పది రోజులు కరోన వైరస్ తో పోరాడి 30 నిమిషాల క్రితం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో మిత్రుడు M రామకృష్ణ అంతిమ శ్వాస విడిచారని అత్యంత బాధా తప్త హృదయంతో తెలియజేస్తున్నాను.
ఓ పి డి ఆర్ క్రియాశీల కార్యకర్తలలో ప్రధమ శ్రేణికి చెందిన వారు రామక్రిష్ణ. 2013 నుంచి ఓపిడిఆర్ అనంతపురం జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా అతని భాగస్వామ్యం లేని ఓ పి డి ఆర్ కార్యక్రమం అనంతపురం జిల్లాలో ఒక్కటి కూడా లేదు.
‘నాలుగు పడగల హైందవ నాగరాజు’ లాంటి కరపత్రాలు ఆయన లోతైన అవగాహనకు మచ్చుతునకలు.
అనంతపురం జల సాధన సమితిలో రామకృష్ణ ది కీలకపాత్ర. అనంతపురం లోని పౌర హక్కుల సంఘం, మానవ హక్కుల వేదిక, కార్మిక సంఘాలు, దళిత సంఘాలు, మహిళా సంఘాలు మరియు విద్యార్థి యువజన సంఘాల తో ఎంతో కలుపుగోలుగా ఉండేవాడు. రామకృష్ణ మార్క్సిజం-లెనినిజం పూలే అంబేద్కర్ ఆలోచనల పట్ల పూర్తి నిబద్ధత కలిగి ఉన్నాడు.
మార్చి 31 న రెండు తెలుగు రాష్ట్రాల లోని వివిధ ప్రజా సంఘాల కార్యకర్తల మరియు నాయకుల ఇళ్ల పై NIA దాడులకు వ్యతిరేకంగా ఓపిడిఆర్ కేంద్ర నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాన్ని ఏప్రిల్ 3వ తేదీన అనంతపురంలో విజయవంతం చేయటంలో రామకృష్ణ ది కీలకపాత్ర. ఏప్రిల్14 అంబేద్కర్ జయంతి ఆతను పాల్గొన్న చివరి కార్యక్రమం.
యం. రామకృష్ణ అనంతపురం జిల్లా బుక్కపట్నం దగ్గర గల గూనిపల్లి గ్రామంలో నిరక్షరాస్య పేద దళిత కుటుంబంలో 69 సంవత్సరాల క్రితం జన్మించాడు. నలుగురు అన్నదమ్ములు. ఇద్దరు తమ్ముళ్లు, ఒక మరదలు విప్లవోద్యమంలో కార్యకర్తలుగా పనిచేశారు. ఒక తమ్ముడు బూటకపు ఎదురుకాల్పుల్లో అమరుడయ్యాడు.
రామకృష్ణ అనేక ఇబ్బందులు పడుతూ డిగ్రీ చదువులు పూర్తి చేసి వ్యవసాయ శాఖలో గుమస్తాగా చేరి నిబద్ధతతో పని చేస్తూ జిల్లా అధికారి స్థాయికి ఎదిగారు. 20 సంవత్సరాల పాటు జనసాహితి సభ్యుడిగా, కార్యకర్తగా పనిచేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లో పదవీ విరమణ చేసిన అనంతరం తన సొంత జిల్లా వెళ్లి అనంతపురం పట్టణంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి అక్కడ ఓ పి డి ఆర్ కు గొప్ప నాయకుడు గా, అనంతపురంలోని శ్రామిక ప్రజానీకానికి ప్రీతిపాత్రునిగా ఎదిగారు.
రామకృష్ణ జీవిత సహచరి సోదరి గంగాభవాని, కుమారులు సృజన్, నవీన లకు ఓపిడిఆర్ సంస్థ తరఫున, వ్యక్తిగతంగా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
(సి.భాస్కర్రావు, ఛైర్మన్, ఓపిడిఆర్)
రాయలసీమ ఉద్యమానికి తీరని లోటు: బొజ్జా
గత 9 సంవత్సరాల కాలంలో రామకృష్ణ వ్యక్తి గతంగాను, అనంతపురం జల సాధన సమితి కార్యదర్శి హోదాలోను రాయలసీమ సమస్యల పరిష్కారానికి క్రియాశీలకంగా అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. రాయలసీమ సాగునీటి సాధనకై అనేక కార్యక్రమాలలో ప్రజా సంఘాల సమన్వయం వేదికలో కీలకపాత్ర నిర్వహించారు.
ప్రజా ఉద్యమాలలో నిరంతరం పాల్గొనే రామకృష్ణ గారు కోవిడ్ తో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. రామకృష్ణ గారి అకాల మరణం పట్ల వారి కుటుంబానికి రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నదని బొజ్జా దశరథ రామి రెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు ఒక ప్రకటనలో తెలిపారు.
మాకిరెడ్డి సంతాపం
రాయలసీమ కోసం పరితపించే రామకృష్ణ గారి మరణం సీమ ఉద్యమానికి తీరని నష్టం. రాయలసీమ కోసం నిత్యం పరితపించే జలసాదన సమితి నేత రామకృష్ణ గారు మృతి చెందడం సీమ ఉద్యమానికి తీరని నష్టం. రాయలసీమ మేధావుల ఫోరం సంతాపాన్ని తెలుపుతుంది. నాకు వారితో చిన్నపాటి సాన్నిహిత్యం మాత్రమే. ఒకటి , రెండు సార్లు మాత్రమే వారిని కలిశాను. ఎప్పుడు కలిసినా నీటి సమస్య పరిష్కారానికి సంబంధించిన అంశాలు చర్చకు పెట్టేవారు. తనకు తెలిసిన విషయాన్ని పదిమందికి విసుగు లేకుండా చెప్పేవారు. కారణం అందరికి సమస్య పట్ల అవగాహన ఉంటే పరిష్కారానికి పోరాడుతారు అన్నది వారి నమ్మకం.
వారితో అనుబంధం చిన్నదే అయినా మంచి ప్రేరణ కలిగింది. ఉన్నత విలువలు , భావాలు కలిగిన రామకృష్ణ లాంటి వారు రాయలసీమ ఉద్యమానికి ఎంతో అవసరం ఉంది. వారిని కోల్పోవడం సీమ ఉద్యమానికి లోటే. వారి ఆశయాలు కనుగుణంగా సీమ అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేయడం , వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే రామకృష్ణ గారికి నిజమైన నివాళి రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి అన్నారు.