ప్రతి కాలంలో ఏబికె తీసుకొచ్చిన కొత్తదనం ముద్ర.
తెలుగు పత్రికల సర్క్యులేషన్, రీడర్ షిప్ ఉన్నట్టుండి ఇబ్బడిముబ్బడిగా పెరిగి వ్యాపార పరిధి ఊహించలేని స్థాయిలో విస్తరించిన అద్భుత ఘట్టాలు రెండు ప్రముఖంగా కనిపిస్తాయి. మొదటి ఘట్టం 1975 తర్వాత రామోజీరావు సారథ్యంలోని ఈనాడు, హైదరాబాద్, విజయవాడ ఎడిషన్ లకు విస్తరించడం. రెండు ఎన్టీరామారావు 1982లో రాజకీయరంగ ప్రవేశం చేయడం. సోపూ, టూత్ పేస్టుల్లాగా భారీ అడ్వర్టైజ్ మెంట్లతో అదరగొట్టి ఆకర్షణీయం చేసి న్యూస్ పేపర్లను జనానికి అమ్మడం బహుశ పత్రికారంగంలోకి రామోజీ రాకతోనే ఆరంభమయ్యుండాలి. ఓ అందమైన అమ్మాయి ఇంటి ముంగిట ముగ్గు పెడుతుండగా సైకిల్ పై వచ్చే పేపర్ కుర్రాడు ఈనాడుని గుమ్మంలోకి విసిరేయడం తాలూకు యాడ్ ని అనంతపురం శాంతి థియేటర్ లో అందరితో పాటు నేనూ కళ్లప్పగించి చూసేవాణ్ని. 1982లో ఈనాడు తిరుపతి ఎడిషన్ ఆరంభానికి ముందు వచ్చిన ఈ యాడ్ ఒక ఎత్తయితే, ఖాకీ ప్యాంటూ షర్టూ వేసుకుని సరికొత్త రాజకీయ అవతారంలో, ప్రత్యేకంగా తయారు చేయించుకున్న చైతన్య రథంలో ఆంధ్రరాష్ట్రం నలుచెరగులా తిరుగుతూ ఊరి బయట చెరువుకట్ట దగ్గర బట్టలుతికి ఆరేసుకుంటున్న, లేక వీధి కొళాయి దగ్గర టవలు కట్టుకుని స్నానం చేస్తున్న ఎన్టీవోడి (ఈ ఎన్టీవోడు అనే మాట పతంజలి వల్ల నాకు అలవాటైంది. ఆయనా, దాట్ల (నారాయణ రాజు) రేలంగిని రేలంగోడు అని కూడా అనేవారు.) ఫోటోలను ఫస్టు పేజీలో పెద్దగా వేయడం ఇంకో ఎత్తు. మొత్తమ్మీద ఈనాడు తిరుపతి ఎడిషన్ సూపర్ డూపర్ హిట్టు.
ఉదయం ఆరంభమయ్యేసరికే ఈనాడు సర్క్యులేషన్ దాదాపు 3 లక్షలు. ఈనాడు కంటే ఎంతో ముందుగానే మూడు ఎడిషన్ లతో (హైదరాబాద్, విజయవాడ, బెంగుళూరు) నడుస్తుండిన `ఆంధ్రప్రభ’ దినపత్రిక సంఖ్యాబలం లక్షకు లోపే. అయితే మొత్తం 90వేల ప్రింట్ ఆర్డర్ తో హైదరాబాద్, విజయవాడల నుంచి ఒకేసారి ఆరంభమైన ఉదయం, నెల రోజులు కూడా తిరగకముందే సర్క్యులేషన్ 2 లక్షలు దాటిపోయింది. కేవలం హైదరాబాద్ నగరంలోనే 40వేలకు పైగా కాపీలు అమ్ముడవడం అప్పట్లో పెద్ద సంచలనం. పత్రికారంగంలోకి వచ్చీరాగానే తిరుగులేని ఆధిపత్యం సాధించిన రామోజీరావుకు మొట్ట మొదటిసారి ముచ్చెమటలు పోయించిన ఘనత ఉదయం పత్రికదే. దూరాభారం ఎక్కువ కావడం వల్ల మా అనంతపురం జిల్లాలో, కడపలో కొన్ని ప్రాంతాలకు ఉదయం వచ్చి చేరేసరికి సాయంత్రమైపోయేది. అయినా పత్రికకు జనాదరణ నానాటికీ అధికమవసాగింది. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వంపై చండ్రనిప్పులు కురిసిన ఈనాడు, ఉన్నట్టుండి ముఖ్యమంత్రి, తెలుగుదేశాధీశునికి భజనపార్టీగా మారిపోయేసరికి, తప్పొప్పులు ఎత్తి చూపడంలో ఎవ్వరినీ, ఏ పార్టీని ఉపేక్షించని, నిష్పాక్షికమైన ప్రజల గొంతుకగా వినిపించిన, సరికొత్తగా కనిపించిన ఉదయం అన్ని వర్గాల తెలుగు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.
1985 మార్చిలో `ఇండియా టుడే’ రిపోర్టర్ అమర్ నాథ్ మీనన్ తో మాట్లాడిన సందర్భంలో ఉదయం పత్రిక జనంలోకి చొచ్చుకుపోవడానికీ, అనతికాలంలోనే (ఆరంభమైన రెండు నెలల్లోనే) సర్క్యులేషన్ అనూహ్యంగా పెరగడానికీ వ్యక్తిగతంగా తనకున్న స్టార్ (సిన్మా) ఇమేజీ కారణమని దాసరి నారాయణ రావు చెప్పుకొన్నారు. ఇది కొంతవరకు నిజమే కావచ్చు. అయితే ఉదయం సక్సెస్ స్టోరీలో ఏబికె సారథ్యంలోని ఎడిటోరియల్ టీమ్ పాత్ర తక్కువేమీ కాదు.
ఏబికె టీమ్ కేంద్రక వలయంలో వాసుదేవ రావు, పతంజలి, రామచంద్ర మూర్తి, కార్టూనిస్ట్ మోహన్, ఆయన తమ్ముడు ప్రకాష్, దేవీప్రియ (రన్నింగ్ కామెంటరీ), మహమ్మద్ గౌస్, పర్చూరు కోటీశ్వరరావు తదితరులుండే వారు. పాత్రికేయులుగా వీళ్లంతా అనుభవజ్ఞులూ, హేమాహేమీలే. ఈనాడు, ఆంధ్రప్రభల్లో ఏదో ఒక చోట ఏబికెతో కలిసి పనిచేయడం మరో ప్రత్యేక అర్హత.
ఇక ఏబికె అంటేనా, ఆయనో మొబైల్ ఎన్ సైక్లోపీడియా. ఎన్ సైక్లోపీడియాలో ఉండని అంశాలు కూడా ఆయన బుర్రలో నిక్షిప్తమై ఉండేవి. ఎన్ సైక్లోపీడియాకు అభిప్రాయాలుండవు. ఏబికెకు సమాజంలోని అన్ని అంశాలపైన స్పష్టమైన అవగాహన, కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. అన్నమయ్య కీర్తనల్లోని మారు మూల అచ్చతెనుగు పదాల అందాలతో మొదలుకొని అన్నాకెరినీనాలోని సామాజికాంశాల దాకా ఏ విషయంపై అయినా అనర్గళంగా పేజీలకు పేజీలు రాసెయ్యగలరాయన. మౌలికంగా ఆయన కమ్యూనిస్టు కావచ్చునేమో గానీ వాళ్లలోని మూర్ఖత్వం మాత్రం ఈయనలో మచ్చుకైనా కనిపించదు. కొత్తదయినా పాతదయినా ఏ పత్రిక పగ్గాలు చేతికొచ్చినా అప్పటికప్పుడు తనదైన శైలిలో అటూఇటూ మార్పులూ చేర్పులూ చేసేసి, అనితరసాధ్యమైన తన ముద్ర కొట్టొచ్చినట్టు కనిపించేలా చేసి, ఇప్పుడీ పత్రిక ఏంటో బాగున్నట్టుందే అని పాఠకులకు అనిపించడం ఆరంభించి, వారం పదిరోజుల్లో డిమాండు తారాస్థాయికి చేరేట్టు చేసెయ్యగల జర్నలిస్టు మహామాంత్రికుడు ఏబికె.
ఏబికె సారథ్యంలోని ఉదయం తెలుగునాట ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఓ కొత్త వరవడి సృష్టించింది. సరికొత్త ప్రమాణాలు నెలకొల్పింది. కరీంనగర్ జిల్లాలో ఆకలిచావులు, కారంచేడు దళితుల ఊచకోతలపై ఉదయం బైటపెట్టిన నిజాలు భూకంపం పుట్టించాయి. ఉదయం హైదరాబాద్ ఆఫీసుకు (దాసరి) బాబాయ్ వల్ల సిన్మా తారల తాకిడీ, ఏబికె వల్ల కమ్యూనిస్టుల తాకిడి కాస్త ఎక్కువగానే ఉండేది (జర్నలిజం శిక్షణాతరగతుల ఆరంభం రోజున గగన్ మహల్ కాలనీలోని అప్పటి తాత్కాలిక కార్యాలయానికి ప్రత్యేకంగా వేంచేసి దాదాపు పాతిక మంది కుర్రకారు ట్రెయినీలకు తనను తాను పరిచయం చేసుకున్న దాసరి నారాయణ రావు, “నిన్నటి దాకా మీరెవరో, నేనెవరో. ఇవ్వాళ్టినుంచి మాత్రం మనమంతా ఒకే కుటుంబం. మనది `ఉదయం కుటుంబం’’ అని సినీ ఫక్కీలో చెప్పేసరికి ఆ కొంటెకోణంగి కుర్ర ట్రెయినీలం ఆ రోజు నుంచి మాలో మేం ఆయన్ని బాబాయ్ అని పిల్చుకోవడం మొదలెట్టాం.) ఉదయం ఆఫీసుకు వీరశైవ కమ్యూనిస్టుల (నక్సలైట్లకిది అప్పట్లో ముద్దుపేరు. ఉదయం సర్కిల్లో వీళ్లని మల్లులని కూడా అనేవాళ్లం. మల్లులంటే మలయాళీలని పొరబడకూడదు. సిపిఐఎంఎల్ లో ఎంఎల్ ని విడదీసి మల్లలని కూర్చడం అన్నమాట) రాకపోకలు కూడా ఎక్కువే. పీపుల్స్ వార్ అధినేత కొండపల్లి సీతారామయ్య ఇంటర్వ్యూని ఉదయం ప్రచురించినప్పుడు అదింకో సంచలనమైంది.
పైన పేర్కొన్న అమర్ నాథ్ మీనన్ ఇంటర్వ్యూ ప్రకారమే 1985 మార్చి నాటికి ఉదయం సర్క్యులేషన్ 2.24 లక్షలు. పాఠకుల్లో ఉదయం సాధించిన జనప్రియతకు ఇది తిరుగులేని నిదర్శనం.
తెలుగు పత్రికారంగంలో సాంకేతిక విప్లవానికి తెరతీసిన, ఎన్నో రీతులుగా సంచలనాలు సృష్టించిన, ఓ పత్రిక గుత్తాధిపత్యాన్ని తొడగొట్టి సవాలు చేసిన ఉదయం అత్యంత దయనీయమైన రీతిలో మూత పడటం ఒక గొప్ప చారిత్రక విషాదం. చాలా మంది జర్నలిస్టు మిత్రులకు కడుపు మండించిన సంఘటన. నాకు తెలిసి తెలుగునాట పాత్రికేయుల ఉద్యోగ పరిస్థితులు కొంతలో కొంత బాగు పడటం ప్రారంభమైంది కూడా ఉదయంతోనే.
ఉదయం పుట్టి పెరిగి కనుమరుగైన నాటి కాలంలో పత్రికలకు న్యూస్ ప్రింట్ కోటా అనివార్యం. ఆక్సిజన్ సిలిండర్ లాంటిది. యాజమాన్యం అనుభవ రాహిత్యం వల్ల న్యూస్ ప్రింట్ కోటా లేకుండానే ఉదయం మార్కెట్లోకి వచ్చింది. నెలకు సరిపడా, వారానికి సరిపడా, ఒక్కోసారి ఏ రోజు కా రోజు న్యూస్ ప్రింట్ ను బ్లాక్ లో కొనుక్కోడం కాలం గడిచే కొద్దీ పెద్ద ప్రతిబంధకం గా తయారైంది. అప్పట్లో మాకు పర్సనల్ ఆఫీసర్ గా ఉన్న ఓ యంగ్ అండ్ ఎనర్జిటిక్ కుర్రాడు, న్యూస్ ప్రింట్ కొనుగోలు ఇన్ ఛార్జ్ గా మారాక ఐదారు నెలల కాలంలోనే క్రమక్రమంగా స్కూటర్ నుంచి మోటారుసైకిల్ కు, అటుతర్వాత మారుతీ కారుకు మారిపోయి ఝంఝామ్మని ఆఫీసుకు వస్తుండటం మేమంతా కళ్లారా గమనిస్తూనే ఉండేవాళ్లం.
ఇలా న్యూస్ ప్రింట్ ను బ్లాక్ లో కొంటూ పేపర్ నడపడం వచ్చే కొద్దీ దుబారా వ్యవహారంగా, ఉదయం కున్న ఖరీదైన దౌర్బల్యంగా తయారైంది. అప్పట్లో స్థానికంగా వచ్చే చిన్న చిన్న దిన, వార, పక్షపత్రికలన్నీ ఉదయం ధాటికి క్రమక్రమంగా మూత పడటం ఆరంభమైంది. సదరు యాజమాన్యాలకు తమ తమ పత్రికలు నడుపుకోడం కంటే న్యూస్ ప్రింట్ కోటాను ఉదయం కు అమ్ముకోడమే మంచి లాభసాటిగా అనిపించింది.
వేరే పత్రికల ఆఫీసులెలా ఉండేవో అప్పట్లో మాకు తెలీదు గానీ మా ఉదయం ఆఫీసు మాత్రం కాస్త విచిత్రంగానే ఉండేది. మా బాబాయ్ రోజుకి నాలుగైదు సినిమాల షెడ్యూళ్లతో భోజనానికి, నిద్రకు కూడా సరిగ్గా సమయం దొరికేది కాదని అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులోని సిబ్బంది ఎప్పుడూ చెబుతుండేవారు. నెలలో ఎప్పుడో రెండు మూడు సార్లు ఆయన మా ఆఫీసుకి లైట్నింగ్ విజిట్ గా వచ్చి వెళుతుండేవారు. బాబాయ్ కి చాల కావలసిన వారని అంతా చెప్పుకునే దేవేశ్వర రావు అనే పెద్దాయన హైదరాబాద్ హెడ్డాఫీసులో మేనేజర్ లెవెల్లో ఉండేవారు. ఆయనెప్పుడూ తెల్ల ప్యాంటూ, తెల్ల షర్టూ వేసుకునే వారు. ఓ సారి అయ్యప్పమాల వేసుకున్నప్పుడు మాత్రం నల్ల ప్యాంటూ నల్ల షర్టుకు మారిపోయి, బైటకు కనిపించేలా రుద్రాక్షలు వేసుకుని ఆఫీసుకు వచ్చేవారు. అప్పుడప్పుడు దేవేశ్వరరావు గారి పెద్ద పెంపుడు కుక్క కూడా ఆయనతో పాటు వచ్చి మా ఆఫీసుని పావనం చేసేది. బాబాయ్ గారి సినిమాల్లో లాగే మా ఉదయం ఆఫీసులో కూడా చిత్రవిచిత్రమైన క్యారెక్టర్లుండేవారు.
(బివి మూర్తి, సీనియర్ జర్నలిస్టు, బెంగళూరు)