తమిళనాడు టెంపుల్ రాజకీయాలు, ఎంజిఆర్, జయ గుడి ప్రారంభం

రేపు బెంగళూరు ఆసుపత్రి నుంచి  జయలలిత సెక్రెటరీ శశికళ నటరాజన్  విడుదలవుతుంటే, ఎఐఎడిఎంకెలో ఆమె మళ్లీ ప్రవేశించకుండా ఉండేందుకు  తమిళనాడు ముఖ్యమంత్రి  ఎడప్పాడి కె పళని స్వామి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒ పన్నీర్ సెల్వమ్ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఈ రోజు వారిరువురు మదురై సమీపంలో నిర్మించిన ఎంజిఆర్ జయలలిత దేవాలయాన్ని ప్రారంభించారు.  12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ దేవాలయంలో సింహాల పక్కన నిలబడి ఉన్న ఎంజిఆర్, జయలలిత నిలువెత్తు దేవతా విగ్రహాలుంటాయి. తమిళనాడు  మదురై జిల్లాలో తిరుమంగళం సమీపాన ఉన్న టి. కునత్తూరు  లో  ఈ ఆలయం నిర్మించారు.

ఈ ఆలయాన్ని రెవిన్యూ మంత్రి ఆర్ బి ఉదయ్ కుమార్ నిర్మించారు.  ఉదయకుమార్ ‘అమ్మపెరవై’ అనే సంస్థకు కార్యదర్శి కూడా. వారం రోజుల కిందట ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలసి  చెన్నై మెరీనా బీచ్ లో జయలలితకు ఫీనిక్స్ ధీమ్ మెమోరియల్ ప్రారంభించారు. అంతకు ముందు జయలలిత చెన్నై నివాసాన్ని స్మారక మందిరంగా మార్పు చేశారు.

శశికళ చెన్నై తిరిగొచ్చే నాటికి తామే జయలలితకు నిజమయిన వారసులమని చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నానా తంటాలుపడుతున్నారు. ఎందుకంటే, శశికళ రాజకీయ వ్యూహం  ఏమిటో స్పష్టంగా తెలియకపోయినా, ఎఐఎడింకెని తన అదుపులోకి తీసుకునేందుకు ఆమె ప్రయత్నం చేస్తారని చెబుతున్నారు.

శశికళ జైలుకెళ్లిన తర్వాత 2017లో ఆమెను ఎఐఎడింఎకె నుంచి వీరిద్దరు బహష్కిరించారు. నిజానికి రాజకీయాల్లో వీరద్దరికి కూడా శశికళయే  ‘గాడ్ ఫాదర్’  గా ఉన్నారు. అయితే,  అక్రమాస్తుల కేసులో ఆమె జైలుకు పోగానే పార్టీని కబ్జా చేశారు.

అయితే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నపుడు శశికళ తమిళనాడులో కాలుమోపుతున్నారు. పళని స్వామి, పన్నీర్ సెల్వమ్ ఆటలను ఆమె సాగనీయదని, తనకు ద్రోహం చేసిన ఇద్దరిని ఆమె ఏదో విధంగా దెబ్బతీస్తుందని రాజకీయాల్లోచర్చ సాగుతూ ఉంది.అయితే, తమకు బిజెపి మద్దతు ఉందని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ధీమా గా ఉన్నారు.

శశికళ నటరాజన్ (Pic credits: DTNextNews)

ఇది ఇలా ఉంటే శశికళని బెంగళూరు విక్టోరియా  ఆసుపత్రి నుంచి ఆదివారం నాడు విడుదల చేస్తున్నట్లు ఆసుపత్రి బులెటీన్ విడుదల చేసింది. పది రోజుల కిందట కోవిడ్ తో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.  ఇపుడు ఆమె ఆక్సిజన్ అవసరంలేకుండా శాచురేషన్ కు వచ్చిందని, ఎలాంటి రోగలక్షణాలు లేవని,  అందువల్ల డిశ్చార్జు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు  బులెటీన్ లో పేర్కొన్నారు.

జనవరి 27న ఆమె జైలు శిక్ష పూర్తయింది. ఆరోజే ఆమెను జైలు నుంచి విడుదల చేసేందుకు అవసరమయిన కాగితప్పని పూర్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *