ఆయన చదివింది రెండో తరగతి… అయితేనేం సమాజాన్ని ఆకళింపు చేసుకున్నాడు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన చేనేత వృత్తిని జీవనాధారంగా చేసుకున్నాడు. కష్టాల మధ్య నలిగినప్పటికీ వామపక్ష భావజాలానికి ఆకర్షితుడై… తనలోని సామాజిక స్పృహకు పదునుపెట్టి… కవితలు, కథానికలు, నాటికలు రాయడంలో రాటుదేలాడు.
వృత్తి రీత్యా చేనేత కార్మికుడు అయినా, ప్రవృత్తి రీత్యా సాహిత్యం, నాటకరంగంతో మమేకం అయ్యాడు. కార్మిక ఉద్యమాల్లోనూ పాలుపంచుకున్నాడు. అతనే గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సందుపట్ల భూపతి.
1952లో జన్మించిన భూపతి తన 12వ ఏటనే చేనేత వృత్తిలోకి ప్రవేశించాడు. చిన్ననాటి నుంచే పేదరికాన్ని అనుభవించిన ఆయన చేనేతనే ఉపాధిగా రెక్కలు ముక్కలు చేసుకుని జీవనపోరాటం చేశాడు.
భూపతి నేత నేస్తున్న కొల్లి నరసింహస్వామి మగ్గాల షెడ్డు దగ్గర్లోనే వామపక్ష అభ్యుదయవాది డాక్టర్ బొడ్డు నారాయణరావు నివాసం ఉండేది. అక్కడ నిత్యం వివిధ సామాజిక అంశాలపై చర్చలు కొనసాగుతుండేవి. ఈక్రమంలో వామపక్ష భావజాలానికి చేరువకావడంతో క్రమక్రమంగా భూపతిలో సామాజిక స్పృహ పెరిగింది.
బడికి వెళ్లి చదువుకోకపోయినా సమాజాన్ని దగ్గరగా చూడడం అలవర్చుకున్నాడు. చేనేతరంగం కష్టనష్టాలను స్వయంగా అనుభవించడమే కాకుండా తోటి కార్మికుల కడగండ్లను దగ్గరగా చూడడంతో చేనేత ఇతివృత్తాలకు అక్షర రూపం కల్పించాలనే ఆలోచన కలిగింది.
1977 దివిసీమ ఉప్పెన తర్వాత చేనేత పరిశ్రమపై ఏదైనా నాటిక రాయాలనే ఆసక్తి కలిగింది.
మగ్గాల షెడ్డులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికుల ద్వారా ఆయా ప్రాంతాల మాండలికాలు తెలుసుకోగలిగాడు భూపతి. అలా రూపుదిద్దుకున్నదే ‘సమాజంలో చేనేత కార్మికులు’ నాటిక.
నానాటికీ దిగజారిపోతున్న నేత కార్మికుల జీవనపోరాటానికి దర్పణం పడుతుందీ నాటిక. చేనేత కార్మికుల శ్రమను దోచుకుంటున్న దళారీ వ్యవస్థపై, మగ్గాల షెడ్ల నిర్వాహకులపై తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన కార్మికవర్గాల పోరాట గాథే ఈ నాటిక ఇతివృత్తం.
‘సమాజంలో చేనేత కార్మికులు’, ‘పల్లె పిలిచింది’, ‘వెలుగొచ్చింది’, ‘విజేత’, ‘చివురించిన బ్రతుకులు’ నాటికల రచనల ద్వారా భూపతి తనలోని సామాజిక కోణాలను ఆవిష్కరించాడు. చేనేత కార్మిక ఇతివృత్తాలే కాకుండా వివిధ సామాజిక అంశాలనూ తన కవితలు, నాటికల్లో సరళమైన భాషలో స్పృశించాడు.
సందుపట్ల భూపతి రాసిన నాటకాలు, నాటికలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్మికుల కార్యక్రమంలోనూ, ఆకాశవాణి నాటక విభాగం నుంచి ప్రసారమయ్యాయి.
రేడియో కేంద్రం నుంచి సంక్షేమ గీతాలు, జానపద గీతాలు, చేనేత గీతాలు ప్రసారమయ్యాయి. వివిధ పత్రికల్లో ప్రచురితమైన కవితలు, పాటలు, ధమ్మ గీతాలతో ‘దర్పణం’ అనే కవితాసంపుటి తెచ్చాడు. అలాగే, రేడియోనాటికలు సంపుటిగా ‘జీవన వలయాలు’, కథలు, వ్యాసాలు, సంక్షేమ గీతాల సంపుటిగా ‘చేనేతబతుకు’ పుస్తకాలను అచ్చొందించాడు.
వృత్తి రీత్యా చేనేత కార్మికుడు అయిన సందుపట్ల భూపతి ప్రవృత్తి రీత్యా సాహిత్యంతోపాటు నాటక రంగంలోనూ కొనసాగుతున్నాడు. సీపీఐ అనుబంధ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం పట్టణ కార్యదర్శిగా, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, ప్రజానాట్యమండలి సభ్యుడిగా సేవలందిస్తున్నాడు.
కళారంగంపై ఆసక్తి కలిగి ఒక కళాకారుడిగా, కవిగా గుర్తింపు పొందితే చాలనుకునే సందుపట్ల భూపతి సరస్వతీపుత్రుడు కాకపోయినా సమాజాన్ని నిశితంగా అధ్యయనం చేస్తూ, తనలోని సామాజికస్పృహతో అక్షర సేద్యం చేస్తుండడం విశేషం!