ఆ మధ్య పిల్లా తిరుపతి రావు ప్రజాశక్తి లో జాతీయాలు ఎలాపుడతాయే చక్కగా వివరించారు. జాతీయం అంటే అర్థం ఏమిటి, అవి నిర్వహించే సాంఘిక, సాంస్కృతిక ప్రయోజనమేమిటో ఆయన వివరించారు.
జాతీయాలు లేని భాష ఉండదు. రెండే వేర్వేరు భాషల్లో సమానార్థాల జాతీయాలు ఉండవచ్చు. అయితే, ఏ భాష జాతీయాలు ఆభాష సొంతం. ఒక భాష సాంఘిక, సాంస్కృతిక నేపథ్యంలో నుంచి అవి పుడతాయి. జాతీయాలు ఎంతో జటిలమయిన విషయాన్ని సూక్ష్మంగా వివరించేందుకు ఉపయోగపడతాయి.కొందరు జాతీయాల్లేకుండా మాట్లాడరు. తెలుగు రాజకీయాల్లో కెసిఆర్ ఎక్కువ జాతీయాల ప్రయోగిస్తుంటారు.జాతీయాలా విషయం సూటిగా వెళ్లుంది, సులభంగా అర్థమవుతుంది. భాష పదునెక్కుతుంది. జాతీయాల గురించి తిరుపతిరావు మాటల్లనే…
“ఒక భాషలో కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇచ్చే పదబంధమైతే దాన్ని జాతీయం అంటారు. అది ఆ భాషకే సొంతం. జాతీయాన్నే పలుకుబడి అని కూడా పిలుస్తుంటారు. ఈ పలుకుబడులను కవులు, రచయితలు, వక్తలు విరివిగా వాడటం వల్ల తెలుగు పద సంపద విపరీతంగా పెరిగింది. రెండు వేరు వేరు అర్థాలున్న పదాలు కలిసి అనగా నామవాచకానికి, క్రియ చేరగా ఇంకో అర్థం వచ్చే పదాలను శబ్దపల్లవాలు అంటారు. పొడుపు కథలలో అయితే, విస్మయం కలిగే ప్రశ్న దాగి ఉంటుంది. ప్రశ్నకు హాస్యం, చమత్కారంతో కూడిన సమాధానం ఒకటి ఉంటుంది. అదే సామెత అయితే… అంతరంగా మరో అర్థం కలిగి ఉంటాయి. ఇవి జాతీయం కంటే కాస్త భిన్నంగా ఉంటాయి. అంటే కాస్త పొడవుగా, విపులంగా ఉంటుందన్న మాట. ఈ సామెతలనే లోకోక్తులు అని కూడా పిలవడం కద్దు.
“ఈ సామెతలు, జాతీయాలు, శబ్దపల్లవాలు, పొడుపు కథలతో భాషకు నిండుదనం చేకూరుతుంది. ప్రజలు తమకు తాముగా మాట్లాడే భాషలో సందర్భానుసారం సామెతలను ప్రయోగిస్తుంటారు. సాధారణంగా జానపదులు తమ వాడుకభాషలో ఎక్కువగా సామెతలను వినియోగించడం చూస్తుంటాం. సామెతలలో భాషా సౌందర్యం, అనుభవసారం, నీతిని ప్రబోధించడం, చమత్కారం, హాస్యం మొదలగు లక్షణాలు మిళితమై ఉంటాయి. దీనివల్ల ఆ భాష మాట్లాడే వారి సంస్కతి సంప్రదాయాలను ఇతరులు ఇట్టే గుర్తుపట్టగలరు. సామెత లేని మాట ఆమెత లేని ఇల్లుగా చెబుతారు కొందరు. సామెత అనే మాట ‘సామ్యత’ అను పదం నుంచి ఉద్భవించినట్లు భాషా శాస్త్రవేత్తలు చెబుతారు. సర్వసాధారణంగా ప్రజల అనుభవాల్లోంచి సామెతలు పుడతాయి.”
ఇపుడు కొన్నిజాతీయాల పుట్టుపూర్వోత్తరాలు గురించి తెలుసుకుందాం. ఇవే మా కథనాలు కాదు. ఇతర మూలాల నుంచి సేకరించినవి మాత్రమే. వాటిని ఎక్కడినుంచి తీసుకుంటున్నామో హైపర్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది.
ఈ రోజు కంబంధ హస్తాలు అనే జాతీయ పుట్టుపూరోత్తాలను తెలుసుకుందాం.
కబంధహస్తాలు అనే మాట ని విడిపించుకోలేనంత గట్టి పట్టున్న అర్థంలో వాడుతుంటాం. ఈరోజు ట్రెండింగ్ తెలుగు న్యూస్ లో కార్పరేట్ కంబంధ హస్తాల నుంచి విముక్తి లేదా అనే శీర్షిక పోస్టు ఉంది.ఈ కబంధ హస్తాలు అనే మాట ఎలా వచ్చిందో చూద్దాం.
కబంధ హస్తాలు
వాల్మీకి రామాయణంలో కబంధుడు అనే పేరుగల ఒక రాక్షసుడు ఉన్నాడు. శ్రీరాముడు, లక్ష్మణుడు సీతను వెతుకుతూ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా విచిత్ర రూపంలో ఉన్న ఓ రాక్షసుడు వారికి తటస్థ పడ్డాడు. అతనికి తల, మెడ, కాళ్ళు లేవు. ఉదరం- అంటే కడుపు భాగంలో మాత్రం ఓ పేద్ద నోరుంది. ఊరువుల ప్రదేశంలో రెండు ఉగ్రనేత్రాలున్నాయి. అతని బాహువులు మాత్రం ఎనిమిది యోజనాలవరకు విస్తరించి ఉన్నాయి. అటువంటి రాక్షసుడు ఒక్కసారిగా రామలక్ష్మణులను తన హస్తాలతో పెనవేసి గుప్పిట్లో బిగించాడు. భయకరమైన నోటిని తెరిచి వారిని ఆరగించబోతుండగా రాముడు కుడి చేతిని, లక్ష్మణుడు ఎడం చేతిని నరికివేయడంతో అతను నేలకి ఒరిగి పోయాడు. తనని గాయపరిచినది రాముడు అని తెలుసుకుని కబంధుడు ఎంతో సంతోషించాడు. అతని వికృత రూపానికి కారణం చెప్పాడు.
కబంధుడు ధనవు అనేవాడి కుమారుడు. చాలా సుందరుడైన కబంధుడు ఒకప్పుడు గర్వంతో విహరిస్తూ ఉండేవాడు. ఒకసారి వినోదంకోసం వికృతరూపం ధరించి స్థూలశిరుడనే మునిని బాధించాడు. అతను కోపించి ఆ వికృతరూపం శాశ్వతంగా ఉంటుందని శపించాడు. శ్రీరాముడి చేతిలో అగ్నిలో దహించబడితేనే పూర్వపు రూపు వస్తుందని శాపవిమోచనం చెప్పాడు.అప్పుడు బ్రహ్మకోసం తపస్సుచేసి దీర్ఘాయువు పొందాడు.బ్రహ్మ వరం ఉంది కదా అనే ధైర్యంతో ఇంద్రుడితో యుద్ధం చేసాడు. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసరడంతో కబంధుడి తల కాళ్ళు దేహంలోకి చొచ్చుకుపోయి విచిత్రరూపంలోకి మారిపోయాడు. పూర్తిగా వధించమని ఎంత ప్రాధేయపడినా బ్రహ్మశాపం వృథా పోకూడదని ఇంద్రుడు కబంధుడిని అలాగే వదిలి వెళ్ళిపోయాడు. ఆరూపంలో అక్కడే పడి ఉండి తన సమీపానికి వచ్చిన పెద్దపెద్ద జంతువులను కూడా యోజనాల తరబడి విస్తరించి ఉన్న తన హస్తాలతో బంధించి తేలికగా ఆరగించేవాడు కబంధుడు. రామలక్ష్మణులు చేతులు నరకి, అగ్నిలో దహనం చేసారు. ఆవిధంగా తన శాపం పోగొట్టుకున్నాడు కబంధుడు. సీతను వెతకడంలో సుగ్రీవుడు సహాయం చేయగలడని చెప్పిఅతని చిరునామాను రాముడికి ఇచ్చిన వాడు కబంధుడు. సుగ్రీవుడు హనుమంతుడు రాముడికి ఎంత సహాయం చేసారో మనకి తెలిసిన కథే కదా.
చాలా దుర్మార్గుడయిన మనిషి చేతిలో చిక్కి, తప్పించుకోలేక బాధపడే పరిస్థితిలో అతని పట్టును కబంధ హస్తాలు అని వర్ణిస్తారు.
(source: Facebook)