తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రకటించిన ఐటీ పాలసీ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుందని, అందుకే మరొక నూతన ఐటీ పాలసీ తీసుకురానున్నట్లు ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఒక సమీక్షా సమావేశంలో ప్రకటించారు.
‘పెట్టుబడులతో పాటు ఐటీ శాఖ ద్వారా ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవల పైన ప్రధాన దృష్టి సారించడం, పౌరుడే కేంద్రంగా ప్రభుత్వ సేవలు ఉండేలా కొత్త పాలసీ ఉంటుంది. సమీప భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులోకి రానున్న టీ ఫైబర్ ద్వారా అందించాల్సిన కార్యక్రమాల పైన ఇప్పటి నుంచి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి, ’అని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు.
స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగాలు దక్కేలా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా శిక్షణ కార్యక్రమాలను రూపొందిస్తామని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా స్థానిక యువతకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నదని, ఈ దిశగా అవసరమైన కార్యాచరణను చేపట్టామని అన్నారు.