ఎపి మాజీ డిజిపి ప్రసాదరావు మృతి

ఆంద్రప్రదేశ్ మాజీ డిజిపి డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు  అమెరికాలో గుండెపోటు రావడంతో మరణించారు.ఆయనకు ఈ ఉదయం ఛాతీ నొప్పి వచ్చిందని, అయితే ఆసుపత్రి తరలించే లోపే చనిపోయారని తెలిసింది. ఆయన భౌతిక శాస్త్ర మేధావి. పోలీసుల ఉద్యోగంలో ఉన్నా ఆయన భౌతిక శాస్త్రాన్ని వదల్లేదు. సౌమ్యుడిగా, పేదలకు చేయూతనిచ్చే వక్తిగా ఆయన కు పేరుంది. ముఖ్యంగా అట్టడుగు వర్గాల మిత్రుడు.

బయ్యారపు ప్రసాదరావు డీజీపీ.గుంటూరు జిల్లా తెనాలి మండలం తేలప్రోలులో 1955 సెప్టెంబర్‌ 11న జన్మించారు. తండ్రి శ్రీనివాసరావు (కానిస్టేబుల్‌). తల్లి సుశీలమ్మ.

ప్రాథమిక విద్యను నర్సరావుపేట ఉరవకట్టలోని మున్సిపల్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో, ప్రాథమికోన్నత విద్యను తెనాలికి 20 కి.మీ దూరంలోని కొల్లూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్లో పూర్తి చేశారు. విజయవాడలోని లయోలా కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేశారు.

బీఎస్సీ తరువాత 1977లో మద్రాస్‌ ఐఐటీ నుంచి ఎమ్మెస్సీ పట్టా పొందారు. 1979లో మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్‌కు ఎంపిక య్యారు. ఐపీఎస్‌గా నియమితులై పోలీసు అధికారిగా బాధ్యతలను నిర్వర్తిస్తూ కూడా ప్రసాదరావు ఉన్నత చదువులను అభ్యసించారు.

కాంతి తరంగ సిద్ధాంతంపై పరిశోధనలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సుల్లో తన పరిశోధనలను ఆవిష్కరించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) హైదరాబాద్‌, విశాఖపట్నం యూనివర్సిటీలలో విజిటింగ్‌ ఫ్రొఫెసర్‌గా కూడా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

ఐదుగురు సంతానంలో ప్రసాదరావు పెద్దవారు. ముగ్గురు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. ఫిజిక్స్ అంటే ఉన్న మక్కువతో ఇప్పటికీ తరంగ సిద్దాంతం, బిగ్‌బ్యాంగ్ థియరీలపై రిసెర్చ్ చేస్తుంటారు. వీరు 2013 సెప్టెంబరు 30 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పిగా బాధ్యతలు స్వీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *