(ఆరికట్ల మల్లికార్జున రెడ్డి)
రైతు సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి, సమయం కేటాయించండి, చదవండి ,ఆలోచన చేయండి,
పదిమందితో చర్చించండి ,లాభమా నష్టమా ఆలోచన చేయండి.
చదువుకున్న రైతుబిడ్డ లారా, మీరు ఉద్యోగరీత్యా బయట ఉన్నా, మీ అన్నదమ్ములు వ్యవసాయం చేస్తూ ఉన్నా, మన భవిష్యత్ తరం వ్యవసాయం చేయాలంటే, అధిక ఉత్పత్తి సాధించే వంగడాలను పండించడానికి, కావలసిన పరిశోధన క్షేత్రం మనకు దగ్గరలో ఉన్న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా క్షేత్రం “RARS “దేశంలోనే ఆదర్శవంతమైనది. దీనిని కాపాాడుకోవాలి.
దేశంలో ఉన్నటువంటి ఎన్నో వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు తీసిపోని విధంగా ఎన్నో రకాలైన క్రొత్త వంగడాలను సృష్టించి రైతుకు అందుబాటులో ఉంచి రైతుల ప్రగతి పథంలో నడిపించడానికి అధిక ఉత్పత్తి సాధించడానికి రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచిన నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఈరోజు రైతుల ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది.
ఓ రైతన్నా, నీవు కష్టాల కడలిలో ఉన్నప్పుడు నేను నీకు అండగా నిలిచి నీకు మంచి విత్తనాలు ఇచ్చి అధిక ఉత్పత్తి సాధించి సగర్వంగా తల ఎత్తుకుని తిరిగే విధంగా నీకు ఆర్థికాభివృద్ధి కలిగించాను.
ఓ రైతన్నా, నీవు కరువు కాటకాలతో ఉన్నప్పుడు నీ పరిస్థితి అర్థం చేసుకొని పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త వంగడాలను నీకు అందించి నీ ఆకలి తీర్చే పంటలను నీకు అందించాను. నీ ఆకలి తీర్చాను
ఓ రైతన్నా, మనది కరువు సీమ ఈ ప్రాంతానికి అనుగుణంగా పండే పంటల మీద పరిశోధనలు చేసి మంచి దిగుబడి ఇచ్చే ప్రత్తి, మిరప, వరి, సెనగ, కొర్ర, జొన్న, లాంటి ఎన్నోరకాల విత్తనాలను నీకు అందించాను
ఓ రైతన్న విత్తనాలను అందించే క్రమంలో లో నీకు వ్యవసాయం చేసే వారసులుగా, రైతు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వ్యవసాయంలో కొత్త మెలుకువలు నేర్పించి, క్రొత్త వంగడాలను అందించి, నీ వారసులను ఎంతోమందిని విత్తన విక్రయదారులు గా తయారు కావడానికి అవకాశం కల్పించాను. ఆర్థికంగా ఎదగడానికి సహాయ పడ్డాను
ఓ రైతన్నా, అన్నమో రామచంద్రా అన్న నీకు (RARS) నేనున్నానని భరోసా కల్పించి క్లిష్ట పరిస్థితులలో నిన్ను ఆదుకొని అభివృద్ధి చెందడానికి నా వంతు బాధ్యతగా నేను (RARS) కృషి చేశాను.
ఓ రైతన్నా, మన ప్రాంతంలో ఒక స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని గుర్తు పెట్టుకున్న వే
ఓ రైతన్నా, అందరికీ కరువు కాటకాల లో అన్నం పెట్టిన కీర్తిశేషులు బుడ్డా వెంగలl రెడ్డి గారిని గుర్తు పెట్టుకున్న వే
ఓ రైతన్నా, నేను కూడా (RARS )ఎంతోమంది అన్నదాతలకు అన్నం పెట్టడానికి, అధిక దిగుబడిని ఇవ్వటానికి మీ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే విధంగా నీకు నేను సహాయం చేశాను, “అన్నదాత సుఖీభవ “అంటూ నీకు నేను నీకు కీర్తిని , గౌరవాన్ని పెంచాను నన్ను గుర్తు పెట్టుకో కుంటే ఎలాగా ఓ రైతన్న.
ఓ రైతన్నా, నన్ను (RARS)ఈరోజు నీవు గుర్తు పెట్టుకోకపోతే , నీ జీవితం ఒక్కసారి ఊహించుకో, నాకంటూ 115 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎన్నో రకాలుగా ఈ సమాజ అభివృద్ధికి తోడ్పాటు అందించాను. నన్ను (RARS )ఈ ప్రాంతం నుంచి తరలించాలని ప్రయత్నం చేస్తున్నారు.
ఓ రైతన్నా, నేను నిన్ను ఏమీ కోరికలు కోరలేదు ,ఒకటి అడుగుతున్నా ఇన్ని రోజులు నీ అభివృద్ధికి పాటుపడుతున్న నన్ను దూరంగా తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నీకు నాకు ఉన్న అనుబంధం ,చేపకు నీటికి ఉన్న బంధం,తల్లి బిడ్డల బంధం ఈ బంధం తో నేను నిన్ను ఒకటి కోరుతున్న.
ఓ రైతన్నా, నన్ను ఈ ప్రాంతం నుండి తరలించకుండా కాపాడుకో నీ భవిష్యత్ తరానికి ఇంకా సేవ చేస్తా ,మీ అభివృద్ధికి పాటు పడతా, పదిమందికి అన్నం పెట్టే శక్తినిస్తా
నన్ను నంద్యాల చరిత్ర నుండి కనుమరుగు కానీ య వద్దు, గుర్తు పెట్టుకో ఓ రైతన్న నేనుఅండ లేక పోతే నీ జీవితం అగమ్యగోచరం.
ఓ రైతన్న నేను నీ కులము చూడలేదు, మతము చూడలేదు ,ప్రాంతము చూడలేదు, భాషా చూడలేదు నేను ఆలోచన చేసింది ఒక్కటే నీ ఆకలి, , నీకు మంచి విత్తనాలు ఇవ్వాలి, మీకు ఆర్థిక శక్తిని ఇవ్వాలి……… కానీ
ఓ రైతన్న నీవు మాత్రం ప్రాంతం ,భాష ,కులం ,పార్టీలు అంటూ నన్ను పట్టించుకోకుండా ఉన్నావే ఒక్కసారి ఆలోచన చేయి నీ పిల్లలకు, నీ సోదరులకు , విద్యావంతులకు, మేధావులకు అందరికీ చెప్పు నన్ను కాపాడమని, ఇక్కడి నుంచి తరలించకుండా నంద్యాల లోనే ఉంచాలని
ఓ రైతన్న నీ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నా ,మీరందరూ నాకు సహాయం చేయండి ,నన్ను ఇక్కడే ఉండనివ్వండి, మీ రుణం తీర్చుకుంటా, నన్ను ఇక్కడే ఉంచాలని గొంతెత్తి చాటండి, మీరు ప్రజాప్రతినిధులకు తెలియజేయండి
ఆంధ్ర ప్రదేశ్ కర్నూలు జిల్లా నంద్యాల లో ఉండే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం(RARS)ను నంద్యాల నుండి మరొక ప్రాంతానికి తరలించడానికి ప్రస్తుత ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది, ఆ ప్రదేశంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి సినదిగా వైద్య కళాశాలను, నంద్యాల లోని మరొక ప్రాంతంలో ఏర్పాటు చేయటానికి మేము స్వాగతిస్తున్నాం.
అభివృద్ధిని కోరుతాం, అభివృద్ధికి సహకరిస్తాం, కానీ 1906లో రైతు కోసం ఏర్పాటు అయిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం మన రాష్ట్రంలోనే మొదటి వ్యవసాయ పరిశోధన కేంద్రం.
ఎంతో చరిత్ర కలిగిన, ఎంతో ప్రఖ్యాతి గాంచిన వంగడాలను దేశానికి అందించే కీర్తి గడించిన క్షేత్రం,రైతు అనేవాడు రైతు గా ఆలోచన చేయండి పార్టీల కతీతంగా, మనం ఏ పార్టీలోనైనా ఉండవచ్చు, కానీ రైతు కోసం కొత్త వంగడాలను సృష్టించే శాస్త్రవేత్తలకు, అక్కడ పనిచేసే సాంకేతిక నైపుణ్యం కల వ్యక్తులను, ఎన్నో సంవత్సరాలుగా నైపుణ్యం కలిగిన కుటుంబాలు పరిశోధన కేంద్రాన్ని ఆసరా చేసుకుని జీవనాన్ని సాగిస్తున్నాయి.
వారందరినీ ఇక్కడి నుండి ఇంకొక ప్రాంతానికి తరలించవచ్చు కానీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం చుట్టూ ఉన్న వాతావరణం ,నీటి సౌకర్యం, అన్ని రకాలైన నేల స్వభావం కలిగిన భూములను సృష్టించగలమా?
క్రొత్త వంగడాలను సృష్టించాలంటే కనీసం 7 నుండి 10 సంవత్సరాల కాలం పడుతుంది, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిశోధన కేంద్రాన్ని ఇంకొక ప్రాంతానికి తరలించడం వల్ల కొత్త వంగడాలను సృష్టించడానికి కనీసం రెండు దశాబ్దాలు పడుతుంది. (అన్ని వసతులతో కూడిన కేంద్రం తయారు కావాలంటే సమయం పడుతుంది) దీనివల్ల రైతులకి చాలా నష్టం కలుగుతుంది. వంగడాల కొరత ఏర్పడుతుంది. నూతన వంగడాలు కోసం మరొక సంస్థల మీద ఆధారపడవలసి వస్తుంది.
సకల సౌకర్యాలతో కూడిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని వదలి ఇంకొక కేంద్రాన్ని ఏర్పాటు చేయటంలో, సమయం, ఆర్థిక భారం, నైపుణ్యం గల వ్యక్తులు, అన్నీ ఉన్నా నూతన వంగడాన్ని సృష్టించడానికి సరైన నేల, నీటి సౌకర్యాలు లేకపోతే ఉపయోగం లేకుండా పోతుంది.
దయచేసి రైతు సోదరులు పై విషయాన్ని అర్థం చేసుకుని, రైతు శిక్షణ కేంద్రాన్ని, మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ఇక్కడి నుంచి తరలించకుండా ఇప్పుడు ఉన్న చోటనే ఉంచాలని , ప్రతి గ్రామంలోని రైతు, ఏ రాజకీయ పార్టీలో ఉన్న, మీ ప్రాంతం భాష కులం అనేది పరిగణలోకి తీసు కొనకుండా రైతులకోసం, ప్రజలకోసం ఉన్న ఈ కేంద్రాన్ని మనకోసం కాపాడుకోవాలి.
భవిష్యత్తు అవసరాల కోసం, ఆహార ఉత్పత్తి కోసం, కొత్త వంగడాలను సృష్టించే ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని రక్షించుకోవాల్సిన, కాపాడుకోవాల్సిన, బాధ్యత మనందరి పైన, వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగించే ప్రతి రైతు పైన ఉన్నది.
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని కాపాడుకుందాం ఈ విషయాన్ని పదిమందికి తెలుపుదాం, పదిమందికి పంచండి, ప్రభుత్వానికి ఈ విషయం చేరేంతవరకు ప్రతి రైతు ఈ విషయాన్ని పంచుంది, ఈ విషయాన్ని చదివే ప్రతి రైతు కుమారుడు కూడా ఆలోచించి పదిమందికి పంచేలా చేయండి.
నా కష్టం మీద మాట్లాడండి అభిప్రాయాలు తెలపండి, ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకత లేదు, నేను వైద్య కళాశాలకు వ్యతిరేకం కాదు, ప్రభుత్వ వైద్య కళాశాలను స్వాగతిస్తాం, నంద్యాలలో నే నూతన ప్రాంతంలో నిర్మించమని కోరుతున్నా.
(ఆరికట్ల మల్లికార్జున రెడ్డి,న్యాయవాది, అల్లూరు గ్రామం)