రేడియో వచ్చింది… సరికొత్త ప్రపంచం విచ్చుకుంది!

(బి వెంకటేశ్వర మూర్తి)

రేడియోతో నా జ్ఞాపకాలు తలచుకున్నప్పుడల్లా ఇప్పటికీ మనసు తియ్యదనంతో నిండిపోతుంది. బుద్ధి తెలిసినప్పటి నుంచి దాదాపు ముప్ఫై ఏళ్లు గొప్ప తాదాత్మ్యంతో రోజూ మూడు నాలుగు గంటల పాటు రేడియో వినేవాడిని. ఇప్పుడు ఆరో దశకంలో ఉన్న మా తరంలో నూటికి తొంభై పాళ్లు ఇలాంటి వాళ్లేనని నా గట్టి నమ్మకం. అలాంటి రేడియో అకారణంగా నాకు దూరమైపోయిందని లోలోపల ఎంతగానో నొచ్చుకునే వాడిని. 

నేను ఆళ్లగడ్డలో హైస్కూల్లో చదివేప్పుడు 1960 దశకం చివరలో మొట్టమొదటిసారి మా ఇంటి నట్టింట్లోకి రేడియో వచ్చి కూర్చుంది. అంత క్రితం పార్కులోనో, పంచాయతీ ఆఫీసు ఆవరణలోనో సాయంత్రం ఆడుకునేప్పుడు పబ్లిక్ రేడియోలో వార్తలో, పాడి పంటల కార్యక్రమమో వినేవాళ్లం.  రేడియో వచ్చీరాగానే ఇంట్లోనే ఓ సరికొత్త ప్రపంచం విచ్చుకున్నట్టయింది. రేడియో కూనిరాగాలూ, కబుర్లు మొదలయ్యాక వారానికో పది రోజులకో మా ఇంట్లో హ్యాపీనెస్ ఇండెక్స్ కొలతలు గనక తీసి ఉంటే పాయింట్లు కనీసం రెండు మూడింతలు పెరిగి ఉండేవి.

అప్పుడప్పుడే ఎస్సెస్ఎల్సీ పూర్తి చేసిన మా పెద్దన్న సత్యనారాయణ రావు సబ్ ట్రెజరీ ఆఫీసులో గుమాస్తాగా మొదటి ఉద్యోగంలో చేరినప్పుడు రెండు సాహసాలు చేసి విజయం సాధించాడు. రేడియో, టేబుల్  ఫ్యాన్ లు రెండూ మా ఇంట్లోకి వేంచేసింది ఆళ్లగడ్డలో ఉండగానే. వీటిలో ఏ సాహసం ముందో ఏది తర్వాతో మా పెద్దన్నకే  ఇప్పుడు సరిగా గుర్తు లేదు. ఆ రెండింటి ధర అప్పట్లో రూ. 350 లోపే. మా తండ్రి గారు మున్సిఫ్ కోర్టులో హెడ్ గుమాస్తా. ఆయన నెల జీతం బహుశ నాలుగైదు వందల దాకా ఉండొచ్చు. 

ఉన్నంతలో అన్న వస్త్రాలకు లోటు లేకుండా అప్పుల జోలికి పోకుండా గుట్టుగా కాపురం నెట్టుకొస్తుండటం మా తండ్రిగారి పద్ధతి. మొట్టమొదటిసారి ఉద్యోగస్తుని హోదా పొందినందుకు మా పెద్దన్న లోలోపల ఎంతగా పొంగిపోయాడో తెలీదు గానీ కొత్తగా రెండో మనిషి తీసుకొచ్చే జీతం డబ్బుల వినియోగంపై మా తండ్రిగారికి మాత్రం ఆయన లెక్క ఆయన కుంది. అప్పటి కాల పరిస్థితుల్లో రేడియో కొనడం మా తండ్రిగారికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆయన ఎదురుగా నిటారుగా నిలబడి కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడే ధైర్యం ఇంట్లో ఎవ్వరికీ లేదు. 

మా అమ్మతో పాటు తలుపుచాటున ఆమె వెనకాల నిలబడి, మా పెద్దన్న తను ముందుగానే రాసుకున్న స్క్రిప్టును ఆమె ద్వారా చెప్పించి, నాలుగైదు సులభ వాయిదాల్లో, సంసారం మీద ఎంత మాత్రం భారం పడకుండా రేడియో అప్పును అతి సులభంగా తీర్చేసుకోవచ్చని నచ్చజెప్పాడు. కానీ మా తండ్రిగారు ఒప్పుకోవడం అదేమంత సులభంగా జరిగిన సంగతి  కాదు. ఇంట్లో వాళ్లందరూ పని కట్టుకుని, తన చెవిలో పడేలాగా ఏదో రకంగా మాటిమాటికీ రేడియో ప్రస్తావన తెస్తుండటం, మా పెద్దన్న పట్టు వదలని విక్రమార్కుడిలాగా రోజుకు రెండు మూడు సార్లు మా అమ్మకు సదరు సులభ వాయిదాల సంగతిని వివరించి చెబుతుండటంతో పోతేపోనీలే అన్న ధోరణిలో ఎట్టకేలకు ఆయనా రేడియోకు పచ్చజెండా ఊపారు. 

మా లోయర్ మిడిల్ క్లాస్ ఇంట్లోకి ఉన్నట్టుండి ఫ్యానూ, రేడియోలు రావడం అదేమంత సామాన్యమైన సంగతి కాదు. మా ఇరుగుపొరుగుల్లో, బంధువర్గాల ఇళ్లల్లో గొప్ప చర్చోపచర్చలకూ, చెవులు కొరుక్కోడాలకూ, మూతి తిప్పుకోడాలకు తావిచ్చిన అనూహ్యమైన సంఘటన అది. ఈ రెండూ కూడా అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి `లగ్జరీ ల కిందే లెక్క. అందుకనే అవి కొనడాన్ని మా పెద్దన్న చేసిన సాహసాల కింద జమ కట్టింది.

అప్పుడు మేం కొన్నది లేత ఆకుపచ్చ రంగు ఫిలిప్స్ రేడియో. నేను రేడియోను చూడటం అదే మొదటి సారి. మా మూడు బ్యాండ్ ల కరెంటు రేడియోలో నాలుగు మీటలుండేవి. వాటిలో ఎడమవైపున ఉండే రెండు మీటల్లో ఆఫ్-ఆన్ కోసం ఒకటి, స్టేషన్ లు మార్చడానికి ఉద్దేశించిన ట్యూనింగ్ మీట ఇంకొకటి. కుడివైపున ఉండే ఇంకో రెండు మీటల్లో ఒకటి మీడియం వేవ్, షార్ట్ వేవ్ లకు సంబంధించింది. షార్ట్ వేవ్ లో సిలోన్ స్టేషన్ వస్తుందన్న సంగతి తర్వాతెప్పుడో, బహుశ కొన్నేళ్ల తర్వాత నాకు తెలిసింది. ఆ కుడివైపున ఉన్న ఇంకో చివరి నాలుగో మీట ఎందుకు ఉందో, దాని ప్రయోజనమేమిటో అప్పటికీ ఇప్పటికీ నాకు తెలీదు. కుడి, ఎడమల్లో ఈ మీటల మధ్య భాగంలో రేడియో తెర ఉండేది. ఈ తెర మీదున్న ఎర్రటి నిలువు గీత (ఇండికేటర్ పుల్ల), మనం ట్యూనింగ్ మీటను తిప్పడాన్ని బట్టి అటూ ఇటూ తిరుగుతుంటుంది. ఎడమ చివరనున్న మొట్టమొదటి మీటను కుడివైపు తిప్పగానే టక్ మనే శబ్దంతో రేడియో ఆన్ అయ్యి లోపలున్న కనిపించని ఓ చిన్న బల్బు వెలిగి తెర కాంతివంతమయ్యేది. 

రేడియో కొన్న కొత్తలో ఇంటి సభ్యులందరూ దాన్ని ముద్దుల పాపాయిలాగా అపురూపంగా చూసుకునే వాళ్లం, మా తండ్రి గారితో సహా. స్విచాన్ చేసేప్పుడు, ప్రోగ్రాం అయిపోయాక ఆఫ్ చేసేప్పుడు జాగ్రత్తగా, నాజూగ్గా, చిన్నగా సదరు మీటను అటూ ఇటూ తిప్పాలన్న మాట. గట్టిగా మొరటుగా తిప్పితే అది విరిగిపోతుందని భయం. ట్యూనింగ్ మీటను కూడా బరాబరా కాకుండా, ఇండికేటర్ పుల్లకు నొప్పవకుండా నిదానంగా జాగ్రత్తగా తిప్పాలని ఆదేశాలు. కొత్తలో మేం రెండే రెండు స్టేషన్లు వినేవాళ్లం. కడప, హైదరాబాద్. స్క్రీన్ మీద ఐదు-ఆరు నంబర్ల మధ్య కడప, ఏడు-ఎనిమిది మధ్య హైదరాబాద్ వచ్చేవి. వీటిలో మాకు కడప చాలా క్లోజు. కడప స్టేషనైతే గురగుర శబ్దాలు ఎక్కువ లేకుండా చాలా మట్టుకు క్లియర్ గా వినిపించేది. హైదరాబాదైతే గురగుర శబ్దాలు చాలా ఎక్కువ. 

కడపలో సినిమా నటుడు ప్రభాకరరెడ్డి వంటి బరువైన కంఠస్వరం గల అనౌన్సర్ అంటే మాకందరికీ చాలా ఇష్టం. ఈయన అనౌన్స్ మెంట్ లు మరీ చాలా నిదానంగా ఉండేవి. రాత్రి ఎనిమిదవగానే ఆకాశవాణి కడప కేంద్రం. మీరు కోరిన పాటలు. శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు, అని ఆయన్ను అనుకరిస్తూ నేను ముందుగానే అనౌన్స్ చేసేసేవాడిని. ఇందులో శ్రోతలంటే రేడియో వింటున్నవాళ్లని అర్థమనీ, అంటే మనమేనని మా అమ్మ చెప్పింది. ఒక్కోసారి పాటల ప్రకటనలో దానికదే చక్కని ప్రాస కుదిరేది. రచన సముద్రాల, సంగీతం పెండ్యాల, పాడినవారు ఘంటసాల, పి సుశీల…, లాంటి వన్న మాట. క్రమక్రమంగా ఇట్లాంటి ప్రాసల కోసం కాచుకోడం ఎక్కువైపోయింది. ఈ తిక్క ఎక్కువై పోయి ఒక్కోసారి ఆ కడప అనౌన్సరు రచన పింగళి అనగానే `సంగీతం గొంగళి, పాడినవారు కంబళి అంటూ అనౌన్స్ చేస్తుంటే ఇంట్లో వాళ్లు లోలోపల నవ్వుకుంటూ పైకి నన్ను కోప్పడేవాళ్లు. 

పొద్దున ఆరు గంటలకు ఒకటి రెండు నిమిషాల ముందు ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ తో కార్యక్రమాలు ప్రారంభమయ్యేవి.

 

ఈ ట్యూన్ ని అక్షరాలతో చెప్పడం కష్టం. బరువైన ధ్వని గల శ్రుతి లాంటి తంత్రీనాదం మోగుతుంటే `ఊ(((((((….ఉఊ((((((ఉఊ((((((ఉఊ((((((ఊ(((((((…. అనే వరస ఓ ఐదారు సెకెన్ల గ్యాప్ తో రిపీట్ అవుతుండేది. ఈ ప్రతి రిపిటీషన్ కి మధ్య గ్యాప్ లో శ్రుతి నాదం కొనసాగుతుండేది. తెలతెలవారుతుండగా నిశ్శబ్ద ప్రశాంతతలో వినిపించే ఈ రేడియో మేలుకొలుపు మనసుకు హాయిగా అనిపించేది. ఉత్సాహమిచ్చేది. ఇదవగానే ఆ యొక్క రేడియో కేంద్రం పేరు చెప్పి ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం ఆ రోజు తేదీ, నెల, సంవత్సరం చెప్పి, ఆ వెంటనే తెలుగు పంచాంగం (అంటే శకం, సంవత్సరం, తిథి, వారం, నక్షత్రం, రాహుకాలం, వర్జ్యం వగైరా) తెలియజేసేవారు. 

ఆ తర్వాత అర్ధగంట సేపు వచ్చే భక్తి రంజని మా అమ్మకు ఇష్టమైన కార్యక్రమం. ఇందులో శనివారం, బుధవారాల్లో వెంకటేశ్వర సుప్రభాతం, సోమవారం శివాష్టకం, శివస్తుతి, శివనామ సంకీర్తనలు వచ్చేవి. ఆది, శుక్రవారాల్లో ఏసుక్రీస్తు, అల్లా కీర్తనలు కొద్దిసేపు వచ్చేవి. మధ్యలో ఉన్న మిగతా వారాల్లో రాముడు, కృష్ణుడు, అమ్మవారు, ఆంజనేయుడు వగైరా దేవుళ్ల పాటలు, కీర్తనలు ప్రసారం చేసే వాళ్లు. 

తెల్లవారు జామున వినడం వల్లనో ఏమో వెంకటేశ్వర స్తోత్రం అప్పట్లో నాకు కంఠతా వచ్చేసింది. సుప్రభాతం కూడా వచ్చేదేమో కానీ, అది దేవుడిని నిద్ర లేపేందుకు పాడే పాట కాబట్టి దాన్ని ఎప్పుడంటే అప్పుడు పాడకూడదని పెద్దవాళ్లు షరతు పెట్టడంతో దానిపైన మనం పెద్దగా శ్రద్ధ చూపలేదు. వెంకటేశ్వర స్వామి గుడికి పోయినప్పుడంతా చక్కంబట్లు వేసుకుని కూర్చుని భక్తిగా కళ్లు మూసుకుని, కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణి తాతుల నీలతనో….. అంటూ స్తోత్రం మొత్తం మనసులోనే గొణుక్కుంటూ అప్పజెప్పేవాడిని. మనకి భక్తి ఎక్కువైన ఒకానొక దశలో ఇంట్లో కూడా స్నానం చేసి టవలు నడుముకు చుట్టుకుని దేవుని గూటి ముందర కూర్చుని భక్తిగా వెంకటేశ్వర స్తోత్రం చెప్పేవాడిని. 

 

భక్తిరంజని పాటల్లో నాకు బాగా ఇష్టమైంది, కంఠతా వచ్చిన మరో పాట `ఏమి సేతురా లింగా ఏమి సేతురా అనే పాట. దీంట్లో భక్తుడు (పాడింది బహశ బాలమురళీకృష్ణ అనుకుంటాను) శివుడికి ఎన్నిరకాలుగా పూజ చేద్దామనుకున్నా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతుంటుంది పాపం. గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేతమంటే -గంగలోని చాప, కప్ప ఎంగిలంటున్నాయి లింగ….. పాలతో పూజ చేద్దామంటే లేగదూడ ఎంగిలంటుంది. తుమ్మి పూలతో పూజ చేద్దామంటే తుమ్మెదలు ఎంగిలంటాయి. 

తుమ్మి పూల ప్రస్తావన రావడం కూడా ఈ పాట నాకు బాగా నచ్చడానికి బహశ ఓ కారణం కావచ్చు. ఆళ్లగడ్డలో ఆశ్రమం స్కూల్లో ఐదో తరగతి చదివేప్పుడు ఆ ఆశ్రమంలో శివాలయంలోని శివుడికి కార్తీక మాసంలో నేను మరికొందరు పిల్లలం తుమ్మి పూలతో దండలు గుచ్చి స్వామి కిచ్చి మొక్కుకునే వాళ్లం. 

కచ్చేరీ దాటి గ్రామదేవత గుడి దాకా వచ్చి ఇంకా ముందుకు వెళితే చిట్టచివరన ఉండేది మా ఆశ్రమం స్కూలు. ఆ స్కూలు పక్కన బీడు పొలాలు ఉండేవి. వాటిలో అక్కడక్కడ ఈత చెట్లు, ఎక్కువగా తంగేడు చెట్లు, మధ్యమధ్యన కొన్ని తుమ్మి పూల చెట్లు ఉండేవి. ఈ తుమ్మి పూలు చాలా చిన్నవి. గోరంత, లేకపోతే గండుచీమ సైజులో సగమంత ఉండేవి. ఒక్కొక్కటిగా వీటిని చెట్టు నుంచి పీకడం చాలా కష్టం. ఒక అరగంటో, గంటసేపో పీకితే చిన్న సిల్వర్ లోటా నిండా అయ్యేవి. 

ఏమి సేతురా లింగా పాటలో చెప్పినట్టు తుమ్మెదలెప్పుడూ కనిపించేవి కాదు గానీ తుమ్మి చెట్లలోనూ, తుమ్మిపూలలోనూ ఎర్రచీమలతో పెద్ద చిక్కొచ్చి పడేది. ఎర్రచీమలు చేతి మీది కెక్కకుండా మాటిమాటికీ ఉఫ్ ఉఫ్ మని ఊదుకుంటూ అట్లాగే కష్టపడుతూ పీకేవాళ్లం. నల్ల చీమలు కొంచెం మంచివే గానీ ఎర్రచీమలు కుట్టితే కొంచెం మంట పుట్టి వెంటనే దద్దు లేచేది. ఎంత కష్టమైనా కార్తీక మాసంలో శివుడికి ఇష్టం కాబట్టి తుమ్మిపూల మాల కట్టి శివుడికి వేసి చాలా పుణ్యం సంపాదించుకునే వాళ్లం.

రేడియోలో భక్తి రంజని తర్వాత ఉదయం ఏడు గంటలకో, ఏడూ ఐదు నిమిషాలకో తెలుగులో వార్తలు, ఢిల్లీ నుంచి ప్రసారమయ్యేవి. ఈ వార్తలను మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు గానీ కొంచెం కొంచెం పెద్దవాడయ్యే కొద్దీ క్రమంగా వార్తలు వినడం అలవాటై పోయింది. మా తండ్రి గారు వార్తలు తప్పక వినే వారు. నేను చిన్నప్పుడు జోలెపాళ్యం మంగమ్మ, దుగ్గిరాల పూర్ణయ్య, కందుకూరు సూర్యనారాయణ, కొంచెం పెద్దయ్యేసరికి మామిళ్లపల్లి రాజ్యలక్ష్మి. ఏడిద గోపాలరావు, అద్దంకి మన్నార్ వంటి వాళ్లు ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు చదివేవాళ్లు. వీళ్లందరికీ ఎవరెవరికి వారి ప్రత్యేకమైన శైలి ఉండేది. ఉదాహరణకి దుగ్గిరాల, కందుకూరి వారైతే మొదటి నుంచి చివరి దాకా ఒకే శ్రుతిలో, నిదానంగా వార్తల్లోని మంచిచెడ్డలతో నిమిత్తం లేకుండా నిబ్బరంగా చదివేవారు. అదే అద్దంకి మన్నార్ అయితే వార్తల్లో ఉన్న మంచి చెడ్డలూ, ఎమోషన్స్ అన్నీ చదవడంలోనే ప్రతిధ్వనించేవి. ఎవరైనా నాయకుడు చనిపోయినప్పుడో, ఏదైనా ప్రమాదం వార్త చదువుతున్నప్పుడో గొంతులో విషాదం పలికేది. ఢిల్లీ వార్తలు మళ్లీ రాత్రి ఏడు గంటలకు కూడా వచ్చేవి.

ఉదయం ఎనిమిదిన్నర ప్రాంతంలో ఒకసారి, మళ్లీ సాయంత్రం ఆరున్నర గంటలప్పుడు రెండోసారి రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ నుంచి అన్ని తెలుగు కేంద్రాల్లో రిలే అయ్యేవి. ప్రాంతీయ వార్తల న్యూస్ రీడర్ లలో పాత తరంలో తిరుమల శెట్టి శ్రీరాములు, డి వెంకట్రామయ్య, తర్వాతి తరంలో ప్రయాగ రామకృష్ణ, సురమౌళి వార్తలు చదవడం నేను విన్నాను. మా తరం జర్నలిస్టుల్లో దేవులపల్లి అమర్ ప్రాంతీయ వార్తలు చదివే వారు. వీరి కాలం వచ్చేసరికి ప్రాంతీయ వార్తల ఉద్యోగం ఏ రోజు కా రోజు పేమెంట్ లెక్కకట్టే పీస్ వర్క్ కాంట్రాక్టు ఉద్యోగంగా పరిణమించిందని మిత్రులు చెప్పేవాళ్లు.

మధ్యాహ్నం పన్నెండున్నరకు ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమం అప్పట్లో మంచి జనాదరణ పొందింది. ఇందులో ఏకాంబరం పాత్రలో వి సత్యనారాయణ, చిన్నక్కగా శ్రీమతి రతన్ ప్రసాద్ ప్రతిరోజూ ఏదో సంగతిపై సరదాగా కొట్లాడుకునే వాళ్లు. కొట్లాట కాస్త పాకాన పడే వేళకు సరిగ్గా వేంచేసే రాంబాబు (డి వెంకట్రామయ్య) వీళ్లిద్దరికీ సయోధ్య కుదిర్చి చక్కని సమాచారంతో కమ్మని కబుర్లు చెప్పేవాడు. కొన్నేళ్ల తర్వాత రాంబాబు స్థానంలో బాలయ్య (జీడిగుంట రామచంద్రమూర్తి) రంగప్రవేశం చేసి ఏ మాత్రం స్థాయి తగ్గకుండా కార్మికుల కార్యక్రమాన్ని అలరింప జేశారు. ఈ కార్యక్రమం కార్మికుల సమస్యలు, వారి కోసం ప్రభుత్వ పథకాలు, కార్మిక చట్టాలు వంటి అనేకానేక అంశాలపై సమగ్ర సమాచారాన్ని అందించేది. టిఆర్ పి రేటింగ్స్ వంటి జనాదరణ తూకపు రాళ్లు ఉండి ఉంటే కార్మికుల కార్యక్రమానికీ, ఏకాంబరం, చిన్నక్కలకీ కచ్చితంగా టాప్ రేటింగ్స్ వచ్చి ఉండేవి. సాయంకాలం పూట ప్రసారమయ్యే `వినోదాల వీరయ్య, వార్తలకు ముందు ప్రసారమయ్యే `కబుర్లుకార్యక్రమాలను కూడా చాలా మంది ఇష్టంగా వినేవారు.

ఆకాశవాణిలో మా తరం వాళ్లకిష్టమైన కార్యక్రమాల లిస్టు గుర్తు చేసుకుంటూ పోతే చేంతాడంత పొడవవుతుంది. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం రెండు రెండున్నర గంటలప్పుడు  “రారండోయ్ …రారండోయ్  బాలబాలికలు రారండోయ్ బాల వినోదం కనరండోయ్ అన్న పాట రాగానే మనసు ఆనందంతో ఎగిరి గంతులేసేది. బాలానందం, బాలవినోదం కార్యక్రమాల్లో చిన్న పిల్లల ముద్దుముద్దు మాటలు, పాటలు వినడానికి పెద్దవాళ్లు కూడా చెవులు కోసుకునే వారు. ఆ తర్వాత వచ్చే రేడియో నాటకం, పదహైదు రోజులకో, నెలకొక సారో వచ్చే రేడియో సంక్షిప్త శబ్ద చిత్రం ఇంట్లో అందరూ కూర్చుని వినేవాళ్లం.

ఇక సినిమా పాటలు హిట్ కావడానికి అప్పట్లో రేడియోనే ఏకైక కారణం. పాట జనానికి నచ్చితే `మీరు కోరిన పాటల్లో ప్రతి రోజూ అదే పాట వచ్చేది. చిత్రసీమ, చిత్రలహరి, చిత్రగీతాలు, మీరు కోరిన పాటలు ఇలా రకరకాల శీర్షికల్లో సినిమా పాటలు ప్రసారమయ్యేవి.

ఈ కథంతా ఆకాశవాణి తెలుగు కేంద్రాలతో సాగిన అనుబంధం మాత్రమే. ఇది ఒక వయసు దాకానే సుమా. హిందీ పాటలు, క్రికెట్ కామెంటరీ వినడం రుచి మరిగాక జీవితంలో రేడియో పరిధి మరింతగా విస్తరించింది.

(బి. వెంకటేశ్వర మూర్తి, సీనియర్ జర్నలిస్టు, బెంగళూరు)

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *