తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న నాగార్జున సాగర్ వచ్చారు. ఉప ఎన్నికలకు ముస్తాబవుతున్న నాగార్జున సాగర్ కు ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా రావడమనేది ఏడేళ్ల విశేషం. రావడమే కాదు, కనివిని ఎరుగని రీతిలో నాగార్జున సాగర్ ఉన్న నల్గొండ జిల్లాకు వరాలు కురిపించారు. వాటి మొత్తం విలువు 2,700 కోట్లు. ఒక అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక ముందు ఇంత పెద్ద ఎత్తున నిధులు కుమ్మరించడం రికార్డు. ఇందులో రు. 2500 కోట్లతో జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను నిర్మిస్తారు. మరొక రు. 180 కోట్లతో జిల్లాలో మండలాలను, గ్రామాలను, మునిసిపాలిటీలను అభివృద్ధి చేస్తారు. టుడే ఇన్ తెలంగాణ హిస్టరీ (Today in Telangana History)లో ఫిబ్రవరి 10 తేదీ పదో తేదీ విశేషంగా దీనిని ఇలా గుర్తుంచుకోవచ్చు:ముఖ్యమంత్రి ఒక ఉపఎన్నిక ప్రచారం స్వయంగా ప్రారంభించడం, రికార్డు స్థాయిలో నిధులను మంజూరు చేయడం.
కెసిఆర్ తొలి నుంచి ఒక విధానం ఫాలో అవుతున్నారు. అదేంటంటే, తను పోరాడి తీసుకువచ్చిన తెలంగాణలో ఉప ఎన్నికల ప్రచారం తాను చేయనవసరం లేదు. చిటికెస్తే ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు వోలేస్తారు అనే ధీమా అది. ఉప ఎన్నికల్లో కూడా ప్రచారం చేయడం హోదాకు తగ్గ పనికాదు అనేది ఆయన అభిప్రాయం. ఇంతవరకు ఇలాగే నడిచింది.
ఆయన ఏ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. 2019 హుజురనగర్ ఉప ఎన్నికల్లో ఆయన ఒక ర్యాలీలో పాల్గొంటారని అనుకున్నారు. వర్షం వల్ల అది వాయిదా పడింది. అది తప్ప ఏ ఉపఎన్నిక ప్రచారానికి ఆయన రాలేదు. కాకపోతే, ఒక హుజూర్ నగర్ విజయోత్సవంలో పాల్గొన్నారు.
ఈ వ్యవూహానికి తగ్గట్టే టిఆర్ ఎస్ ఎపుడూ గెలుస్తూనే వచ్చింది. కాని, దుబ్బాకలో ఈ సంప్రదాయం దెబ్బ తినింది. దుబ్బాక నియోజకవర్గానికి రు.100 కోట్ల ఎన్నికల హామీలు ఇచ్చారు. అవేవీ పనిచేయలేదు. దుబ్బాకలో కథ అడ్డం తిరిగింది. అది జిహెచ్ ఎం సి దాకా పాకింది.
నాగార్జున సాగర్ లో టిఆర్ ఎస్ వోడిపోతే, బిజెపి హ్యాట్రిక్ కొట్టినట్లవుతుంది. నాగార్జున సాగర్ బిజెపి గెలవరాదు. గెలవకుండా చూడాలి. అందుకే తన పాత వ్యూహాన్ని, హోదాని ఆయన పక్కన పెట్టి నిన్న నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హలియాకు తరలి వచ్చారు. ఇంకా షెడ్యూల్ కూడా విడుదల కాక ముందే క్యాంపెయిన్ ప్రారంభిస్తూ గంటన్నర సేపు ప్రసంగించారు.
కెసిఆర్ ప్రసంగంలో గమనించాల్సిన విశేషాలు చాలా ఉన్నాయి. ఈ పరిణామాలు ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చాక ఆయన ప్రవర్తనలో వచ్చిన మార్పు అని వేరే చెప్పాల్సిన పని లేదు. గుర్తుందికాదూ, ఢిల్లీ రైతులు డిసెంబర్ 8న ‘భారత్ బంద్’ కు పిలుపు ఇచ్చినపుడు దాని తెలంగాాణ ప్రభుత్వం విజయవంతం చేసింది. ఈ బంద్ ను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రులతో ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేశారో. కేంద్రం వ్యవసాయచట్టాలను రద్దు చేసే దాకా ఉద్యమం కొనసాగాల్సిందే అన్నారు. ఆయన స్వయంగా తెలంగాణ ప్రజలందరికి విజ్ఞప్తి చేసి బంద్ లో పాల్గొనాలని కోరారు. దీనితో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిల, టిఆర్ ఎస్ నాయకులు పాల్గొని భారత్ బంద్ సూపర్ హిట్ చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లక ముందు పరిస్థితి ఇది. తెలంగాణ సాధించాక కెసిఆర్ పిలుపు ఇచ్చిన తొలి ఉద్యమం ఇదే
ఆయన డిసెంబర్ 12న ఢిల్టీ వెళ్లి వచ్చారు. ఢిల్లీలో ప్రధానిని కలుసుకున్నారు. ఆయన ఢిల్లీ వచ్చాక చాలా మార్పు వచ్చిందని అన్ని పార్టీలు గమనించాయి. కాంగ్రెస్ పార్టీ మరీ బాగా గమనించింది. ‘ఢిల్లీ డీల్’ కుదిరింది అని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ అన్నారు. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆ డీల్ ముచ్చటేదో బయటపెట్టాల్సిందే అన్నారు.
కెసిఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత ఢిల్లీ రైతులు ఫిబ్రవరి 6న మూడు గంటల చక్కా జామ్ అని హైవే దిగ్బంధానికి పిలుపునిచ్చారు. ‘చక్కాజామ్’ అనే మాటే వినిపించనట్లు టిఆర్ ఎస్ పార్టీ, ప్రభుత్వం ఉండిపోయాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సారి ఎపిలుపూ ఇవ్వలేదు. చక్కా జామ్ కు మద్దతు తెలపలేదు. టిఆర్ ఎస్ కూడా మాకు సంబంధం లేదన్నట్లు ఉండిపోయింది. భారత్ బంద్ కి, చక్కా జామ్ కి ఎంత తేడా? ఇది కెసిఆర్ ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి వచ్చాక కనిపిస్తున్న మార్పు.
ఇక్కడ మరొక సంగతి. నిన్న హాలియా మీటింగ్ లో కెసిఆర్ ఏకబిగిన గంటన్నర సేపు మాట్లాడారు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఇపుడు భారతదేశంలో ఉన్న గొప్ప రాజకీయ వక్తల్లో కెసిఆర్ ఒకరు. ఆయన ఉపన్యాసం, చమత్కారాలు, చురకలు గొప్పగా ఉంటాయి. అయితే, నిన్న హాలియా మీటింగ్ లో ఆయన ప్రసంగంలో ’ముంచుకొస్తున్న ముప్పు’ బిజెపి ప్రస్తావన తేలేదు. అంతా కాంగ్రెస్ మీదే గురిపెట్టారు. కాంగ్రెస్ కుంటి గుర్రం. బిజెపి బండిసంజయ్ దూకుడు మీద ఉన్న రేసు గుర్రం. కెసిఆర్ మీద బండి సంజయ్ చేస్తున్న దాడులతో టిఆర్ ఎస్ లో భూకంపం వచ్చింది. ఆయన కెసిఆర్ ని, కెసిఆర్ కుటుంబ సభ్యులను, మంత్రులను ఉతికి ఆరేసేవాడు. తెలంగాణ వచ్చాక ఎవరూ కెసిఆర్ మీద ఇంతగా దాడి చేయలేదు. ఇలాంటి బిజెపి గురించి ఆయన మాట అన్లేదు.
రాష్ట్రంలో బిజెపి ప్రమాదం మంచు కొస్తున్నదని పత్రికలు, మేధావులు ఆందోళన చెంది ప్రకటనలు జారీ చేశారు. ఇంగ్లీష్ పత్రికల్లో కూడా వ్యాసాలు రాశారు. తెలంగాణలో బిజెపి శకం మొదలయిందని జాతీయ పత్రికలు రాశాయి. కొందరైతే తెలంగాణ తమిళనాడుకు ‘గేట్ వే’ అన్నారు. తెలంగాణ సౌత్ ఇండియా లో ‘రెండో కర్నాటక’ అన్నారు. తెలంగాణ కు చెందిన సుమారు 100 మంది కవులు, కళాకారులు, జర్నలిస్టులు బిజెపి ని అడ్డుకోండి, తెలంగాణను కాపాడండి అని ప్రకటన ఇచ్చారు. ఇలాంటి బిజెపిని కెసిఆర్ ఉప ఎన్నికల ప్రచారంలో పల్లెత్తు మాట అనకపోవడం అనుమానానికి తావిస్తుంది.
ఆయన కాంగ్రెసే ప్రధాన శత్రవు అన్నట్లు భీకరోపన్యాసం చేశారు. తెలంగాణ ఉద్యమం నాటి ప్రసంగమే చేశారు. కాంగ్రెసే తెలంగాణ కు అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ ద్రోహి అన్నారు. కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రెండుసార్లు చావు దెబ్బతిని, కోలుకోలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ మీద ఇంత శక్తి వంతమయిన విమర్శనాస్త్రం ప్రయోగించాల్సిన అవసరం ఏమిటి?
నాగార్జున సాగర్ ఎన్నికల్లో బిజెపి నుంచి ముప్పు లేకుండా ఆయన జాగ్రత్త పడ్డారా? నాగార్జున సాగర్ లో బిజెపి దూకుడు తగ్గించుకుని, ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ టిఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య ఉంటుంది అని పరోక్షంగా ఇంప్రెషన్ ఇస్తుందా? ఇలా టిఆర్ ఎస్ విజయానికి సహకరిస్తుందా? హాలియా మీటింగ్ లో కెసిఆర్ బిజెపిని ముట్టుకొనకపోవడానికి కారణం ఏమిటి?
దీనికి సమాధానం బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నాగార్జున సాగర్ క్యాంపెయిన్ ఎలా చేస్తారు, ఎలాంటి భాష వాడతారు, కెసిఆర్ మీద దాడి దుబ్బాక్, జిహెచ్ ఎంలో ప్రచారంలో లాగా పదునుగా ఉంటుందా అనే దాన్ని బట్టి ఉంటుంది.
మొన్నటి దాకా, ఉప ఎన్నికలకు బండి సంజయ్ తెలివైన వ్యూహం ఎంచుకున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఆయన కెసిఆర్ వర్సెస్ బండి సంజయ్ గా మార్చుకుని ప్రచారం చేశారు. దీనితో ‘తెలంగాణ పిత’ హోదా లో ఉన్న కెసిఆర్ తొలిసారి ఎంపి అయిన బండి సంజయ్ కు రిప్లై ఇచ్చే స్థాయికి దిగి రాలేదరు. మంత్రులకు ఇచ్చే శక్తి లేదు. ఒక వేళ ఇచ్చినా సంజయ్ ఇంకా తీవ్రంగా రెచ్చిపోతారు. అందుకే దుబ్బాక , జిహెచ్ ఎంసి ఎన్నికల్లో బిగ్గరగా వినిపించిన గొంతు బండి సంజయ్ దే. నాగార్జున సాగర్ లో ఆయన దూకుడు ఇదే వరవడిలో ఎలా ఉంటుందా? కాంగ్రెస్ వాళ్లు ఆరోపిస్తున్న ‘ఢిల్లీ డీల్’ ప్రకారం సంజయ్ నోటికి కెసిఆర్ తాళం వేయించారా? ఈ విషయాలు తెలాలంటే సంజయ్ సాగర్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేదాకా అగాల్సిందే.